Monday, September 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 41

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1247-మ.
పరిఖల్ గోటలు కొమ్మలుం బడగలుం బ్రాసాదముల్ వీధులున్
హరులుం దేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్
తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్
గర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్ గాంచెన్ విభుం డంతటన్.
10.1-1248-వ.
కని య ప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున.
10.1-1249-ఉ.
"నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము; గోపకామినీ
బృందము నోముపంట; సిరివిందు దయాంబుధి యోగిబృందముల్
డెందము లందుఁ గోరెడు కడింది నిధానము చేరవచ్చె నో! 
సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కిదీరఁగన్. "

భావము:
శ్రీకృష్ణుడు అల్లంతదూరంలో అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకాలు, రాజభవనాలు, వీధులు, గుఱ్ఱాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప గొప్ప ఉద్యాన వనాలు, నడబావులు మున్నగు వాటి అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూసాడు. అలా చూసి, ఆ పట్టణంలో ప్రవేశించి సంచరిస్తున్న సమయంలో “ఓ రమణులారా! నందుడి తపస్సుకు ఫలముగా కలిగిన వాడు, మేలిగుణాల ప్రోవు అయిన వాడు, గొల్ల పడచుల నోముల పంట ఐన వాడు, లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కూర్చేవాడు, కరుణాసముద్రుడు, యోగులు అందరూ తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి వంటివాడు అయిన శ్రీకృష్ణుల వారు వస్తున్నారు. కన్నుల కాంక్ష తీరేలా వెళ్ళి వీక్షిద్దాము రండి”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1249

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, September 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 40

( శ్రీమానినీచోర దండకము )

10.1-1244-వ.
అని మఱియుం బ్రార్థించిన హరి యిట్లనియె.
10.1-1245-క.
"యదుకుల విద్వేషణుఁడై
మదమున వర్తించు కంసు మర్దించి భవ
త్సదనంబుఁ జూడ వచ్చెదఁ
బొద యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!"
10.1-1246-వ.
అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చిరని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు.

భావము:
అంటూ మరీ మరీ వేడుకుంటున్న అక్రూరునితో హరి ఇలా అన్నాడు. “పాపరహితుడవైన అక్రూరా! యాదవులకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు.” ఇలా చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు విని, అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు మధ్యాహ్నం సమయంలో బలరాముడు గోపకులు తాను కలిసి మథురానగరం ప్రవేశించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1245

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 39

( శ్రీమానినీచోర దండకము )

10.1-1240-వ.
అనిన నతం డిట్లనియె.
10.1-1241-క.
"నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల;
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"
10.1-1242-వ.
అని పలికి సాయంకాలంబునకు నక్రూరుండు మథురానగరంబు చేర రథంబు గడపె నంతట నటమున్న చని నందాదులు పురోపవనంబున విడిసి యుండ వారలం గూడుకొని కృష్ణుం డక్రూరునిం జూచి “నీవు రథంబు గొనుచు నగరంబునకుం జనుము మేము వెనుక వచ్చెద” మనిన నతం డిట్లనియె.

భావము:
ఇలా అడిగిన కృష్ణుడితో అక్రూరుడు ఇలా అన్నాడు. “స్వామీ నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? మహాత్మా! సర్వదిక్కులలోని విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి కదా.” ఇలా చెప్పి అక్రూరుడు సాయంకాలానికి మధురాపురి చేరేటట్లుగా రథాన్ని నడిపాడు. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైనవారు పొలిమేరలోని తోపులో బసచేసి ఉన్నారు. కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుడిని చూసి “నీవు రథాన్ని తోలుకుని పట్టణానికి వెళ్ళు. మేము తర్వాత వస్తాము” అని చెప్పగా అతడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1241

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


Thursday, September 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 38

( శ్రీమానినీచోర దండకము )

10.1-1237-మ.
కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్
జలవాంఛారతి నెండమావులకు నాసల్ చేయు చందంబునం
దలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృధాతత్వజ్ఞుఁడన్నాకు నీ
విలసత్పాదయుగంబుఁ జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!"
10.1-1238-వ.
అని మఱియును వినుతింప, నక్రూరునికి యమునాజలంబుల లోనం దన మొదలి మేను చూపి, చాలించి, నటునికైవడిఁ దిరోహితుండైన, నక్రూరుండు నీరు వెడలి వెఱంగుపడుచు వచ్చి, రథారోహణంబు చేసిన హరి యిట్లనియె.
10.1-1239-క.
“జలములు చేరువ నున్నవి
తలపోయఁగ నీవు పోయి తడ వయ్యె; నదీ
జలముల నభమున ధరణిం
గలుగని చోద్యములు నీకుఁ గానంబడెనే?"

భావము:
లక్ష్మీనాథుడవైన శ్రీకృష్ణా! దాహం తీర్చుకోడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆశపడినట్లు స్వప్న సమానము లయిన పుత్రులు మిత్రులు కళత్రములు గృహములు మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను. నేను మూఢుణ్ణి మిథ్యాతత్త్వజ్ఞుణ్ణి ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు.” అని మరల మరల తనను స్తోత్రం చేస్తున్న అక్రూరుడికి తన పూర్వరూపం చూపి నటుడు తన పాత్ర పోషణ అయ్యాక ఆ వేషాన్ని తెరమరుగైనట్లు, తిరిగి దానిని మరగుపరచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు. అక్రూరుడు నీటి నుండి బయటకు వచ్చి ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు. అప్పుడు కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. “నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కదా. నీవు స్నానానికి వెళ్ళి చాలా సేపయింది. ఆకాశంలోనూ, భూమిలోనూ లేని వింతలేమైనా నదీజలాలలో కాని కన్పించాయా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1239

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 37

( శ్రీమానినీచోర దండకము )

10.1-1236-దం.
శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబుల న్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్; నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.

భావము:
“ఓ శ్రీమన్నారాయణా! అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా! మంగళ స్వరూపం కలవాడా! ఓ వీరుడా! నిఖిల ప్రపంచ సృష్టికి కారణ మైన పృథివ్యాది పంచమహాభూతాలకూ కారణ మైనవాడా! మిక్కిలి చలించు తరంగశ్రేణిచే కలత నొందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీన మైపోయి నప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడావు. అప్పుడు నీ నాభికమలం నుంచి సకల భువనాలను సృజించు విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారము మాయ మహాత్తత్వము మనస్సు మొదలైనవీ ఇంద్రియములూ ఇంద్రియవృత్తు లైన శబ్ద స్పర్శ రూప రస గంధములూ లోకములూ లోకకారణములూ ఈ సమస్తమూ నీ మహా శరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడవై యున్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించుటకు ఎంత గొప్పవారయినా సమర్ధులు కారు. మాయ మున్నగు తత్త్వములు జడములు కాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్టి మాయా సంబంధ మైన గుణాలచే ఆవరింపబడున్నాడు. కనుక అతడు నిన్ను ఇలాంటివాడిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు మున్నగువారు నిన్ను ఆధ్యాత్మ ఆధిదైవ ఆధిభూతములకు అనగా దేహాంద్రియాధి దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకు డైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాము లైన కొందరు కర్మయోగులు నీవు ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు అంటారు. ఇది నిజ మంటున్నారు. మరికొందరు జ్ఞాన యోగులు అన్ని కర్మలను వదలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరిం నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ భేధాలతో నలువురై సొంపు ఘటిస్తున్నా వంటున్నారు, కొందరు నీవు నారాయణుడ వనీ, కొందరు శివుడవనీ అనేక రకాలుగా శ్లాఘిస్తున్నారు. ఇందులో తప్పులేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబము ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలం ద్రొక్కక ఒంటరివాడవై యుంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖము; చంద్రసూర్యులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; చెట్లు నీ రోమములు; గాలి నీ ప్రాణము; ఇంద్రాదులు నీ బాహువులు; మేఘాలు నీ తలవెంట్రుకలు; ఆకాశం నీ నాభి; రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు; బ్రహ్మ నీ మేఢ్రము; వర్షము నీ వీర్యము; స్వర్గము నీ శిరస్సు; ఇలా నీ శరీరంలో బ్రహ్మాండములు అత్తి చెట్టు కొమ్మలలో ఉన్న పండ్ల వలె నీ అందు అనంత ప్రాణి సమూహం మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్పురుషా! నీ రూపములు పొగడ్తకు అందనివి. మునుపు మత్స్యాకృతితో ప్రళయ సాగర మందు శత్రు వగు సోమకు నెదిరించి సాధించి వేదప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రముచే బూని మధు, కైటభులను సంహరించావు కదా. కూర్మ రూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు కదా. వరాహ రూపం ధరించి క్రుంగుతున్న భూమండలాన్ని లేవ నెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు కదా. భయంకర శత్రు వగు హిరణ్యకశిపుని నరసింహాకృతితో నీవు సంహరింప లేదా? ప్రతాపశీలి వగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించ లేదా? బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా? భార్గవ రాముడవై క్షత్రియ సమూహమును వధింప లేదా? దశరథ రాముడవై చంద్రబింబము వంటి మోము గల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని దునుమాడ లేదా? వాసుదేవాది రూపములను దాల్చి క్రూరులను శిక్షించ లేదా? శుద్ధబుద్ద స్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరగించావు కదా. కల్కిరూపము ధరించి పెంపుతో వెలుగొందవా? నిన్ను పొగుడుటకు నేను ఏపాటివాణ్ణి; నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి; దుఃఖము చెందిన వాణ్ణి; అనుగ్రహబుద్ధితో నా దిగులు దీర్చి నన్నాదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా! కరుణయే అలంకారముగా కలవాడా! నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా! నీకు అభివాదము. నీకు నమస్కారము. నీకు వందనము. నీకు ప్రణామము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1236

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, September 22, 2020

శ్రీ కృష్ణ విజయము - 36

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1235-వ.
మఱియుఁ జారు లక్షణలక్షిత నఖ పాద గుల్ఫ జాను జంఘోరు కటి నాభి మధ్యోదరుండును; సాదరుండును; శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజిత విశాలవక్షుండును; బుండరీకాక్షుండును; శంఖ చక్ర గదా పద్మ హస్తుండును; సత్వగుణ ప్రశస్తుండును; బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకరకుండల కిరీటాది విభూషణుండును; భక్తజనపోషణుండును; సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును; నీలనీరద వర్ణుండును గంబుకంధరుండును; గరుణాగుణ బంధురుండును; ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును; శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతీలోర్జా విద్యాశక్తి మాయాశక్త్యాది సేవితుండునునై యొప్పు నప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తిసంభ్రమంబు లగ్గంబులుగ గద్గదకంఠుండై దిగ్గనం గరంబులు ముకుళించి యిట్లని వినుతించె.

భావము:
రమ్యమైన శుభలక్షణాలు గల గోళ్ళు, పాదములు, మడములు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటిప్రదేశము, నాభి, నడుము, కడుపు కలవాడు; ఆదరముతో కూడిన వాడు; శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభము అనే మణి, వనమాల అనే పేరు గలిగిన పూవులు ఆకులు చేర్చి కట్టి మెడ నుండి కాళ్ళ వరకు వ్రేలాడు మాలతో విరాజిల్లే వెడల్పైన రొమ్ము కలవాడు; తెల్లతామరల వంటి కన్నులు కలవాడు; సత్త్వగుణ సంపన్నుడు; జందెము, మొలతాడు, ముత్యాలపేరు, భుజకీర్తులు, అందెలు, కంకణాలు, మకరకుండలాలు, కిరీటము మొదలైన ఆభరణాలతో అలంకృత మైనవాడు; భక్తులను కాపాడేవాడు; చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు, పెదవి, ముఖము చెవులు కలవాడు; నీలమేఘము వంటి దేహకాంతి కలవాడు; ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మున్నగువారిచే పూజింపబడుతూ ఉండువాడు; లక్ష్మి, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయ మున్నగు తేజోమూర్తులు శక్తులచే సేవింపబడేవాడు అయిన ఆ పరమాత్మునికి అక్రూరుడు మ్రొక్కాడు. భక్తిసంభ్రమాలతో తటాలున చేతులు జోడించి డగ్గుత్తికతో ఈవిధంగా స్తోత్రం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1235

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 35

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1234-సీ.
ఆ భోగి భోగపర్యంక మధ్యంబున;-
  వలనొప్పు పచ్చని వలువవాని
మేఘంబుపై నున్న మెఱుఁగు చందంబున-
  నురమున శ్రీదేవి యొప్పువాని
ముసురు తేఁటులు విప్ప ముఖచతుష్కముగల;-
  తనయుఁ డాడెడి బొడ్డుదమ్మివానిఁ
గదలని బహుపదక్రమవిశేషంబుల-
  రవము చూపెడి నూపురములవాని
10.1-1234.1-ఆ.
జలజగర్భ రుద్ర సనక సనందన
సద్ద్విజామర ప్రశస్యమాన
చరితుఁడైనవాని సౌందర్యఖనియైన
వాని నొక్క పురుషవర్యుఁ గాంచె.

భావము:
ఇంకా, ఆ అక్రూరుడు; ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఆ పానుపు మధ్య భాగంలో శయనించి ఉన్న అందాలగని అయిన పురుషోత్తముడిని దర్శించాడు. ఆ దివ్యపురుషుడు మెరిసిపోతున్న పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకుని ఉన్నాడు. మేఘంలో మెరిసే మెరుపు లాగ, అతని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఒప్పుతున్నది. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో ఆ నాలుగు ముఖాల నందనుడు క్రీడిస్తున్నాడు. ఆ పురుషోత్తముడు కాలు కదపకుండానే, కాలిఅందెలు ఎన్నో పదక్రమాల విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. ఆయన బ్రహ్మ, ఈశ్వర, సనక సనందన, సద్బ్రాహ్మణ, దేవతల చేత స్తుతింపబడుతుండే వాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1234

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :