Monday, June 28, 2021

శ్రీకృష్ణ విజయము - 269

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-279-వ.
అందు గోవిందనందనుండయిన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతు వలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె.
10.2-280-క.
“బవరమునఁ గృష్ణుచే ము
న్నవమానము నొంది రుక్మి యచ్యుతు గెలువం
దివురుచుఁ దన సుత నరిసం
భవునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ బలుకు మునీంద్రా!”

భావము:
వారిలో గోవిందుని కుమారుడు ప్రద్యుమ్నుడికి రుక్మి కుమార్తె రుక్మవతి వలన అనిరుద్ధుడు ఉద్భవించాడు.” అని చెప్పగా రాజేంద్రుడు మునీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ శుకయోగీంద్రా! యుద్ధంలో శ్రీకృష్ణుడిచేత అవమానం పొందిన రుక్మి, ఎలాగైనా శ్రీకృష్ణుడి మీద పగతీర్చుకోవాలని చూస్తున్నాడు కదా. అటువంటివాడు, తన శత్రువు కుమారుడికి తన కూతురును ఇచ్చి ఎలా వివాహం చేసాడు. ఈ సంగతి నాకు తెలియ చేయండి."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=280

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



Sunday, June 27, 2021

శ్రీకృష్ణ విజయము - 268

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-276-చ.
అనఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
దన దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
న్నెనయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
ర్ధనమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.
10.2-277-తే.
అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ
నామధేయాంతరముల నెన్నంగ నూట
యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు
నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.
10.2-278-తే.
గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద
నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు
రన్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె
శూలికైనను దామరచూలికైన?

భావము:
శ్రీకృష్ణుడికి పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది వంతున పుత్రులు ఉద్భవించారు ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. ఈ విధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=278

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :



శ్రీకృష్ణ విజయము - 267

( కృష్ణ కుమారోత్పత్తి )

10.2-275-వ.
మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహార పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును.

భావము:
నానావిధములైన విచిత్రమణులతో శోభించే చాందినీలతో విలసిల్లె ప్రాసాదాలలోనూ; పెంపుడు నెమళ్ళతో, కోకిలలతో, పిచ్చుకలతో, చిలుకల పలుకులతో నిండినది; మకరందపానము చేసి మదించిన తుమ్మెదల ఝంకారములు నిండిన తెల్లని పద్మాలు, చల్లని మధుర జలాలతో కూడిన కమనీయ సరోవరతీరాలలో; ఖనిజాలపై ప్రవహించే జలప్రవాహాలతో ఎఱ్ఱనైన కొండచరియల పొదరిండ్లలో; లీలాపర్వతాలలో; క్రీడాగృహాలలో ఆ నందుని కుమారుడు శ్రీకృష్ణుడు, విదర్భరాకుమారి రుక్మిణీదేవితో కలిసి మన్మథవిలాసాలలో మునిగితేలాడు. అంతట, రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది చొప్పున అందమైన కుమారులు ఉదయించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=275

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, June 26, 2021

శ్రీకృష్ణ విజయము - 266

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-273-చ.
ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా
వలిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌
వొలయు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలం
గొలఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై.
10.2-274-క.
ఆరామభూములందు వి
హారామల సౌఖ్యలీల నతిమోదముతో
నా రామానుజుఁ డుండెను
నా రామామణియుఁ దాను నభిరామముగన్.

భావము:
ఆ దంపతులు ఇద్దరూ కిత్తలి చెట్ల నీడలలో, మల్లెపొదలలో, విరజాజి నికుంజాలలో, గన్నేరుచెట్ల గుబురులలో, చిరుగాలులకు పులకరించే పొన్నచెట్ల క్రింది వేదికలపైనా, మరకతమణి సౌధాలలో సరోవరతీరాలలో తనివితీరా విహరించారు. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు రమణీయమైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్మిణితో కూడి విహరించి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=274

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 265

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-269-క.
"అని యిట్లు కృష్ణుఁ డాడిన
వినయ వివేకానులాప వితతామృత సే
చన ముదిత హృదయయై య
వ్వనితామణి వికచ వదన వనరుహ యగుచున్.
10.2-270-క.
నగ వామతించు చూపులు
నగధరు మోమునను నిలిపి నయమునఁ గరముల్‌
మొగిచి వినుతించెఁ గృష్ణున్
ఖగవాహున్ రుచిరదేహుఁ గలితోత్సాహున్.
10.2-271-చ.
అతుల విరాజమానముఖుఁడై వివిధాంబర చారుభూషణ
ప్రతతులతోడఁ గోరిన వరంబులు దద్దయుఁ నిచ్చెఁ గృష్ణుఁ డు
న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై
యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్.

భావము:
“ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా పలికాడు. ఆ అమృతధారల వంటి ముచ్చట పలుకుల జల్లులకు రుక్మిణీదేవి మనసు సంతోషించింది; ముఖారవిందం సంతోషంతో వికసించింది. అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో నిండిన చూపులతో శ్రీకృష్ణుడి వైపు చూసి, చేతులు జోడించి, ఆ గరుత్మంతుడు వాహనంగా గలవాడు, ఆ జగన్మోహనుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీకృష్ణుడిని స్తుతించింది. ఉన్నతమైన మంగళమూర్తీ, దయాపరిపూర్ణ వర్తనుడు, సకల దేవతల స్తోత్రాలకు పాత్రుడైన వాడు అయిన శ్రీకృష్ణుడు మిక్కిలి సంతోషంతో ప్రకాశించే ముఖం కలవాడై చిగురుటాకువలె ఎఱ్ఱని హస్తములూ, నల్లని కురులూ, మృదుమధుర పలుకులు పలుకునది అయిన రుక్మిణీదేవికి అనేక రకాల వస్త్రాలనూ, అందమైన ఆభరణాలనూ బహూకరించాడు కోరిన కోరికలు తీర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=271

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, June 22, 2021

శ్రీకృష్ణ విజయము - 264

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-268-వ.
అని వెండియు నిట్లనియె “నీవాక్యంబులు శ్రవణసుఖంబుగావించె; నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నాయంద యుండుటం జేసి యేకాంతసేవాచతుర వైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు; నీ పాతివ్రత్యంబును, నా యందలి స్నేహంబు నతివిశదంబు లయ్యె; నావాక్యములచేత భవ దీయచిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ధి దృఢంబగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబు లందు నీదు భాగ్యంబునం జేసి సంసారికైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ; దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు; రదియంతయు నా మాయా విజృంభితంబు; దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లుగావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబు ననేక రాజన్యవర్యులఁ గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి "నా శరీరం బితర యోగ్యంబు గాదు; నీకు శేషంబనయి యున్న దాన" నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి, నీ పరిణయసమయంబున భవత్సహోదరుంబట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; వదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు!”నని యివ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించుచుండె"నని శుకుండు మఱియు నిట్లనియె.

భావము:
నీ పలుకులు నాకు శ్రవణానందాన్ని కలిగించాయి. నీవు ఏవి కోరినా అవన్నీ, నా వద్దే ఉన్నాయి కనుక, ఏకాంతసేవాచతుర వైన నీకు అవన్నీ లభిస్తాయి. నీ పాతివ్రత్యమూ, నా మీది ప్రేమా స్పష్టమయ్యాయి. నా మాటలచేత నీమనస్సు సంచలించకుండా, నా మీది నీ అనురాగం ఇంకా ధృడమవుతుంది. కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్యమందిరాలలో కేవలం ఒక గృహస్థు లాగా నీ మీద బద్ధానురాగంతో ప్రవర్తిస్తాను. ఇదంతా నీ అదృష్టం. ఏ ఇంద్రియలోలురాలైన వికృత స్వరూపిణికి అయినా నన్ను పొందడం దుష్కరం. అంతే కాదు మోక్షదాయకుడ నైన నన్ను కామాతురా లైన అల్పబుద్ధులు వ్రతాలతో, తపస్సుతో, దాంపత్య జీవితం కోసం సేవిస్తుంటారు. ఆ భావం నా మాయవలన విజృంభించిందే. అందువలన వారు భాగ్యవిహీనలై నరకాన్ని పొందుతారు. నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు. నీవు వివాహకాలంలో ఎందరినో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు. ”నేను నీదానను. ఈ నా దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు.” అంటూ బ్రాహ్మణుని నా దగ్గరకు పంపించావు. నేను నీ ఆహ్వానం మన్నించి వచ్చి, నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుడిని వికారస్వరూపుడిగా కావించాను. అది చూసి కూడా నా వియోగాన్ని సహింపలేక ఊరుకున్నావు. ఇటువంటి నీ సద్గుణాలకు ఎంతో సంతోషించాను.” అని ఈవిధంగా ఆమెను అనునయించాడు. ఈ మాదిరి, దేవకీతనయుడు శ్రీకృష్ణుడు మానవలోక ధర్మాన్ని అనుసరించి, గృహస్థువలెనే తన గృహకృత్యాలను ఆచరిస్తున్నా” డని శుకుడు తెలిపి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=268

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


Monday, June 21, 2021

శ్రీకృష్ణ విజయము - 263

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-267-ఉ.
"నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మవివేక శీల స
ద్భావవు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం
సేవయ కాని యన్యము భజింపవు; పుట్టిన నాఁటనుండి నీ
భావ మెఱింగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ!

భావము:
“దేవీ! రుక్మిణీ! నీవు మహాపతివ్రతవు, సౌశీల్యవతివి నా సేవ తప్ప నీకు బాల్యంనుండి ఇతర ఆలోచనలు లేవు. ఇదంతా తెలిసినప్పటికీ, నిన్ను బాధపెట్టాను. తప్పే. నన్ను మన్నించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=267

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :