Friday, May 10, 2013

భాగవతం - నాట్యం

రాసం అంటే ప్రస్తుత కాలంలో వేరే అర్థం వస్తోంది కాని ఇదివరకు ఇది ఒక నృత్య రీతి మాత్రమే. భాగవతంలో దశమ స్కంధంలో ఈ రాసక్రీడా నాట్యం గురించిన వివరాలు కొన్ని ఇచ్చారు. నేను నాట్యశాస్త్రం తెలిసిన వాడను కాను. కాని నేను పాలపర్తి నాగేశ్వర శాస్త్రి మహా పండిత వరేణ్యుల సటీక టిప్పణి తాత్పర్య  సహిత భాగవతం దశమ స్కంధ గ్రంధము మున్నగు వాని నుండి అర్థం చేసుకో గలిగిన అణుమాత్ర ఙ్ఞానం నుంచి ఈ రాసక్రీడా వర్ణనలో వాడిన కొన్ని పదాలు వాటి చిన్న చిన్న వివరణలు ఇక్కడ చూపాను. (68 పదాలు 12 విభాగలు). వీటిని ఇప్పటి నాట్యాల శాస్త్రీయతతో సరిపోల్చి చూడండి. దయచేసి ఇక్కడ ఒకటి గమనించ ప్రార్థన. భాగవతం ఒక మహా పురాణ గ్రంధం. అది ఏ శాస్త్ర గ్రంధము కాదు. కాని ఇలానే అనేక శాస్త్రీయ విషయాలు వర్ణించారు. ఇలాంటి వివరాలు చూసి ఆనాటి మన శాస్త్ర గ్రంధాలు ఎంత నిశితంగా, ఎంత వివరణాత్మకంగా ఉండేవో ఊహించొచ్చు. ఇప్పుడు మళ్ళీ తర తరానికి గ్రహణ శక్తి, ధారణ శక్తి పెరుగుతున్నాయి కనుక, ఆ శాస్త్రాలు వెలికి తీసి తద్వర్తమానంలో ఆ ఙ్ఞానాన్ని ఉపయోగించి మన భారత ఉపఖండం మంచి ప్రయోజనాలు పొందుతుంది అని నా ఆశ.

రాసక్రీడా వివరణలోని పదాలు.

రాసము జంటలు జంటలుగ నుండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్య విశేషము;
త్రిభంగి - మువ్వంకల భంగిమ, మూడు వంకరలు (1కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు వంకర 2తల ఎడమపక్కకు వాల్చుటచేనగు వంకర 3కుడి చేతిని వంచి వేణువురంధ్రవులందు వేళ్ళూనుట యందలి వంకర అనెడ మూడు వంకరలు) కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ;
1.    రాసబంధము రాసములో ఒకరిని ఒకరు పట్టుకొనుట
1      శంఖబంధము - మొదట ఒకరు ఆవల ఇరువురు వారికవతల ముగ్గురునుగా రెండుపక్కల నిలబడి నడుమనుండువారికి హస్త విన్యాసాదులను చూపునట్టిది
2     పద్మాకారబంధము - తామరరేకుల వలె పేర్పుగాను వలయాకారముగాను నిలిచి పరస్పర హస్త విన్యాసాదులు చూపునది
3     వజ్రాకారబంధము - వజ్రాయుధపు అంచుల వలె ఎదురెదురుగాను వాలుగాను నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను కనబరచునది
4     కందుకబంధము - పూలచెండ్లు ఎగరవేయునట్లు ఎగురుతుగాని పూలచెండ్లను ఎగురవేయుచుగాని హస్త విన్యాసాదులు కనుపింపజేయుట
5     చతుర్ముఖబంధము - నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది
6     చక్రవాళబంధము - తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హస్య విన్యాసాదులను చూపునట్టిది
7     చతుర్భద్రబంధము - నాలుగు మూలలందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది
8     సౌభద్రబంధము - వారివారికి అనువైన చొప్పున హస్త విన్యాసాదులను చూపునది
9     నాగబంధము - పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది
10   నంద్యావర్తబంధము - అరవైనాలుగు అక్షరముల కాలముగల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది
11    కుండలీకరణబంధము - ఒంటికాలితో నిలిచి చక్రాకారముగ గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాదులను కనబరచునది, కుండలాకారముగ అందరి చేతులు పైకెత్తుకొని లయ తప్పక నటించునది
12   ఖురళీబంధము - చెట్టాపట్టాలు వేసుకున్నట్లు చేతులను కూర్చుకొని గిరగిర తిరుగునది
2.      తానకములు
1      ఏకపాదతానకము - ఒంటికాలితో అడుగులు వేయుట
2     సమపాదతానకము - రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట
3     వినివర్తితతానకము - పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట
4     గతాగతతానకము - తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట
5     వలితతానకము - ఇరుపార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహమును వాల్చుచు నటించుట
6     వైశాఖతానకము - కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట
7     మండలతానకము - నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట
8     త్రిభంగితానకము - మువ్వంకల దేహము వంచి నటనము చేయుట
3.      పాదకర్మలు
1      ఘట్టితపాదకర్మలు - రెండు అడుగులను చేర బెట్టుట
2     మర్దితపాదకర్మలు - బంకమన్ను కలియదొక్కునట్లు అడుగులెత్తి వేయుట
3     పార్శ్వగపాదకర్మములు - పార్శ్వములందు పొందునట్లు బొటనవేలితో నేలరాయుచు అడుగులుంచుట
4.      పార్థివచారములు
1      సమపాద పార్థివచారము - సరిగా అడుగులుంచుచు పోవుట
2     శకటవదనపార్థివచారము - ముందరి వైపున బండిచక్రము వలె కనబడునట్లు పాదములను తిప్పితిప్పి పెట్టుచు పోవుట
3     మతల్లిపార్థివచారము - ప్రతి పర్యాయమున కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తి పెట్టుచు పోవుట
4     శుక్తిపార్థివచారము - అడుగులు వంపుగా బోరగిలం చేర్చి పెట్టుచు పోవుట
5.      వ్యోమాచారములు (గాలిలో కాలుకదుపుట)
1      ఉంపక్రాంతవ్యోమాచారి - కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగులుంచుట
2     డోలాపాదవ్యోమాచారి - కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగులుంచుట
3     సూచీవ్యోమాచారి - మొనవేళ్ళు నేలను తాకునట్లు మెలగుట
6.      కరభావము
1      అర్థచంద్రకరభావము - అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది, శ్లో. అర్ధచంద్రకరస్సోయం పతాకేంగుష్ట సారణాత్
2     కర్తరీముఖకరభావము - కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది, శ్లో.అన్యైవచాపిహస్త తర్జనీచ కనిష్టకా బహిః ప్రసారితేద్వేత్స కరః కర్తరీ ముఖః
3     కపిత్తకరభావము - వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది, శ్లో. అంగుష్టమూర్ధ్ని శిఖరేవక్రితాయది తర్జనీ, కపిత్థాఖ్యకరస్సోయం తన్నిరూపణముచ్యతే
4     కటకాముఖకరభావము - వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది, శ్లో. కపిత్థ తర్జనీచోర్ధ్వం మిశ్రితాంగుష్ట మధ్యమా, కటకాముఖహస్తోయం కీర్తితో భరతాదిభిః
5     శుకతుండకరభావము - చిలుకముక్కు వలె బొటనవేలిని తర్జనీ అనామికలను వంచి పట్టునది, శ్లో. అస్మిన్ననామికా వక్రాశుకతుండకరోభవేత్
6     లాంగూలకరభావము - తోకవలె అనామిక తప్ప తక్కిన వేళ్ళను సగము వంచి ఎడముగలవిగా చేసి అరచేయి పల్లముగా ఏర్పడునట్లు పట్టునది, శ్లో. పద్మకోశేనామికా చేన్నమ్రాలాంగూలకోభవేత్
7     పద్మకోశకరభావము - తామరమొగ్గవలె ఐదువేళ్ళను కొంచము వంచి ఎడము కలవిగా చేసి అరచేయి పల్లముగ ఏర్పడునట్లు పట్టునది, శ్లో. అంగుళ్యో విరాళాః కించిత్కుంచితాస్త నిమ్నగాః, పద్మకోశాభిధో హస్తస్తన్నిరూపణముచ్యతే
8     పతాకకరభావము - జండావలె బొటకనవేలు తప్ప తక్కిన వేళ్ళన్నియు చాచి పట్టునది, శ్లో. అంగుళ్యఃకుంచితైంగుష్టా స్సంశ్లిష్టాః ప్రసృతాయది, సపతాకకరఃప్రోక్తోనృత్యకర్మవిశారదైః
7.      జానువర్తనలు
1      ఆస్కందితజానువర్తన - మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట
2     భ్రమరజానువర్తన - రెండు మోకాళ్ళను ఒకసారిగా ఎత్తి ఎత్తి పెట్టుచు నటించుట
3    శకటాసనజానువర్తన - బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట
8.      దైవమండలము - చేతులను ఆకాశముకేసి చాచి నటించుట
1      అలాతదైవమండలము - కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికిమీదికి తిప్పుట
2     దండలాతదైవమండలము - బాణాకర్ర తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట
3     లలితదైవమండలము - చేతులను మీదికి చాచి తిన్నగాను చక్కగాను తిప్పుట
4    విచిత్రదైవమండలము - చేతులను మీదికి చాచి నానావిధములుగాను వింతగాను తిప్పుట
9.      కరణములు
1      కటిభ్రాంతకరణము - నడుముమాత్రము కదలించుట
2     దండరచితకరణము - దేహము కర్రవలె బిగదీయుట
3     లలాటతిలకకరణము - మొగము చిట్లించుట ద్వారా కనుబొమల వెంట్రుకలు నుదిటిబొట్టువలె కనబడ చేయుట
4     మయూరలలితకరణము - నెమలి వలె ఒయ్యారముగా మెడను నిక్కించి కదలించుట
5     చక్రమండలకరణము - పాదములను కుడియెడమలుగా మార్చి ఉంచుకొని రెండుమోకాళ్ళను కౌగలించుకొనుట
6     నికుంచితకరణము - అవయవములను ముడుచుకొనుట
7     గంగావతరణకరణము - ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట
10.  చూడ్కులు
1      లలితచూడ్కులు - మనోహరభ్రూవిలాసాదులు కల చూపులు
2     కుంచితచూడ్కులు - సగము మూయబడిన చూపులు
3     వికాసచూడ్కులు - చక్కగా తెరచిన చూపులు
4    ముకుళచూడ్కులు - చిట్లించిన చూపులు
11.  శిరోభావములు
1      నికుంచితశిరోభావాలు - వంపబడిన శిరస్సు కలవి
2     అకుంచితశిరోభావాలు - నిగుడించిన శిరస్సు కలవి}
3     కంపితశిరోభావాలు - కిందమీదలుగా కదలించి శిరస్సులు కలవి
4     అకంపితశిరోభావాలు - సమముగా నిలిపిని శిరస్సులు కలవి
5     పరివాహితశిరోభావాలు - ఇరుపక్కలకు చామరములు వీచునట్లు వంచిన శిరస్సులు కలవి
6     పరావృత్తశిరోభావాలు - వెనుకకు తిప్పిన శిరస్సులు కలవి
12.అంగహారములు
1      అపరాజితాంగహారము - ఉత్సాహవర్ధక సూచకము
2     సుచికాంగహారము - అభిప్రాయమును సూచకము
3     అవిద్ధ అంగహారము - మనసునందు నాటుటను సూచకము
4     పరిచ్ఛిన్నంగహారము - భిన్నభావములను సూచకము
5     విష్కంభ అంగహారము - విషయమును విరివిగా సూచకము
6     రేచిత అంగహారము - వేళ్ళ కదలికలతో సూచకము

No comments: