Sunday, February 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౭(487)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1039-వ.
ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న, గద, సాంబ, సుచంద్ర, శుక, సారణానిరుద్ధ, కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ. 

భావము:
బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. పిమ్మట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1039 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




శ్రీకృష్ణ విజయము - ౪౮౬(486)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1037-సీ.
ధరణీశ! బలుఁడును సరసిజోదరుఁడు న-
  వోన్నతసుఖలీల నుండునంతఁ
జటులోగ్రకల్పాంత సమయమందునుఁ బో-
  దృగసహ్యమై సముద్దీప్త మగుచు
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు-
  టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి
మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు-
  మాఱులు ఘనబలోదారుఁ డగుచు
10.2-1037.1-తే.
నిజభుజాదండ మండిత నిబిడ నిశిత
చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార
మహితధారావినిర్భిన్న మనుజపాల
దేహనిర్ముక్త రుధిర ప్రవాహములను.
10.2-1038-తే.
ఏను మడువులు గావించె నెచటనేని
నట్టి పావనసుక్షేత్రమగు శమంత
పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ
జనిరి బలకృష్ణులును సంతసం బెలర్ప. 

భావము:
“మహారాజా బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వలె చూడశక్యంగాని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు అవక్రవిక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క మార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన కఠోర కుఠారంతో రాజలోకం కుత్తుకలు తునిమాడు. లోకాన్ని నిఃక్షత్రం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే అలా ప్రవహించిన మహీపతుల రక్తప్రవాహాన్ని పరశురాముడు ఐదుమడుగులు కావించాడు. అవి శమంతపంచకం అనే పేరుతో పవిత్రక్షేత్రంగా రూపొందాయి. అట్టి శమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1038 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Friday, February 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౫(485)

( శమంతకపంచకమున కరుగుట ) 

10.2-1034-వ.
అనిన మఱియుం బరాశరపౌత్రున కర్జునపౌత్రుం డిట్లనియె.
10.2-1035-ఆ.
"దుష్టశిక్షణంబు దురితసంహరణంబు
శిష్టరక్షణంబుఁ జేయఁ దలఁచి
భువిని మనుజుఁ డగుచుఁ బుట్టిన శ్రీ కృష్ణు
విమలచరిత మెల్ల విస్తరింపు."
10.2-1036-వ.
అనిన శుకుం డిట్లనియె. 

భావము:
అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. “పాపాన్ని నాశనం చేయడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం, మానవ రూపంతో అవతరించిన శ్రీకృష్ణుడి నిర్మల చరిత్ర సవిస్తరంగా ఇంకా నాకు వివరించు.” ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=74&Padyam=1035 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Thursday, February 24, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౪(484)

( అటుకులారగించుట ) 

10.2-1032-ఆ.
దేవదేవుఁ, డఖిల భావజ్ఞుఁ, డాశ్రిత
వరదుఁ డైన హరికి ధరణిసురులు
దైవతములు గాన ధారుణీదివిజుల
కంటె దైవ మొకఁడు గలడె భువిని?
10.2-1033-క.
మురహరుఁ డిట్లు కుచేలుని
చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స
త్పురుషుల కిహపరసుఖములు
హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!" 

భావము:
దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు. ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలుని చరితార్థుడినిగా చేసిన ఈ వృత్తాంతం విన్న వారికి ఇహపర సుఖాలూ, హరిభక్తి, యశస్సూ కలుగుతాయి.” అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1033 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Wednesday, February 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౩(483)

( అటుకులారగించుట ) 

10.2-1031-వ.
అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును. 

భావము:
భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1031 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Tuesday, February 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౨(482)

( అటుకులారగించుట ) 

10.2-1030-క.
నను నా వృత్తాంతంబును
దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ
మ్మని యీ సంపద లెల్లను
నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్. 

టీకా:
ననున్ = నన్ను; నా = నా యొక్క; వృత్తాంతంబును = విషయమును; తన = తన యొక్క; మనమునన్ = మనస్సు నందు; కనియున్ = తెలిసికొనినను; ఏమి = ఏమియును; తడవక= ఆలస్యము చేయక; ననున్ = నన్ను; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఈ = ఈ; సంపదలు = సంపదలు; ఎల్లనున్ = సమస్తమును; ఒనరన్ = చక్కగా; ఒడగూర్చి = కలుగజేసి; నన్నున్ = నన్ను; ఒడయునిన్ = ప్రభువును; చేసెన్ = చేసెను. 

భావము:
ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1030 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :




Monday, February 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౮౧(481)

( అటుకులారగించుట ) 

10.2-1028-వ.
సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు.
10.2-1029-ఆ.
ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా
కబ్బు టెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె! నళినాక్షుసన్నిధి
కర్థి నగుచు నేను నరుగుటయును. 

భావము:
కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది. ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=73&Padyam=1029 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :