Thursday, April 29, 2021

శ్రీకృష్ణ విజయము - 212

( నరకాసుర వధకేగుట )

10.2-153-సీ.
"సమద పుష్పంధయ ఝంకారములు గావు-
  భీషణకుంభీంద్ర బృంహితములు
వాయునిర్గత పద్మవనరేణువులు గావు-
  తురగ రింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరం గాసారములు గావు-
  శత్రుధనుర్ముక్త సాయకములు
గలహంస సారస కాసారములు గావు-
  దనుజేంద్రసైన్య కదంబకములు
10.2-153.1-తే.
కమల కహ్లార కుసుమ సంఘములు గావు;
చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు
కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ?
వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. "
10.2-154-వ.
అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి.

భావము:
“అబలవైన నీ వెక్కడ? రణరంగ మెక్కడ? అక్కడ వినిపించేవి మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు; అక్కడ కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు, గుఱ్ఱపుడెక్కల చివరల నుండి లేచిన ధూళిదుమారాలు; అవి నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనుస్సుల నుండి వెడలిన శరపరంపరలు; రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షససైన్య సమూహాలు; కమలాలు కలువలు కనిపించవు, అక్కడ కనపడేవి భయంకరమైన శత్రుల శూలాలు ఖడ్గాలు ఆయుధాలు; ఇటువంటి యుద్ధరంగానికి నీ వెందుకు రావడం. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. నీవు రావద్దు వద్దు; వద్దు; రావద్దు.” అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరకి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=153

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 211

( నరకాసుర వధకేగుట )

10.2-150-వ.
అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె "నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు; నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె.
10.2-151-శా.
"దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ
దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, "
10.2-152-వ.
అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “నరకాసురుడు అదితి యొక్క కర్ణకుండలాలనూ, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి, శ్రీకృష్ణుడికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఇలా అన్నది. “ప్రభూ! ప్రాణనాథ! నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే, నీ యుద్ధనైణ్యం చూడాలని కోరికగా ఉంది నామాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసివచ్చి, ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను." ఈ విధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=151

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 27, 2021

శ్రీకృష్ణ విజయము - 210

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-148-వ.
ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని.
10.2-149-క.
"ధరకుం బ్రియనందనుఁ డగు
నరకుని హరి యేల చంపె? నరకాసురుఁ డా
వరకుంతల లగు చామీ
కర కుంభస్తనుల నేల కారం బెట్టెన్? "

భావము:
ఈవిధంగా శ్రీకృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే వారు అష్టభార్యలు అయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలో నున్న రోహిణి మొదలైన పదహారువేలమంది కన్యకామణులను పరిగ్రహించాడు.” అని చెప్పగా పరీక్షుత్తు విని ఇలా అన్నాడు. “భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు నవయౌవనవతు లైన సుందరీమణులను ఎందుకు చెరసాలలో బంధించాడు?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=149

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 209

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-145-మ.
జనవంద్యన్ శ్రుతకీర్తినంద్యఁ దరుణిన్ సందర్శనక్షోణి పా
ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ధనయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్.
10.2-146-వ.
మఱియును.
10.2-147-చ.
అమరులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
కమలదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్.

భావము:
కేకయదేశాధిపతి అయిన ధృష్టకేతుడు, తన మేనత్త శ్రుతకీర్తిల కుమార్తె, సందర్శనాదులకు సోదరి సద్గుణవతి అయిన భద్రను శత్రువు లెల్లరూ తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహమాడాడు. ఇంకా అంతేకాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి, అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన రాజులను ఓడించి, శ్రీకృష్ణుడు లేడికన్నుల వంటి కన్నులు కల సుందరీ, మద్రరాజుకుమార్తీ, శుభలక్షణవతీ అయిన లక్షణను పరిగ్రహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=147

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, April 25, 2021

శ్రీకృష్ణ విజయము - 208

( నాగ్నజితి పరిణయంబు )

10.2-142-ఉ.
భూతి యెలర్పఁ గోసలుని పుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ
బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధువుం
డా తరుణిన్ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం
ఘాతముతోడఁ దాఁకి రరిగర్వవిమోచనుఁ బద్మలోచనున్.
10.2-143-ఉ.
దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో
భండన భూమియందుఁ దన బాంధవులెల్లను సన్నుతింపఁగా
గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా
ఖండలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్.
10.2-144-వ.
ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై, యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామతోడం గ్రీడించుచుండె; మఱియును.

భావము:
ఇంతకుపూర్వం నాగ్నజితిని వివాహం చేసుకుందా మని వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజులు అందరూ, మాధవుడు ఆ కన్యను వివాహ మాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకుని శత్రువుల గర్వం భంజించే శ్రీకృష్ణుడిని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గమధ్యంలో అడ్డగించారు. రాజులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి పైకి రాగా, అర్జునుడు పరాక్రమంతో ఎదుర్కొన్నాడు గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్ళను సంహరించునట్లు శత్రువులను అందరినీ హతమార్చాడు. బంధువులంతా ఎంతో సంతోషించారు. ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి, మామగారు ఇచ్చిన కానుకలతో ద్వారకకు వచ్చి సత్యభామతో ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=143

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 207

( నాగ్నజితి పరిణయంబు )

10.2-140-ఉ.
చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.
10.2-141-వ.
ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్రరీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి ఏడు వృషభాలను పట్టుకుని గ్రుద్ది, క్రుమ్మి, అవలీలగా నేల మీదకు కూలద్రోసి, కట్టి ఈడ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడువృషభాలను కట్టి ఈడ్వగా, నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; మంగళగీతాలు భేరీమృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి; కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను, వస్త్రాభరణాలంకృతలైన మూడువేలమంది కన్యలనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, అంతకు వందరెట్లు రథాలనూ, అంతకు వందరెట్లు గుఱ్ఱాలనూ, అంతకు వందరెట్లు సైనికులనూ కానుకగా ఆ రాజు, కృష్ణుడికి ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=141

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, April 23, 2021

శ్రీకృష్ణ విజయము - 206

( నాగ్నజితి పరిణయంబు )

10.2-137-శా.
ఉష్ణాంశుండు తమంబుఁ దోలు క్రియ నీ వుగ్రాహవక్షోణిలోఁ
గృష్ణా! వైరులఁ దోలినాఁడవు, రణక్రీడావిశేషంబులన్
నిష్ణాతుండవు, సప్తగోవృషములన్ నేఁ డాజి భంజించి రో
చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్. "
10.2-138-వ.
అని నగ్నజిత్తు తన కూఁతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని.
10.2-139-చ.
కనియె నఘారివత్సబకకంసవిదారి ఖలప్రహారి దా
ఘనతర కిల్పిషంబుల నగణ్య భయంకర పౌరుషంబులన్
సునిశిత శృంగ నిర్దళితశూరసమూహ ముఖామిషంబులన్
హనన గుణోన్మిషంబుల మహా పరుషంబుల గోవృషంబులన్.

భావము:
శ్రీకృష్ణా! సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు నీవు రణరంగంలో నీ శత్రువులను పారదోలావు. సంగర క్రీడలో నీవు సర్వసమర్థుడవు. ఏడువృషభాలతో ఈవేళ పోరాడి జయించి మా చంద్రముఖిని నాగ్నజితిని చేపట్టు.” అని నగ్నజిత్తు తన కుమార్తె వివాహ విషయంలో తాము పెట్టుకున్న నియమాన్ని వివరించగా, కృష్ణుడు విని అఘాసుర, వత్సాసుర, బకాసుర, కంసాది ఖలులను చీల్చిచెండాడిన శ్రీకృష్ణుడు, గొప్ప పౌరుషము కలవీ తమ వాడి కొమ్ములతో ఎందరో వీరుల ముఖాలను క్రుమ్మి గాయపరచినవీ, రూపం ధరించిన పాపరాసుల వలె అతి భయంకరమైనవీ అయిన ఆబోతులను అవలోకించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=139

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :