Sunday, October 31, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౩(383)

( శిశుపాలుని వధించుట ) 

10.2-804-వ.
మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజల బిందుసందోహ కందళిత మందహాసచంద్రికాసుందర వదనారవిందంబుల నిందిందిర రుచిర చికురబృందంబులు చిందఱవందఱలై సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశృంగ సంగతంబులైన సంకుమద మలయజ ముఖ సురభితోయంబులు సముదాయంబులై తమ తోయంబులవారి పయిం జల్లుచుఁ జెందొవలఁ గెందలిరుల రచియించిన చిమ్మనగ్రోవులఁ దావులు గల పూఁదేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీఱఁ, గ్రేవల నుండి యిమ్ములం గని చిమ్ముచు, మృగమద కుంకుమ పంకంబునుం గొంకక బింకములం జంకెన లొలయం బంకజ సన్నిభంబు లగు మొగంబుల నేమఱించి చరుముచు నుల్లంబులు పల్లవింపఁ బెల్లడరి యందియలు గల్లుగల్లని మొరయఁ, గ్రేళ్లుదాఁటుచుం జారు చంద్రికాసార ఘనసారధూళి మిళిత రజనీపరాగంబు రాగంబు రంజిల్లం, గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుఁ జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు కుచంబుల కెత్తువత్తుమని బిత్తరించు పువ్వుగుత్తులం దత్తఱంబున వ్రేయుచుఁ, బరిహసించుచు, నన్యోన్యకర కిసలయ కనకకరండభరితంబగు పన్నీటం జెంగావి జిలుఁగుఁ బుట్టంబులు దట్టంబుగాఁ దోఁగి మర్మంబులు బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమ కనుఱెప్ప లడ్డంబు సేయుచుఁ, బురుషులుం దాము నారామ లభిరామలీలా రసోక్తు లెనయ, నంతరంగంబుల సంతసంబునం బంతంబులిచ్చుచు వసంతంబు లాడి రవ్వేళ, నతుల విమానారూఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకశిబిక లెక్కి, నిజచేటికాజనంబులు సేవింపఁ జనుదెంచు భూకాంతకాంతాజనంబులం దమ సరసంబులకు నర్హంబులైన ధరణీపాల వధూలలామంబు లాదరించు చెలులపైఁ దమ సఖీజనంబులం బురికొల్పి చల్లించుచు, భావగర్భితంబులగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమల లీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం జని రవ్విధంబున, నిజసామ్రాజ్య విభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున. 

భావము:
ఆ వేశ్యాంగనలు చిరునవ్వులు చిందే ముఖారవిందాల మీద చిందరవందరగా తుమ్మెదలవంటి ముంగురులు పడుతుండగా; పరిమళభరితమైన పన్నీరు జల్లులు బంగారు కొమ్ములతో ప్రక్కనున్నవారి మీద చల్లుతూ; ఎఱ్ఱకలువలు, ఎఱ్ఱచిగురులి ఆకులతో చేసిన చిమ్మనగ్రోవులతో మకరందం నింపి వరసైనవారి మీద చిమ్ముతూ; కస్తూరితో మిళితమైన కుంకుమపంకాన్ని ప్రక్కనున్నవారి ముఖాలపై పట్టించుతూ; పూగుత్తులతో పరస్పరం సరదాగా కొట్టుకుంటూ; ఒకరితో ఒకరు పరిహాసమాడుతూ వసంతా లాడుకున్నారు. బంగారుపల్లకీల నెక్కి చెలికత్తెలు సేవింపగా వస్తున్న దేవకాంతలవంటి రాజకాంతలు తమ సరసాలకు యోగ్యురాండ్రైన రాచకాంత లాదరించే చెలికత్తెల మీదకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ; నర్మగర్భసంభాషణలు చేస్తూ; చిరునవ్వులు చిందిస్తూ; ప్రయాణం సాగించారు. ఇలా మహాసామ్రాజ్య వైభవంతో అజాతశత్రువు ధర్మరాజు గంగానదికి వెళ్ళి అక్కడ తన భార్యలతో కలిసి శాస్త్రోక్తంగా అవభృథస్నానం చేసాడు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=804 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, October 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౨(382)

( శిశుపాలుని వధించుట ) 

10.2-802-వ.
మఱియు యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల, భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నడి నడతేర, ఋత్విఙ్నికాయంబును సదస్యులను బ్రహ్మ ఘోషంబు లొలయ మున్నిడికొని, శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయమాలికా దివ్యమణిహారంబులు గంఠంబునం దేజరిల్ల, నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబుఁ గళత్ర సమేతుండై యెక్కి, యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనా జనంబులు దమ తమ వారలం గూడికొని.
10.2-803-సీ.
కనకాద్రిసానుసంగత కేకినుల భాతిఁ-
  గ్రొమ్ముళ్ళు వీఁపుల గునిసి యాడఁ,
దరళ తాటంక ముక్తాఫలాంశుద్యుతుల్‌-
  చెక్కుటద్దములతోఁ జెలిమిసేయఁ,
బొలసి యదృశ్యమై పోని క్రొమ్మెఱుఁగుల-
  గతులఁ గటాక్షదీధితులు దనర,
మంచుపై నెగయ నుంకించు జక్కవ లనఁ-
  జన్నులు జిలుఁగు కంచలల నఱుమ,
10.2-803.1-తే.
మహితకుచభారకంపితమధ్య లగుచు,
నర్థి మొలనూళ్ళు మెఱయఁ బయ్యదలు జారఁ,
గరసరోజాతకంకణక్వణనములునుఁ
జరణనూపురఘోషముల్‌ సందడింప. 

భావము:
అంతేకాకుండా, ఆ అవభృథ స్నానానికి యదు, సృంజయ, కాంభోజ, కేకయ, కోసల దేశాల రాజులు చతురంగ బలాలతో వెంట వస్తున్నారు. ఋత్విక్కులు సదన్యులు వేదపారాయణం చేస్తూ ముందు నడుస్తున్నారు. ఆ విధంగా ధర్మరాజు సువర్ణమయమైన దివ్యమణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తుండగా, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాలను పూన్చిన పుష్పరథాన్ని భార్యాసమేతంగా అధిరోహించి మహావైభవంతో ప్రయాణం సాగించాడు. ఆ సమయంలో మేరుపర్వత చరియలలోని నెమిళ్ళలాగ జుట్టుముడులు వీపుల మీద నృత్యం చేస్తుండగా; ముత్యాల చెవిదుద్దుల కాంతులు చెక్కుటద్దాలతో స్నేహం చేస్తుండగా; చెరిగిపోని మెరుపుతీగల్లాంటి కడగంటి చూపులు వెలుగులు వెదజల్లుతుండగా; మంచు మీద నుంచి ఎగరటానికి ప్రయత్నంచేసే జక్కవల మాదిరి స్తనాలు రవికలోనుంచి పైకి ఉబుకుతుండగా; కుచభారంచేత నడుములు చలిస్తూ ఉండగా; మొలనూళ్ళు మెరుస్తుండగా; పైటలు జీరాడుతుండగా; చేతికంకణాల శబ్దాలు కాళ్ళకడియాల సవ్వడులూ సందడిస్తుండగా; వేశ్యాంగనలు వారితో కలసి నడిచారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=803 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Friday, October 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౧(381)

( శిశుపాలుని వధించుట ) 

10.2-800-వ.
అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం బూజించి యవభృథస్నానక్రియా పరితోషంబున.
10.2-801-సీ.
మురజ, మృదంగ, గోముఖ, శంఖ, డిండిమ,-
  పణవాది రవము లంబరము నిండఁ,
గవి, సూత, మాగధ, గాయక, వంది, వై-
  తాళిక వినుతు లందంద బెరయ,
వితతమర్దళ వేణు వీణారవంబుల-
  గతులకు నర్తకీగతులు సెలఁగఁ,
దరళ విచిత్రక ధ్వజపతాకాంకిత-
  స్యందన గజ వాజిచయములెక్కి
10.2-801.1-తే.
సుత, సహోదర, హిత, పురోహితజనంబు
గటక, కేయూర, హార, కంకణ, కిరీట,
వస్త్ర, మాల్యానులేపనవ్రాతములను
విభవ మొప్పారఁ గైసేసి వెడల నంత. 

భావము:
అటు పిమ్మట, ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విక్కులను, యజ్ఞానికి విచ్చేసిన సదస్యులను అనేక దక్షిణలతో తృప్తిపొందించి, వివిధ విధాలుగా పూజించి యాగాంతంలో చేసే అవభృథస్నానానికి బయలుదేరాడు. అవభృథ సాన్నానికి బయలుదేరిన ధర్మరాజుని ఆయన కుమారులూ, సోదరులూ, మిత్రులూ. పురోహితులూ హారకేయూర కటకకంకణ కిరీటాది భూషణాలను చక్కగా అలంకరించుకుని, ధ్వజ పతాకాలతో కూడిన రథాలు గుఱ్ఱాలు ఏనుగులు ఎక్కి మహావైభవంతో అనుసరించారు. ఆ సమయంలో, నింగి నిండేలా డోలు, మృదంగము, గోముఖము, శంఖము, డిండిమము, పణవము మున్నగు నానావిధ వాద్యాల ధ్వనులు మ్రోగసాగాయి. కవి, సూత, వైతాళిక, వంది మాగధుల పొగడ్తలు మించసాగాయి. వేణు వీణారవాలకు అనుకూలంగా నాట్యకత్తెలు నృత్యం చేయసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=801 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Thursday, October 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౦(380)

( శిశుపాలుని వధించుట ) 

10.2-796-వ.
అనిన మునివరునకు భూవరుం డిట్లనియె.
10.2-797-క.
"కమలాక్షుని నిందించిన
దమఘోషతనూభవుండు దారుణ మల కూ
పమునుం బొందక యే క్రియ
సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా! "
10.2-798-వ.
అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె.
10.2-799-మ.
"మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధి యే ప్రొద్దుఁ దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! 

భావము:
ఇలా చెప్పిన శుక యోగీశ్వరుడితో మహారాజు పరీక్షిత్తు ఇలా అన్నాడు. “ఓ మునీశ్వరా! శుకా! శ్రీకృష్ణుడిని అంతగా దూషించిన ఆ దమఘోష సుతుడైన శిశిపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా, అంత గొప్పగా భగవంతుడైన కృష్ణుడిలో ఎలా ప్రవేశించాడయ్యా.” ఈ మాదిరిగా సందేహం వెలిబుచ్చిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! పరీక్షిత్తూ! మధుసూదనుడైన శ్రీహరి మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండి విడువకుండా నిందించడం పేర, ఎల్లప్పుడు ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూప గుణాలను ధ్యానిస్తూ ఉండడం వలన, పాపాలు సమస్తం నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని అందుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=799 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Wednesday, October 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౯(379)

( శిశుపాలుని వధించుట ) 

10.2-794-వ.
అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధ పాణులై యదల్చి నిల్చిన వాఁడునుం బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని, భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ, నమ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; రయ్యవసరంబున.
10.2-795-క.
మునివరులును జనపతులునుఁ
గనుఁగొని వెఱఁగంద జైద్యుగాత్రమునందుం
డనుపమ తేజము వెలువడి
వనజోదరు దేహమందు వడిఁ జొచ్చె నృపా! " 

భావము:
ఆ సమయంలో కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని అదలించి నిలబడ్డారు. వాడు కూడ భుజబలగర్వంతో పాండ వాదులను లక్ష్యపెట్టక, కత్తీ డాలూ పట్టుకుని కృష్ణుడిని అతడిని అనుసరించే వారిని కోపంగా నిందించసాగాడు. అప్పుడు ముకుందుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న శిశుపాలుడిని తీవ్రంగా చూస్తూ, బహు వాడి కలదైన తన సుదర్శన చక్రంతో వాడి తల తరిగాడు. ఆ భయంకర కలకలాన్ని వినిన చూసిన, శిశుపాలుడి సైన్యము, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో పారిపోయారు. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సమయంలో శిశుపాలుని దేహంనుంచి దేదీప్యమానమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు కృష్ణుడు శరీరంలో ప్రవేశించింది, మునీశ్వరులు రాజులు అది చూసి ఆశ్చర్యపోయారు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=794 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౮(378)

( శిశుపాలుని వధించుట ) 

10.2-792-చ.
అని తను దూఱనాడిన మురాంతకుఁడా శిశుపాలు వాక్యముల్‌
విని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవ రావ మాత్మఁ గై
కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా
డిన యవినీతి భాషలకు డెందమునం గడు వంత నొందుచున్.
10.2-793-ఉ.
వీనులుమూసికొంచు వినవిస్మయ మంచు "ముకుంద! మాధవా!
శ్రీనిధి! వీని నేగతికిఁ జేర్చెదొ" యంచు దురాత్ముఁ దిట్టుచు
న్నా నరనాథులున్ మునులు నచ్చట నిల్వక పోవఁ బాండు సం
తానము లప్రమేయ బలదర్ప మహోద్ధత రోషచిత్తులై. 

భావము:
ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే, నక్కకూతలను లెక్కపెట్టని సింహంలాగా శ్రీకృష్ణుడు లక్ష్యపెట్టలేదు కానీ, సభలో ఉన్న ఋషులు, రాజులు, మాత్రం శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా బాధపడ్డారు. కృష్ణుడిని నిందిస్తున్న శిశుపాలుడి దురాలాపాలను వినలేక మునులు రాజులు చెవులు మూసుకుని ఆశ్చర్యపడుతూ “ఓ కృష్ణా! వీడిని ఎలా కడతేరుస్తావో ఏమిటో?” అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=793 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Monday, October 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౭(377)

( శిశుపాలుని వధించుట ) 

10.2-790-సీ.
గురుదేవశూన్యుండు, కులగోత్రరహితుండు,-
  దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన,
మప్పులఁ బొరలెడు, నాదిమధ్యావసా-
  నంబులం దరయ మానంబు లేదు,
బహురూపియై పెక్కుభంగుల వర్తించు,-
  వావి వర్తనములు వరుస లేవు
పరికింప విగతసంబంధుండు, తలపోయ-
  మా నిమిత్తంబున మాని సయ్యెఁ
10.2-790.1-తే.
బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి
వాసి కెక్కదు యీ యదువంశమెల్ల,
బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు
బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?
10.2-791-క.
జారుఁడు, జన్మావధియునుఁ
జోరుఁడు, ముప్పోకలాఁడు సుమహితపూజా
చారక్రియలకు నర్హుఁడె?
వారక యితఁ" డనుచు నశుభవాక్యస్ఫూర్తిన్. 

భావము:
ఈ కృష్ణుడికి గురువులు దేవుడు లేరు, కులం గోత్రం లేవు, తల్లితండ్రులు ఎవరో తెలియదు, నీటి మీద శయనిస్తాడు, ఆది మధ్యాంతాలు కానరావు, నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ రకరకాలరీతులో ప్రవర్తిస్తుంటాడు, వర్తించే వావివరుసులు లేవు, ఏ బాంధవ్యబంధాలు లేవు. ఇతడు మా కారణంగానే మాననీయుడయ్యాడు కానీ, యయాతిశాపం వలన ఈ యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. వీరి వంశం బ్రహ్మతేజాన్నికోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? ఇతడు పుట్టింది మొదలు చోరుడు, జారుడు, మూడు త్రోవల్లో నడచేవాడు. మరి ఇతగాడు ఇంత గొప్ప పూజకు ఎలా అర్హుడు అవుతాడు?” అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=791 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :