Sunday, February 28, 2021

శ్రీకృష్ణ విజయము - 161

( శంబరోద్యగంబు )

10.2-20-వ.
అంత నా రక్కసుండు వెక్కసంబగు రోషంబునఁ దనకు దొల్లి మయుం డెఱింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి, పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన; నమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయా వినాశిని యైన సాత్త్విక మాయం బ్రయోగించి దనుజుని బాణవృష్టి నివారించె; మఱియు వాఁడు భుజగ గుహ్యక పిశాచ మాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి.
10.2-21-క.
దండధర మూర్తిఁ గైకొని
యొండాడక చక్రిసూనుఁ డుగ్రతరాసిన్
ఖండించె శంబరుని తలఁ
గుండల కోటీర మణులు గుంభిని రాలన్.

భావము:
అప్పుడు శంబరుడు మితిమీరిన రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షసమాయతో ఆకాశంలోకి ఎగిరి, ప్రద్యుమ్నుడిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణవర్ష బాధకు ఓర్చుకుని సర్వ మాయలను నశింపజేయగల సాత్త్వికమాయ అనే విద్యను ప్రయోగించి, శంబరుడి శరవర్షాన్ని ఆపాడు. మళ్ళీ శంబరుడు ఎన్నో పిశాచమాయలను గుప్పించి నొప్పించాడు. ఆ మాయలను అన్నింటి నుండీ ప్రద్యుమ్నుడు తప్పించుకున్నాడు. శ్రీకృష్ణుడి కుమారుడగు ప్రద్యుమ్నుడు దండం ధరించు యముడి వలె భయంకర రూపము ధరించి, భీకరమైన పదును గల ఖడ్గంతో శంబరుని శిరస్సు ఖండించాడు. కిరీట కుండలాలలోని మణులు అన్నీ నేలరాలాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=3&Padyam=21

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 160

( శంబరోద్యగంబు )

10.2-17-మ.
గురు మాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై
హరిజుం "డోరి! నిశాట! వైచితివి నాఁ డంభోనిధిన్ నన్ను, ఘో
రరణాంభోనిధి వైతు నిన్ను నిదె వే ర"మ్మంచుఁ జీరెన్ మనో
హర దివ్యాంబరు నుల్లసద్దనుజ సేనాడంబరున్ శంబరున్.
10.2-18-చ.
అదలిచి యిట్టు కృష్ణసుతుఁ డాడిన నిష్ఠుర భాషణంబులం
బదహతమై వడిం గవియు పన్నగరాజముఁ బోలి శంబరుం
డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వ్రేసె నుజ్జ్వల
ద్భిదురకఠోరఘోష సమభీషణనాదము చేసి యార్చుచున్.
10.2-19-క.
దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ
దన గదచేఁ బాయ నడిచి దనుజులు బెదరన్
దనుజాంతకుని కుమారుఁడు
దనుజేశుని మీఁద నార్చి తన గద వైచెన్.

భావము:
ప్రద్యుమ్నుడు ఆ విధంగా గొప్ప మాయాయుద్ధ ప్రవీణుడు అయ్యాడు. పిమ్మట కవచమును ధరించాడు ధనుర్భాణములను చేబట్టాడు. మనోహరమైన వస్త్రాలంకారాలు ధరించువాడు, గొప్ప దానవసేనతో విలసిల్లుతున్న వాడు అయిన శంబరుణ్ణి “ఓరీ! రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పారేశావు కదా. ఈనాడు నిన్ను యుద్ధసముద్రంలో పడవేస్తాను. వేగంగా రారా” అని పిలిచాడు.ఇలా తనను ప్రద్యుమ్నుడు గద్దించి దూషణ వాక్యాలు పలుకడంతో, శంబరుడు తోకతొక్కిన పామువలె దర్పంతో విజృంభించి, వజ్రాయుధ మంత కఠోరమైన కంఠంతో గర్జిస్తూ, తన గదా దండంతో ప్రద్యుమ్నుణ్ణి కొట్టాడు. ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదను తన గదతో భగ్నం చేసి రాక్షసులు భయంచెందేలా బొబ్బపెట్టి, తన గదతో రాక్షసుడిని మోదాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=3&Padyam=19

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, February 25, 2021

శ్రీకృష్ణ విజయము - 159

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-14-క.
మాయావి వీఁడు; దుర్మతి
మాయఁడు సంగరములం; దమర్త్యుల గెలుచున్;
మాయికరణమున వీనిన్
మాయింపుము, మోహనాది మాయలచేతన్.
10.2-15-మత్త.
పాపకర్ముఁడు వీఁడు; నిన్నిఁటఁ బట్టి తెచ్చిన, లేచి "నా
పాపఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి!" యంచుఁ దాఁ
గ్రేపుఁ బాసిన గోవు భంగిని ఖిన్నయై, పడి గాఢ సం
తాపయై, నిను నోఁచి కాంచిన తల్లి కుయ్యిడ కుండునే?
10.2-16-వ.
అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వ శత్రు మాయా వినాశిని యైన మహామాయ విద్య నుపదేశించె; నివ్విధంబున.

భావము:
ఈ శంబరుడు దుర్మార్గుడు, మాయలమారి. దుష్టుడు యుద్ధాలలో మాయుల పన్ని దేవతలను ఓడిస్తుంటాడు. ఇతణ్ణి సమ్మోహనాది మాయలతో నీవు సంహరించు. ఎన్నో నోములు నోచి నిను కన్న తల్లి పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి తెచ్చిన తరువాత విలపించదా? లేగను బాసిన గోవు వలె “నా కుమారుడు ఏమయ్యాడో దేవుడా? నన్ను నా కుమారుడికి దూరం చేసావా?” అంటూ ఎంతగానో దుఃఖించి ఉండదా?”ఇలా వివరించి చెప్పి మాయావతి, మహానుభావుడైన ప్రద్యుమ్ముడికి సర్వశత్రుమాయలను మాయింపజేయగల మహామాయ అనే విద్యను ఉపదేశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=15

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 158

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-11-వ.
అని, తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి, పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు, మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి, ప్రద్యుమ్నుం డిట్లనియె.
10.2-12-మత్త.
"నా తనూభవుఁ డీతఁ డంచును, నాన యించుక లేక యో!
మాత! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం
ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌; మహా
ఖ్యాత వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్."
10.2-13-వ.
అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము.

భావము:
అని తనను జనులు స్తుతించే టంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో. ఆజానుబాహువులతో, ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకార విశేషంతో అలరారే ఆ మన్మథుడిని మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడిన చూపులతో ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నేను నీ కుమారుడ ననే భావం లేక, సిగ్గు విడిచి కామినిలా ప్రవర్తిస్తూ విలాసములు చేస్తున్నావు. మాతృభావం వదలివేసావు. నీ విలా నన్ను మోహించుట ధర్మబద్ధమైన పని కాదు.” ఈలాగ పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది. “నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి, సముద్రంలో పారేసాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=12

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, February 24, 2021

శ్రీకృష్ణ విజయము - 157

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-9-క.
సుందర మగు తన రూపము
సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్,
సౌందర్య మేమి చెప్పను?
బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు; నృపా!
10.2-10-సీ.
"చక్కని వారల చక్కఁ దనంబున-
  కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె?
మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై-
  శంకరు నెవ్వండు సగము సేసె?
బ్రహ్మత్వమును బొంది, పరఁగు విధాతను-
  వాణికై యెవ్వఁడు వావి సెఱిచె?
వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని-
  మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె?
10.2-10.1-తే.
మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు
మగల మగువల నెవ్వండు మరులుకొలుపు?
గుసుమధనువున నెవ్వండు గొను విజయము
చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?"

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ప్రద్యుమ్నుడి చక్కదనం ఒక్కమాటు చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్ణించడం ఎందుకు. “సౌందర్యవంతుల అందచందాలను వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి తగినవాడూ; తపోనిష్ఠతో విరాజిల్లే పరమేశ్వరుడిని పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసినవాడూ; బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవికోసం వావివరుసలు మరచిపోయేలా గావించినవాడూ; దేవేంద్రుని వేయికళ్ళ వేల్పుగా నిలిపినవాడూ; మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగల వాడూ; స్త్రీపురుషుల కొకరిపై మరొకరికి ప్రేమభవం కల్గించేవాడూ; చెరకువింటితో ప్రపంచాన్ని జయించగలిగినవాడూ; చిగురుటాకు అనే బాకుతో లోకులను చీకాకుపరచి, చిక్కులపాలు చేసేవాడూ ఎవరంటే, ఈ మన్మథుడే అయిన ప్రద్యుమ్నుడే.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=10

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Monday, February 22, 2021

శ్రీకృష్ణ విజయము - 156

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-6-వ.
సముద్రంబులోన నా మీనంబును, దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి, శంబరునకుం గానికఁగా నిచ్చిన, నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన.
10.2-7-క.
రాజునగరి యడబాలలు
రాజీవముకడుపు వ్రచ్చి, రాజనిభాస్యున్
రాజశిశువుఁ గని, చెప్పిరి
రాజీవదళాక్షియైన రతికి; నరేంద్రా!
10.2-8-వ.
అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.

భావము:
ప్రద్యుమ్నుడిని మ్రింగిన పెనుచేపతోపాటు తిరుగుతున్న మరికొన్ని చేపలను కూడా పట్టుకున్నారు. వాటిని తీసుకువచ్చి శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపాడు. వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు. అంతకు ముందే నారదమహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మ్రింగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో, ఆ శిశు రూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, February 21, 2021

శ్రీకృష్ణ విజయము - 155

( ప్రద్యుమ్న జన్మంబు ) 

10.2-3-ఉ.
“తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై,
వేమఱు నిష్ఠఁ జేసి, హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.
10.2-4-వ.
అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం, దనకు శత్రుండని యెఱింగి, శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి, కొనిపోయి సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు.
10.2-5-క.
జాలిఁ బడి పాఱు జలచర
జాలంబులఁ బోవనీక, చని రోషాగ్ని
జ్వాలలు నిగుడఁగ, నూరక
జాలంబులు వైచిపట్టు జాలరు లంతన్.

భావము:
విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయి, తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి, రుక్మిణీ కృష్ణులకు, కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా ఉద్భవించాడు. ఆ బాలుడు “ప్రద్యుమ్నుడు” అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు తనకు శత్రువని తెలిసి, పురిటిగృహంలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా శంబరుడనే రాక్షసుడు కామరూపంలో వచ్చి, ఆ బాలుణ్ణి తన మాయా శక్తితో అపహరించుకుని వెళ్ళి, సముద్రంలొ పడవేశి, తన ఇంటికి పోయాడు. ఆ బాలుడు సముద్రజలాలలో పడి మునగుతూ ఉండగా ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగివేసింది. జాలరులు వెళ్ళి తమ కోపాగ్ని జ్వాలలు మించగా, సముద్రంలో వలల వేసి బెదిరి పోతున్న జలచరాలను అటునిటు పారిపోనీకుండా పట్టుకుంటున్నారు. వారు ఇంతలో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :