Tuesday, January 23, 2018

ద్వారక అస్తమయం - 23

11-90-క.
జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

భావము:
ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, “లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు” అని స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&padyam=90

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, January 19, 2018

ద్వారక అస్తమయం - 22

11-88-క.
నారాయణు వచనముల క
పారంబగు సమ్మదమున బలములతోడన్‌
దార సుత మిత్ర యుతులై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌.
11-89-వ.
అంత.

భావము:
శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&padyam=88

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, January 13, 2018

ద్వారక అస్తమయం - 21

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ; 
బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె; 
నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల; 
జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె; 
బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార! 
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.


భావము:
శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Friday, January 12, 2018

ద్వారక అస్తమయం - 20

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.


భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్ధించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Thursday, January 11, 2018

ద్వారక అస్తమయం - 19

11-83-క.
సుర గరుడ ఖచర విద్యా
ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
11-84-క.
కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

భావము:
“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&padyam=83

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, January 8, 2018

ద్వారక అస్తమయం - 18

11-81-క.
దుష్టజన నిగ్రహంబును
శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా
సృష్టి నవతార మొందెను 
స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌.
11-82-వ.
అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు మనిన శుకుం డిట్లనియె.


భావము:
బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్ధించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు. ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తుతో చెప్పగా అతడు “మునీంద్రా! భూభారాన్ని తగ్గించటం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు; ఋషీశ్వరులు తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా ప్రవేశించారు? అటు పిమ్మట ఏమయింది? వివరంగా చెప్పండి. విష్ణు కథామృతం చెవులారా ఎంత విన్నా, తృప్తికలగటం లేదు. భక్తరక్షకుడైన శ్రీహరిచరిత్ర ఏ రీతిగా కొనసాగింది? ఈ వృత్తాంతమంతా తెలియజెప్ప” మని అడుగగా శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Sunday, January 7, 2018

ద్వారక అస్తమయం - 17

11-80-సీ.
కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ! ;
విని యఘంబులఁ బాసి వెలసి తీవు
భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి; 
కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద
నారాయణుండు నీ నందనుం డను మోహ; 
మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు
మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి; 
సిద్ధించె దేహసంశుద్ధి నీకు
11-80.1-తే.
సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ
బావనంబైతి శిశుపాల పౌండ్ర నరక
ముర జరాసంధ యవనులు ముదముతోడ
వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యు.

భావము:
“వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&padyam=80

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, January 5, 2018

ద్వారక అస్తమయం - 16

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.
11-27-క.
"చిత్తం బే క్రియ నిలుచుం? 
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "
భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు. “మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేశాడు.”



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Monday, January 1, 2018

ద్వారక అస్తమయం - 15

11-25-క.
ధరణీసురశాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే? 
నరు లనఁగ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?


భావము:
బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::