Tuesday, March 30, 2021

శ్రీకృష్ణ విజయము - 187

( శతధన్వుని ద్రుంచుట )

10.2-89-వ.
అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన నమ్మహామణి యక్రూరుని యొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజన దూరంబు సనియె; గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామ కృష్ణులు వెనుచని; రంత నతండును మిథిలానగరంబుఁజేరి తత్సమీపంబు నందు.
10.2-90-చ.
తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై
పరువిడఁ బోకు పోకు మని పద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ
కరగతి వాని మస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం
బరిహతదైత్యచక్రముఁ బ్రభాచయ మోదితదేవశక్రమున్.
10.2-91-వ.
ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండటఁ దెలిసి బలభద్రునికడకు వచ్చి “శతధన్వుం డూరక హతుం డయ్యె, మణి లే” దనిన బలభద్రుం డిట్లనియె.

భావము:
ఆ విధంగా అక్రూరుడు అనగానే, శతధన్వుడు శమంతకమణిని అక్రూరుడికి ఇచ్చి, భయంతో గుఱ్ఱమెక్కి నూరుయోజనల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగరం చేరాడు. అక్కడ శతధన్వుడు గుఱ్ఱం దిగి వేగంగా పరిగెత్తుతుండగా, శ్రీకృష్ణుడు “పోకు పోకు” అంటూ అతడిని వెంటాడి, రాక్షసులను సంహరించేదీ, దేవతలను తన ప్రభలతో సంతోషింపజేసేది అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రఘాతానికి శతధన్వుడి శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది. శ్రీకృష్ణుడు శతధన్వుడిని సంహరించి అతని దగ్గర వెతికాడు కాని, శమంతకమణి కన్పించలేదు. అంతట బలరాముడి దగ్గరకు వచ్చి “శతధన్వుడు అనవసరంగా చచ్చిపోయాడు. అతడి దగ్గర మణి లేదు” అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=12&Padyam=91

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 186

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-87-వ.
అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరుని యింటికిం జని హరితోడ పగకుందోడు రమ్మని చీరిన నక్రూరుండు హరి బలపరాక్రమ ధైర్యస్థైర్యంబు లుగ్గడించి మఱియు నిట్లనియె.
10.2-88-సీ.
"ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై-
  పుట్టించు రక్షించుఁ బొలియఁ జేయు,
నెవ్వనిచేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు-
  లెవ్వని మాయ మోహించు భువన,
మేడేండ్లపాపఁడై యే విభుఁ డొకచేత-
  గో రక్షణమునకై కొండ నెత్తె,
నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత-
  కర్ముఁ డనంతుండు కర్మసాక్షి,
10.2-88.1-తే.
యట్టి ఘనునకు శౌరికి ననవరతము
మ్రొక్కెదము గాక; విద్వేషమునకు నేము
వెఱతు మొల్లము నీ వొండు వెంటఁ బొమ్ము
చాలు పదివేలువచ్చె నీ సఖ్యమునను."

భావము:
కృతవర్మ ఇలా పలుకగా విని శతధన్వుడు అక్రూరుని ఇంటికి వెళ్ళి సహాయం చేయమని అర్థించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాలనూ ధైర్యస్థైర్యాలనూ నొక్కి చెప్పి. ఇంకా ఇలా చెప్పాడు. “ఎవరు ఈ ప్రపంచాన్ని లీలామాత్రంగా పుట్టించి, రక్షించి నశింపజేస్తాడో? ఎవని కృత్యాలు బ్రహ్మాది దేవతలు కూడా తెలియలేరో? ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింపజేస్తుందో? ఎవడు ఏడేండ్ల వయస్సులోనే గోవులను రక్షించడానికై పర్వతాన్ని ఒకచేత్తో పైకెత్తిపట్టాడో? ఎవడు కూటస్థుడో? పరమేశ్వరుడో? అద్భుతాలు సాధించగలవాడో? అనంతుడో? కర్మసాక్షియో? అట్టి మహానుభావుడైన వాసుదేవునికి ఎల్లప్పుడూ నమస్కరించేవారమే కానీ, వైరానికి రాము నీవు మరో మార్గం ఆలోచించుకో. నీ స్నేహం వలన మా కింత జరిగింది చాలు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=88

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, March 29, 2021

శ్రీకృష్ణ విజయము - 185

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-85-వ.
ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె.
10.2-86-ఉ.
"అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా
నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై
చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్‌
దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే? "

భావము:
సత్యభామ తండ్రి మరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణం విషయం చెప్పింది. బలరామకృష్ణులు భగవంతులై ఉండి కూడా మనుష్య భావంతో దుఃఖించారు. బలరామ, సత్యభామలతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్ళి తనకు సహాయపడ మని కోరాడు. అప్పుడు, శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు. “అయ్యో! ఎంత పనిచేశావు. బలరామకృష్ణులు మహానుభావులు. వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్ధులు ఇక్కడ ఎవరు లేరు. కంసుడు బంధు మిత్ర సమేతంగా నేలకూలలేదా? జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా? వారి పరాక్రమాలు మనకు క్రొత్త ఏమీ కాదు కదా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=86

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 184

( శతధన్వుఁడు మణి గొనిపోవుట )

10.2-83-వ.
అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.
10.2-84-సీ.
జగతీశ! విన వయ్య శతధన్వుఁ బొడగని-
  యక్రూర కృతవర్మ లాప్తవృత్తి
"మన కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ-
  బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె
ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కే క్రియ నైన-
  మణిపుచ్చుకొనుము నీమతము మెఱసి"
యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు-
  పశువుఁ గటికివాఁడు పట్టి చంపు
10.2-84.1-ఆ.
కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ
బట్టి చంపి, వాని భామ లెల్ల
మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ
జనియె నొక్క నాఁడు జనవరేణ్య!

భావము:
ఇంతలో అక్కడ లక్కఇంటిలో పాండవులు కుంతీ సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడై కూడా, ఆయన బలరాముడి తోపాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు. ఓ పరీక్షన్నరేంద్రా! అక్రూరుడూ, కృతవర్మా, శతధన్వుడిని కలిసి “దురామార్గుడైన సత్రాజిత్తు సత్యభామను మనకు ఇస్తానని చెప్పి, శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పాడు. నీవు ఏదో విధంగా శమంతకమణిని గ్రహించు” అని ప్రేమ ఒలకబోస్తూ ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును పట్టుకుని చంపినట్లుగా, నిద్రపోతున్న సత్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=11&Padyam=84

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, March 26, 2021

శ్రీకృష్ణ విజయము - 183

( సత్యభామా పరిణయంబు )

10.2-80-మ.
అని యిబ్భంగి బహుప్రకారముల నేకాంతస్థుఁడై యింటిలోఁ
దన బుద్ధిం బరికించి నీతి గని, సత్రాజిత్తు సంప్రాప్త శో
భనుఁడై యిచ్చె విపత్పయోధితరికిన్ భామామనోహారికిన్
దనుజాధీశవిదారికిన్ హరికిఁ గాంతారత్నమున్ రత్నమున్.
10.2-81-ఉ.
తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదారయశోనిధి పెండ్లియాడె నా
నా మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామ ను
ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మ విచక్షణతా దయా యశః
కామను సత్యభామను ముఖద్యుతినిర్జితసోమ నయ్యెడన్.
10.2-82-క.
"మణి యిచ్చినాఁడు వాసర
మణి నీకును; మాకుఁ గలవు మణులు; కుమారీ
మణి చాలు నంచుఁ గృష్ణుఁడు
మణి సత్రాజిత్తునకును మరలఁగ నిచ్చెన్. "

భావము:
ఇలా సత్రాజిత్తు రకరకాలుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించుకొని, చేయవలసినది నిశ్చయించుకుని స్థిమిత పడి. ఆపదలనే సముద్రాలను తరింపచేసేవాడూ, కాంతల హృదయాలను దోచేవాడూ, రాక్షసేంద్రులను సంహరించేవాడూ అయిన శ్రీకృష్ణుడికి తన పుత్రికారత్నం సత్యభామనూ, శమంతకమణిని సమర్పించాడు. పద్మనేత్రుడు అచ్యుతుడు మిక్కిలి కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు; సకలరాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి, గొప్ప పాతివ్రత్యమూ నీతి ధర్మవిచక్షణత్వమూ దయ కీర్తికాంక్ష కలిగిన ఆ చంద్రముఖిని సత్యభామను పెండ్లాడాడు. “ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువ లేదు. ఈ కన్యామణి చాలు” అని శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=10&Padyam=82

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 182

( సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట)

10.2-78-మ.
మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే
సితిఁ? బాపాత్ముఁడ, నర్థలోభుఁడను, దుశ్చిత్తుండ, మత్తుండ, దు
ర్మతి నీ దేహముఁ గాల్పనే? దురితమే మార్గంబునం బాయు? నే
గతిఁ గంసారి ప్రసన్నుఁ డై మనుచు నన్ గారుణ్య భావంబునన్?
10.2-79-ఆ.
మణిని గూఁతు నిచ్చి మాధవు పదములు
పట్టుకొంటినేని బ్రదుకు గలదు
సంతసించు నతఁడు సదుపాయమగు నిది
సత్య మితర వృత్తిఁ జక్కఁబడదు. "

భావము:
మౌనంగా ఊరుకోకుండా, ఎందుకు కృష్ణుడిపై నిందవేశాను? నేను పాపాత్ముడను, ధనాశాపరుడును, దుష్టుడను, దుర్మతిని, మత్తుడను, ఈ నా శరీరం కాల్చనా? నా పాపం ఏవిధంగా తొలగిపోతుంది? ఏరీతిగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నన్నుకనికరంతో రక్షిస్తాడు? ఈ శమంతకమణినీ, మణితోపాటు నా కూతురినీ ఇచ్చి మాధవుడి పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నా జీవితం చక్కన అవుతుంది. కృష్ణుడు సంతోషిస్తాడు. మరేం చేసినా ఈ పరిస్థితి చక్కబడదు. ఇది సత్యం.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=9&Padyam=79

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, March 25, 2021

శ్రీకృష్ణ విజయము - 181

( సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట)

10.2-76-వ.
ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.
10.2-77-క.
"పాపాత్ముల పాపములం
బాపంగా నోపునట్టి పద్మాక్షునిపైఁ
బాపము గల దని నొడివిన
పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే?

భావము:
ఈలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని చేపట్టి, రాజసభకు సత్రాజిత్తును రప్పించి, జరిగిన విషయమంతా చెప్పి, మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు. “పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు అయిన ఆ పద్మాలవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి మీదనే అపనిందవేశాను. ఈ నా పాపానికి అంతం ఉందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=9&Padyam=77

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :