10.1-353-సీ.
"అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువుల;
యందు ముఖ్యుఁడు; ధర యతని భార్య;
వారి నిద్దఱ బ్రహ్మ వసుధపై జన్మించు;
డంచుఁ బంపిన వార లతనిఁ జూచి
"విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి;
మా కిచ్చితేనిని మహి జనింతు"
మనవుడు "నట్ల కా" కనియె వేల్పులపెద్ద;
యా ద్రోణుఁ డీ నందుఁడై జనించె
10.1-353.1-ఆ.
ధర యశోద యయ్యె; దనుజేంద్రవైరియుఁ
గమలగర్భుమాట గారవించి
తల్లిదండ్రు లనుచుఁ దగ వారి మన్నించె;
నధిక భక్తితోడ నలరి రిట్లు.
భావము:
"ఓ పరీక్షిత్తు మహారాజా! చెప్తాను విను! వసువులు అనే దేవతలలో "ద్రోణుడు" అనేవాడు ముఖ్యుడు; అతని భార్య "ధర"; బ్రహ్మదేవుడ ;వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు; "విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లు అయితే అలాగే భూమిపై జన్మిస్తాము" అన్నారు ఆ దంపతులు; బ్రహ్మదేవుడు "అలాగే" అని అనుగ్రహించాడు; ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడుగా జన్మించాడు, ధరాదేవి అనే వసువే యశోద; శ్రీమన్నారాయణుడు కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించాడు; ఎంతో భక్తితో, సంతోషంతో గౌరవించాడు;
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=50&padyam=353
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :