Tuesday, February 20, 2018

నీలకంఠ వైభవం - 13

8-229-మత్త.
బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

భావము:
ఓ పరమేశ్వరా! దేవతలూ రాక్షసులూ కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలోనుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. 
'శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా అలా దయాసాగరా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయదొంగలింపన్' (దయ + తొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: