Thursday, October 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౦(660)

( కృష్ణ సందర్శనంబు ) 

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౯(659)

( కృష్ణ సందర్శనంబు ) 

11-24-క.
"మది సెడి కన్నులుగానక
మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?
11-25-క.
ధరణీసురశాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే?
నరు లనఁగ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?

భావము:
“మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=25

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, October 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౮(658)

( కృష్ణ సందర్శనంబు ) 

11-23-వ.
మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

భావము:
గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=23

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, October 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౭(657)

( కృష్ణ సందర్శనంబు ) 

11-21-క.
యదుడింభకులను గనుఁగొని
మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు
సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.
11-22-క.
"వాలాయము యదుకుల ని
ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్‌.

భావము:
యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ “యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=22

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, October 16, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౬(656)

( కృష్ణ సందర్శనంబు ) 

11-19-క.
దర్పించి యాదవులు తమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ
గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.
11-20-ఉ.
మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
"బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై.

భావము:
అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=20

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, October 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౫(655)

( కృష్ణ సందర్శనంబు ) 

11-18-వ.
అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

భావము:
ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=18

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, October 14, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౪(654)

( కృష్ణ సందర్శనంబు ) 

11-16-మత్త.
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై,
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై,
పెక్కురూపులు దాల్తు, నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!
11-17-క.
శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "

భావము:
పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=17

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :