Thursday, September 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౨(642)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1331-క.
"నరవర! దేవాసుర సం
గరమును మును నిహతులైన క్రవ్యాద సము
త్కరము నరేశ్వరులై ద్వా
పరమున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.
10.2-1332-క.
హరి తద్వధార్థమై ని
ర్జరులను యదుకులము నందు జనియింపింపం
ధర నూటొక్క కులం బై
పరఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?

భావము:
“ఓ నరేంద్రా! పూర్వం దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులు అందరు ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించసాగారు. విష్ణుమూర్తి ఆ రాక్షసులను చంపడం కోసం దేవతలను యదుకులంలో జన్మించేలా చేశాడు. అందువలన, యాదవుల యందు నూటొక్క కులాలు ఏర్పడ్డాయి. వారిని అందరిని లెక్కపెట్టడం బ్రహ్మదేవుడికి కూడ సాధ్యం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1332

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, September 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౧(641)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1330-వ.
అని మఱియు నిట్లను; “వారలు ప్రద్యు మ్నానిరుద్ధ, దీప్తిమ ద్భాను, సాంబ, మిత్ర, బృహద్భాను, మిత్రవింద, వృ కారుణ, పుష్కర, దేవబాహు, శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను"మని యిట్లనియె.

భావము:
అని శుకుడు పరీక్షుత్తుతో మళ్ళీ ఇలా అన్నాడు. “రుక్మిణి మున్నగు ఆ అష్టపట్టమహిషలకు కలిగిన పుత్రులలో ప్రసిద్ధులైనవారు పద్దెనిమిది మంది, వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు అనేవారు. త్రివక్ర అనే ఆమెకి కృష్ణుని వలన పుట్టిన ఉపశ్లోకు డనేవాడు శ్రీకృష్ణభక్తుడై నారదునికి శిష్యుడై సాత్వతతంత్రం అనే వైష్ణవ స్మృతిగ్రంథాన్ని రచించాడు. స్త్రీలకూ శూద్రులకూ దాసజనానికి ఈ గ్రంథం పఠన మాత్రం చేతనే ముక్తిమార్గాన్ని అందిస్తుంది. ఈ విధంగా కృష్ణుడి పుత్రులు అసంఖ్యాకులై ఆయురార్యోగ్యాలతో, మహాబలంతో, బ్రహ్మణ్యులై, మహోన్నతులై ప్రకాశించారు. వారందరినీ లెక్కపెట్టడానికి పదివేలసంవత్సరాలైనా చాలవు. వారి కోసం నియమించబడిన గురువులే మూడుకోట్లఎనభైఎనిమిదివేలనూరుమంది ఉన్నారు ఇక శ్రీకృష్ణుని సంతతి లెక్కించడం ఎవరికి మాత్రం సాధ్యము అవుతుంది. అంతే కాదు మరొక మరొక విశేషం ఉంది చెప్తాను.” అని శుకుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1330

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౦(640)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1328-ఉ.
"వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే
పారఁగ బూని ధర్మమును నర్థముఁ గామము నందుఁ జూపుచుం
గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై.
10.2-1329-సీ.
హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర-
  షోడశసాహస్ర సుందరులను
మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ-
  కన్నిరూపములు దా నర్థిఁ దాల్చి
కైకొని యొక్కక్క కామినీమణి యందు-
  రమణ నమోఘ వీర్యమునఁ జేసి
పదురేసి కొడుకులం బడసె రుక్మిణ్యాది-
  పట్టమహిషులకుద్భవులు నైన
10.2-1329.1-తే.
నందనులలోన ధరణి నెన్నంగ బాహు
బల పరాక్రమ విజయ సంపద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "

భావము:
“రాజోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా వేదోక్తమైన పద్ధతిలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, ధర్మార్ధ కామాదులను సాధిస్తూ, ఉత్తములకు తానే దిక్కు అయి ఉంటూ, లోకం తనను అనుసరించి ఇలా నడవాలి అని తెలుసుకునేలా, తానూ ఒక సంసారిలా శ్రీకృష్ణుడు నటించాడు. పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1329

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 26, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౯(639)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1324-మ.
అరవిందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా
సరసాలాప విలోకనానుగత చంచత్సౌఖ్య కేళీరతిం
దరుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!
10.2-1325-వ.
అదియునుం గాక.
10.2-1326-మ.
హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
విరతిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
బరిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
దరు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "

భావము:
ఓ రాజా! ఆ పదహారువేలవంద మంది శ్రీకృష్ణసతులు పద్మాక్షుని పాదారవిందాలపై అనురాగాలతో, సరససల్లాపాలుతో, మధుర వీక్షణలతో, మహా సౌఖ్యాలతో, కేళీరతులతో గొప్ప ఉత్సాహాలతో సొక్కి సోలుతూ ఉన్నారు. సంపూర్ణంగా శ్రీకృష్ణ తత్పరులై ఇతర ధ్యాసలు లేకుండా ఉన్నారు. అంతేకాకుండా మహారాజ! ఎంతటి మూఢాత్ములైనా హరినామ సంకీర్తనం ఒక్కసారి వింటేనే ముక్తిని పొందుతారుట. అలాంటిది ఆ మహానీయుడినే చూస్తూ; అతడిని కౌగలిస్తూ, తాకుతూ; అతనితో నవ్వుతూ, సంభాషిస్తూ; ఆ అంగనలు ఆనందపారవశ్యులు కావడంలో ఆశ్చర్యం ఏముంది?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1326

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౮(638)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1323-వ.
అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన, మండప, గోపుర, ప్రాసాద, సౌధ, చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస, చక్రవాక, కారండవ, సారస, క్రౌంచముఖ జలొవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల, కుముద, కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత, కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడు చుండె; నంత.

భావము:
అలా శ్రీకృష్ణుడు దేవేంద్రవైభవంతో సగౌరవంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ద్వారకానగరంలో చాలా కాలం ఉన్నాడు. ఆ నగరంలో రత్నాలు పొదిగిన బంగారు మయమైన విమానాలు, మండపాలు, గోపురాలు, ప్రాసాదాలు, డాబాలు, సౌధాలు, రాజభవనాలు ముంగిళ్ళు ఉన్నాయి. అక్కడి సరోవరాలలో ఉత్తుంగ తరంగాలలో ఊయలలూగే కలహంసలు, కారండాలు, చక్రవాకాలు, బెగ్గురులు, క్రౌంచాలు మున్నగు నీటి పక్షులు విహరిస్తున్నాయి. తెల్ల తామరలు, తెల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు యందు స్రవిస్తున్న మకరందాన్ని త్రాగి మత్తిల్లిన తుమ్మెదల ఝంకార గానాలు మారుమోగుతున్నాయి. ఎడతెగని వసంత ఋతువు విరాజిల్లుతున్నట్లు సదా చిగురించి, మొగ్గలు తొడిగిన లేత మామిడి పల్లవాలను తిని కుతూహలంతో వగరెక్కిన గొంతులతో కూసే కోయిలల కమ్మని కూజితాలు వినిపిస్తున్నాయి. అందరూ ఇష్టపడె సుందరమైన తియ్య మామిడిపళ్ళ రసాన్ని త్రాగి ఆనందంతో పలికే చిలుకల గోరువంకల తియ్యని పలుకులు వీనుల విందుచేస్తున్నాయి. మెత్తని పలుకులతో అలరించే అప్సరసల బలిష్ఠమైన స్తనములపై పూయబడిన కుంకుమాది సుగంధ ద్రవ్యాల సువాసనలు మనోఙ్ఞంగా వస్తున్నాయి. మలయ పర్వత సానువుల్లో సంచరించే శంబర స్త్రీల కొప్పులలోని పూలమాలలు సురభి పరిమళాలుతో కూడిన మందమారుతాలు వీస్తున్నాయి. ఏలకి ఆది లతలు మనోహరంగా పోషింపబడుతున్నాయి. సరస్సు తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు యందు విదూషకుల, నాట్యకత్తెల ఆటపాటలుతో మనోఙ్ఞంగా ఉన్నాయి. కర్పూరము, చందనము, లేత మామిడి, మద్ది, నీప, చీకటి మాను, నేరేడు, నిమ్మ, వేప, కడిమి మున్నగు అందమైన చెట్ల నీడలలో చంద్రకాంత శిలా వేదికలు మీద పింఛాలు ఎత్తి నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి. కృత్రిమ కొండలు, ఇసుక తిన్నెలు వద్ద వేసిన వట్టివేళ్ళ పందిరులు అలరిస్తున్నాయి. నీళ్ళుతోడే కొయ్య యంత్రాలకు కట్టిన కుండల నుండి జలజల మంటూ నీళ్ళు జాలువారుతున్నాయి. అట్టి దివ్యశోభాన్వితమైన ద్వారకలో, నిరంతరం హేమంతమే అనిపించే ప్రదేశాలలో శ్రీకృష్ణుడు తన పదహారువేలనూరు మంది మానినీమణులతో కలగలిసి అందరికి అన్ని రూపుల వాడు అయి, మెరుపు తీగల నడుమ నీలిమేఘంలా మెరుస్తున్నాడు. ఆడ ఏనుగులతో విహరించే దిగ్గజమును పోలి జలక్రీడాది అనేక క్రీడలతో విహరిస్తున్నాడు. మురళి, వీణ మున్నగు రక రకాల వాయిద్య వినోదాలతో అంతఃపురంలో కొలువుతీరి మంజుల గానాలు ఆస్వాదిస్తున్నాడు. కవి, గాయక, సూత, వంది, మాగధాదుల స్తోత్రాలకు పరవశాలు పొందుతున్నాడు. నటనటీజనుల నాట్యాలతో, విదూషకుల సరస పరిహాస పలుకులు, మృదు మధురోక్తులతో పొద్దుపుచ్చుతూ ద్వారకలో ఆనందంగా ఉన్నాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1323

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౭(637)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1321-మ.
హరి, సర్వేశుఁ, డనంతుఁ, డాద్యుఁ, డభవుం, డామ్నాయసంవేది, భూ
సుర ముఖ్యప్రజలన్ సమస్త ధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ
బరిరక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం
బర మోత్సాహ మెలర్ప భూరిశుభ విభ్రాజిష్ణుఁడై ద్వారకన్.
10.2-1322-క.
జనవినుతముగాఁ బెక్కు స
వనములు దనుఁ దాన కూర్చి వైదిక యుక్తిం
బొనరించుచు ననురాగము
మనమునఁ దళుకొత్త దైత్యమర్దనుఁ డెలమిన్.

భావము:
అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు. సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1322

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౬(636)

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 

10.2-1318-చ.
అనిమిషనాథనంద,నుఁ డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ
జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ, బుండరీకనే
త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్
మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!
10.2-1319-తే.
వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ
గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు
వందనము లాచరించి యానంద మొందె.

భావము:
ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు. పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1319

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :