Friday, December 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౭(707)

( అవధూత సంభాషణ ) 

11-100-క.
మోహితుఁడై వసుకాంక్షా
వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం
డూహాపోహ లెఱుంగక
దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌.

భావము:
మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday, December 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౬(706)

( అవధూత సంభాషణ ) 

11-99-వ.
ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున.

భావము:
ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=99

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౫(705)

( అవధూత సంభాషణ ) 

11-98-క.
ఇవి తెలియవలయు నాకును
బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు మనంగాఁ
వివరము వినుమని కృష్ణుఁడు
సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్‌.

భావము:
ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=98

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౦౪(704)

( అవధూత సంభాషణ ) 

11-97-వ.
ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన.

భావము:
దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=97

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday, December 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౩(703)

( అవధూత సంభాషణ ) 

11-96-ఉ.
దారలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భారముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.

భావము:
భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=96

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Monday, December 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౨(702)

( అవధూత సంభాషణ ) 

11-94-వ.
అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె.
11-95-సీ.
"పరధన పరదార పరదూషణాదులఁ-
  బరవస్తుచింతదాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కటమున్న-
  తనువు చంచలతను దగులకుండ
బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న-
  శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న-
  భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
11-95.1-తే.
దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత!

భావము:
దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. “ఓ సచ్చరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday, December 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౧(701)

( అవధూత సంభాషణ ) 

11-92-ఉ.
పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం
దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై
శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే
వంకనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌.
11-93-క.
అవధూత వల్కె నంతటఁ
"బ్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్‌
తవిలిన నిరువదినలువురు
నవనిన్‌ విజ్ఞాని నైతి" నని పల్కుటయున్‌.

భావము:
పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=93

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..