Thursday, June 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౯(579)

( శ్రుతి గీతలు ) 

10.2-1206-సీ.
పరమవిజ్ఞాన సంపన్ను లైనట్టి యో-
  గీంద్రులు మహితనిస్తంద్ర లీలఁ
బరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీ-
  పర్వత ముఖర ప్రపంచ మెల్ల
బరఁగ బ్రహ్మస్వరూపము గాఁగఁ దెలియుదు-
  రెలమి నీవును జగద్విలయవేళ
నవశిష్టుఁడవు గాన ననఘ! నీ యందు నీ-
  విపుల విశ్వోదయవిలయము లగు
10.2-1206.1-తే.
ఘట శరావాదు లగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణరూపంబుఁ దాల్చి లీలఁ
గడఁగు నీయందు బుద్ధి వాక్కర్మములను.
10.2-1207-క.
అలవడఁ జేయుచు నుందురు
బలకొని యిలఁ బెట్టఁబడిన పదవిన్యాసం
బులు పతనకారణముగా
నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.

భావము:
“ఓ మహానుభావ! కమలాక్షా! బ్రహ్మ విజ్ఞాన సంపన్నులైన పరమ యోగీశ్వరులు ప్రమత్తమైన విధంగా కనబడేది అయినట్టి భూమి, పర్వతాలు మున్నగు వాటి అన్నింటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపం గానే భావిస్తారు. ప్రళయకాలంలో నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. కుండలూ, మూకుళ్ళూ మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మృత్తికా రూపాలైనట్లే, విస్తారమైన ఈ విశ్వం మొత్తము పుట్టుక నాశము రెండూ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ సమస్త విశ్వానికీ నీవే కారణభూతుడవు. అట్టి నీ యందు వాక్కాయ కర్మల పూర్వకంగా త్రికరణ శుద్ధిగా విజ్ఞానసంపన్నులు నీ యందే బుద్ధిని లగ్నంచేసి జన్మము ఎత్తడానికి పతనానికి కారణంగా గ్రహిస్తారు. త్రికరణశుద్ధిగా నిన్నే సేవిస్తూ కృతార్ధులవుతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1207

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Wednesday, June 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౮(578)

( శ్రుతి గీతలు ) 

10.2-1204-సీ.
"జయజయ హరి! దేవ! సకలజంతువులకు-
  జ్ఞానప్రదుండవుగాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సం-
  తానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా-
  యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య
కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు-
  నున్న నీయందుఁ బయోరుహాక్ష!
10.2-1204.1-తే.
తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన
ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన
సాంబుజాత మధువ్రత!" యని నుతించి.
10.2-1205-వ.
"అదియునుం గాక.

భావము:
“ఓ దేవ! శ్రీహరి! పద్మాక్షా! మహర్షి మానస విహారా! నీకు జయమగు గాక, నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. కనుక, ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణైశ్వర్య సంపన్నుండవు కావున, మా అందరిలోను ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీ లోనే సకలవేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మా కున్న బంధాన్ని ఛేదించు.” అని భగవంతుని కీర్తించి ఇంకా ఇలా పలుకసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1204

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Tuesday, June 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౭(577)

( శ్రుతి గీతలు ) 

10.2-1203-వ.
అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె.

భావము:
ఇలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు. “శుకమహర్షి! ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్త్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది” అని కోరాడు అందుకు శుకయోగీంద్రుడు పరీక్షన్నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. “సకల చరాచరములందు సర్వాంతర్యామియై ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శ్రుతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణకథ ఉంది. చెప్తాను, విను. పానుపుమీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్ధ్యాలను వందిమాగధులు కొనియాడేవిధంగా కల్పాంతసమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి (శ్రుతిగీతలు) ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని, శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తాతం వివరిస్తాను” అని శుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1203

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, June 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౬(576)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1201-క.
అని సర్వలోక విభుఁ డగు
వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని
జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్.
10.2-1202-చ.
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"

భావము:
లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు. ఓ రాజా పరీక్షిత్తు! మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని, విప్రుడు శ్రుతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతోపాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1202

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౫(575)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1199-క.
“నా మది విప్రులపైఁ గల
ప్రేమము నా తనువు నందుఁ బెట్టని కతనన్
భూమీసురు లర్హులు; నీ
వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!
10.2-1200-క.
ఇదియే నా కిష్టము ననుఁ
బదివేలవిధంబు లొలయ భజియించుటగా
మది కింపగు నటు గావున
వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్!”

భావము:
“ఓ శుద్ధాత్మా! వారు మిక్కిలి అర్హులు అగుటచే, నా మనసులో నా శరీరం మీద కన్నా బ్రాహ్మణుల మీద నాకు ప్రేమ అధికముగా గలదు. కనుక నీవు ఈ మునులను పూజించుము. నాకు ఇష్టం కూడా అదే. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేల విధాల పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక, సుస్థిర భక్తితో విప్రులను పూజించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1200

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౫౭౪(574)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1198-వ.
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును, విప్రులును, దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.

భావము:
అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేసారు. పుణ్యస్థలాలూ, విప్రులూ, దేవతలూ, స్పర్శ, దర్శన, అర్చన వలన జీవుల పాపాలు సమస్తమూ తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోను గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు.” అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1198

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౭౩(573)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1197-సీ.
“నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య!-
  లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవననిరతుని నన్ను నే-
  పనిఁ బంపె దానతి” మ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు-
  కర మాత్మకరమునఁ గదియఁ జేర్చి
పాటించి యతనితోఁ బలికెఁ “దపశ్శక్తి-
  వఱలిన యమ్మునివర్యు లెపుడుఁ
10.2-1197.1-తే.
దమ పదాంబుజరేణు వితానములను
దవిలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు వలయు నెడల
కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు.

భావము:
కృష్ణా! వేదవేద్యా! లోకరక్షకా! భక్తవరదా! నీకు నమస్కరిస్తున్నాను. నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో అజ్ఞాపించు.” ఇలా పలుకుతున్న శ్రుతదేవుడి పలుకులు విని గోవిందుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని, ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసే వారు, పరమ తపోధనులు అయిన ఈ మునివరులు నాతోపాటు తాము కోరిన చోటికి వస్తూంటారు. ఈనాడు నావెంట నీ ఇంటికి విచ్చేసారు. నీ అదృష్టం పండింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1197

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :