Thursday, September 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౩(353)

( జరాసంధ వధ) 

10.2-733-సీ.
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు-
  మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు-
  దలపడు వీఁక నుద్దండలీలఁ
గదిసి యన్యోన్యభీకరగదాహతులను-
  గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ-
  ణములను సింహచంక్రమణములను
10.2-733.1-తే.
గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
ఘనగదాఘట్టనధ్వని గగనమగల.
10.2-734-వ.
పోరునంత.
10.2-735-మ.
గద సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం
జద లల్లాడఁగఁ బాదఘట్టనములన్ సర్వంసహాభాగముం
గదలన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై
యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁ దట్టుచున్. 

భావము:
రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్ర మైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని, తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=733 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 29, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౨(352)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-730-క.
ఇన్నేల సెప్ప? మాయలఁ
బన్నినఁ బో విడువ గోపబాలక! బల సం
పన్నుని మాగధభూవరు
నన్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్?
10.2-731-ఉ.
కాన రణోర్వి నన్నెదురఁ గష్టము గాన తలంగు; గోత్రభి
త్సూనుఁడుభూరిబాహుబలదుర్దముఁడయ్యునుఁ బిన్న; యీమరు
త్సూనుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ;
వీనినెదుర్తు" నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై.
10.2-732-క.
కరువలిసుతునకు నొక భీ
కరగద నిప్పించి యొక్కగదఁ దనకేలన్
ధరియించి నలువురును గ్ర
చ్చఱఁ బురి వెలి కేగి యచట సమతలభూమిన్.
భావము:
ఇన్ని మాటలు దేనికి కానీ? ఓ యాదవ బాలుడా! ఎన్ని మాయలు పన్నినా నిన్ను వదలను. యుద్ధరంగంలో జరాసంధుడంటే ఏమిటో నీకు బాగా తెలుసు కదా. ఓ కృష్ణా! రణంలో నన్ను ఎదిరించటం నీకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కానీ చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు. కనుక వీడిని ఎదుర్కొంటాను” అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు. వాయునందనుడైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేబట్టాడు. పిమ్మట నలుగురూ పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్ళి.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=732 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౧(351)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-727-క.
"భూరిగుణులార! మీ మదిఁ
కోరిక యెఱిఁగింపుఁ డేమి కోరిననైనన్
ధీరత నొసఁగుటయే కా
దారయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్. "
10.2-728-ఉ.
నావుడుఁ గృష్ణుఁ డమ్మగధనాథున కిట్లను "భూవరేణ్య! నీ
భావము సూనృతవ్రతశుభస్థితిఁ జెందు టెఱుంగవచ్చె; మా
కీవలె నాజిభిక్ష; యితఁ డింద్రతనూభవుఁ; డే నుపేంద్రుఁడం;
బావని యీతఁ; డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్."
10.2-729-చ.
అన విని వాఁడు నవ్వి "యహహా! విన వింతలుపుట్టె మున్ను న
న్ననిమొన నోర్వఁజాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం
చన మథురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే?
వనరుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే? 

భావము:
“ఓ గుణవంతులారా! మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తల తఱిగి ఇమ్మన్నా ఇచ్చేస్తాను.” అలా అన్న జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “మహారాజా! నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయు పుత్రుడు భీమసేనుడు; ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు; నేను కృష్ణుడిని; మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి.” శ్రీకృష్ణుడి మాటలు విని, జరాసంధుడు నవ్వి “అహో ఎంత ఆశ్చర్యం. నన్ను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయావు. మథురను వదలిపెట్టి సముద్రం మధ్యలో దాక్కున్నావు కదా. నీ పరాక్రమం నీ మగతనం ఏపాటివో నాకు తెలియనిది కాదులే కృష్ణా! 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=729 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౦(350)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-726-వ.
అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులునుం జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. 

భావము:
ఈ మాదిరి పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని, కృష్ణార్జునభీములతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=726 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౪౯(349)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-724-క.
ఆ యింద్రాగ్నులు శ్యేనక
వాయస రూపములఁ దన్ను వలఁతిగ వేఁడన్
ధీయుతుఁడై మును శిబి తన
కాయము గోసిచ్చె నన జగంబుల వినమే!
10.2-725-ఆ.
ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు
సన్న నైన నేఁడు నున్నవారు. " 

భావము:
ఆ ఇంద్రుడు డేగ రూపంలో, అగ్ని కాకి రూపంలో వచ్చి తనను కోరగా శిబిచక్రవర్తి గొప్ప బుద్ధితో తన దేహాన్నే కోసి ఇచ్చాడని మనం వినలేదా? మహా ధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచీ వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా, ఈనాటికీ బ్రతికి ఉన్నవారే.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=725 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౮(348)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-721-క.
పరికింపఁగ దేహం బ
స్థిరమని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి
స్ఫురణం బ్రస్తుతి కెక్కని
పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా!
10.2-722-క.
ధారుణిలోన వదాన్యుల
కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కోరినఁ దన మే యెముకలు
ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే?
10.2-723-క.
అడిగిన వృథసేయక తన
యొడ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే
ర్పడ నిచ్చి కీర్తిఁ గనె నని
పుడమిన్ మును వినమె యల కపోతము ననఘా! 

భావము:
ఓ మిక్కిలి తెలివైన వాడా! జరాసంధా! మానవుడు ఈ దేహం శాశ్వతం కాదని గ్రహించి, శాశ్వతమైన యశస్సును సంపాదించాలనే ఆసక్తి కలిగి మహాదాతగా ప్రసిద్ధి కెక్కవలెను. లేకపోతే, వాడు బ్రతికి ఉన్నా కూడా చచ్చినవాడితో సమానం. చేసే బుద్ధి ఉండాలి కానీ, దాతలకు దానం చేయరాని వస్తువు ఏమి ఉంటుంది? దేవతలు వచ్చి, తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా? అడిగిన వెంటనే కాదనకుండా ఆకలిగొన్న బోయవాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించి కీర్తిని పొందిన పావురం కథ మనం వినలేదా? 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=723 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 24, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౭(347)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-718-వ.
ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.
10.2-719-క.
"ధరణీశ! యతిథిపూజా
పరుఁడవు నీ వనుచు దిశలఁ బలుకఁగ విని మే
మరుదెంచితిమి మదీప్సిత
మఱ సేయక యిమ్ము సువ్రతాచారనిధీ!
10.2-720-క.
అతిథిజనంబుల భక్తిన్
సతతముఁ బూజించి యుచితసత్కారము లు
న్నతి నడపు సజ్జనులు శా
శ్వతకీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా! 

భావము:
అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్ళారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు. “ఓ మగధరాజా! జరాసంధా! ఓ సదాచార సంపన్నా! అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. ఓ పుణ్యాత్మా! అతిథి జనాన్ని ఎల్లప్పుడూ భక్తితో సేవించి, వారికి ఉచిత సత్కారాలు చేసే సత్పురుషులు లోకంలో శాశ్వతకీర్తిని పొందుతారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=720 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :