Friday, January 12, 2018

ద్వారక అస్తమయం - 20

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.


భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్ధించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: