2-201-మ.
హరి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స
త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక
స్ఫురణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం
దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నన్జెప్ప నే లొండొరున్.
2-202-చ.
ఇతరముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా
శ్రితజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం
చితదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా
రతుల దురంతమై తనరు నవ్విభు మాయఁ దరింతు రెప్పుడున్.
భావము:
నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను. ఇక తెలుసుకోవడానికి సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా. ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదలి పెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేశాడు. వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తు ఉంటాడు. అట్టి శేషుడు గూడ ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇక ఇతరుల సంగతి చెప్పాలా. ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్లను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి, కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైనవాళ్లు మాత్రమే సాటిలేనిది, దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=2&Ghatta=26&padyam=201
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :