పర్యావరణాన్ని రక్షించ
మని పురాణలు కూడ ఘోషిస్తున్నాయి. మన పోతనగారు ఆంధ్రమహాభాగవతంలో చతుర్థ స్కంధంలో
ప్రచేతసుల వృత్తాంతంలో వృక్షాలను నాశనం చేయవద్దని బ్రహ్మదేవు డంతటి వాడిచేత చెప్పించి
పర్యావరణ ఆవశ్యకతను ఒత్తి చెప్పాడు. (పద్యాలు 4-684 నుండి 4-943). చూడండి ఈ
ప్రచేతసుల కథ
ప్రాచీన బర్హి (అంతట
తూర్పుకి చివరలు ఉండేలా పరచిన దర్భలు కలవాడు, తన రాజ్యంలో సర్వే సర్వత్రా యఙ్ఞాలు
చేయించేవాడు) మహారాజుకి భార్య సముద్ర పుత్రి శతధ్రుతిట. వారికి ప్రచేతసులు అని పదిమంది
కొడుకులుట (చేతస్సు అంటే మది / ప్రాణము, ప్ర అంటే మిక్కిలి). వారికి విడి విడిగా
పేర్లులేవుట. వారు అందరు అంతా కలిసి కట్టుగా ఉంటారుట (అంటే సృష్టిలోని ఙ్ఞానులు సర్వులనా?). వారిని తండ్రి (కారణ భూతుడు) వంశాభివృద్ధికై
తపస్సు చేయమని ఆఙ్ఞాపించాడు. వారు సముద్రంలో తపస్సు చేస్తున్నారు (జీవులు
సముద్రంలోనే మొదట పుట్టాయిట!). భగవంతు (ప్రభువు) డగు హరి
ఆఙ్ఞమేర తపస్సు ఆపి బైటకొచ్చారు. భూమిపై చెట్లు విపరీతంగా పెరిగిపోయాయని కోపం
తెచ్చుకొని చెట్లని తమ తపోగ్నితో కాల్చివేస్తున్నారు. వృక్షాలు అడ్డంగా ఉన్నాయని
ఆగ్రహించారుట. బ్రహ్మదేవుడు (సృష్టి కర్త) వారిని అనునయించి ఆ ప్రళయాన్ని ఆపాడు, బ్రహ్మ
ఆఙ్ఞ ప్రకారం వృక్షాలు తమ పెంపుడు కూతురు మారిషను (మారిషను తెలుగులో తోటకూర
అంటారు.) ఇచ్చాయి. ఆమెను వారందరు కలిసి పెళ్ళాడారు.
ఈ కథ నీతి: - చెట్లని నాశనం చేయకండి. వాతావరణం నాశనమైపోయి
అకాల ప్రళయం వచ్చేస్తుంది.
మరి అందుచేత మన
వాతావరణాన్ని మనమే కాపాడుకుందామే.
ఇంత చక్కటి
వృత్తాంతాన్ని బమ్మెర వారు ఎంత చక్కటి పద్యాలు వాడారో చూడా లనిపిస్తోందా. ఐతే కింద కొన్ని
పద్యాలు ఉన్నాయి ఆనందించండి.
4-938-వ.
తదనంతరంబ ప్రచేతసులు భగవదాఙ్ఞ శిరంబులధరియించి సముద్రసలిల
నిర్గతు లయి,
4-939-క.
భూరి సమున్నతి నాక
ద్వార నిరోధంబు గాఁగఁ దగఁ బెరిఁగిన యా
భూరుహ సంఛన్నాఖిల
ధారుణి నీక్షించి రాజతనయులు వరసన్.
4-940-చ.
ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో
చనుగతి నుగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా
ననయముఁజేయఁబూనిన జనాధిపసూనులమోములందుఁ దా
మనల సమీరముల్ జననమంది కుజంబులఁ గాల్పఁజొచ్చినన్.
4-941-క.
నలినభవుఁ డా మహీజ
ప్రళయముఁ గని వచ్చి ధరణిపాల తనూజా
తుల మధురోక్తుల నుపశాం
తులఁ గావించుచును నయము దూఁకొనఁ బలికెన్.
4-942-వ.
అట్లు పలికి వారల నుపశమిత క్రోధులం జేసిన యనంతరంబ,