Tuesday, March 31, 2020

ధ్రువోపాఖ్యానము - 22

4-280-వ.
ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు; అదియునుం గాక.
4-281-చ.
వరమతి నార్తబాంధవ! భవద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం
దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ
చరణములం గృతజ్ఞుఁడగు సజ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?

భావము:
ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు. దీనబాంధవా! నిద్రనుండి మేలుకొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానంచేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు. మోక్షం కోరే వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైన సజ్జనుడు ఎలా మరచిపోగలడు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=281

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Monday, March 30, 2020

ధ్రువోపాఖ్యానము - 21

4-278-సీ.
హరి యీశ్వరుండు విహంగ కులేశ్వర;
యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ
గనుఁగొను వేఁడుక జనియింప నా మధు;
వనమున కప్పుడు చని ధ్రువుండు
పరువడి యోగవిపాక తీవ్రంబైన;
బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ
మందుఁ దటిత్ప్రభాయత మూర్తి యటఁ దిరో;
ధానంబునను బొంది తత్క్షణంబ
4-278.1-తే.
తన పురోభాగమందు నిల్చినను బూర్వ
సమధికజ్ఞాన నయన గోచర సమగ్ర
మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ
దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు
4-279-తే.
నయనముల విభుమూర్తిఁ బానంబు చేయు
పగిదిఁ దన ముఖమునను జుంబనము చేయు
లీలఁ దగ భుజములను నాలింగనంబు
చేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె.

భావము:
భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు. తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=278

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 20


4-276-చ.
"హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై
పరఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం
దిరవుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం
బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!"
4-277-వ.
అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె “ఉత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నా యందుఁ దన చిత్తం బైక్యంబు చేసి తపంబు గావించుచుండ, దానంజేసి భవదీయ ప్రాణనిరోధం బయ్యె; అట్టి దురత్యయం బైన తపంబు నివర్తింపఁ జేసెద: వెఱవక మీమీ నివాసంబులకుం జనుం” డని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుఁ బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబు.

భావము:
“శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.” అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింప జేస్తాను. భయపడకండి. మీ మీ ఇండ్లకు వెళ్ళండి” అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=277

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Saturday, March 28, 2020

ధ్రువోపాఖ్యానము - 19

4-272-తే.
వసుమతీతల మర్ధము వంగఁ జొచ్చె
భూరిమద దుర్నివారణ వారణేంద్ర
మెడమఁ గుడి నొరగఁగ నడు గడుగునకును
జలన మొందు నుదస్థిత కలము వోలె.
4-273-చ.
అతఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా!
4-274-క.
ఆలోకభయంకర మగు
నా లోకమహావిపద్దశాలోకనులై
యా లోకపాలు రందఱు
నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్.
4-275-వ.
అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి.

భావము:
మదపుటేనుగు కుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగడుగునా కంపించే పడవలాగా సగం భూమి వంగి క్రుంగింది. ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి. లోకాలకు సంభవించిన ఆ చూడటానికి భయంకరమైన మహా విపత్తును చూచి అష్ట దిక్పాలకులు మొదలైన లోకపాలు రందరూ భయంతో లోకరక్షకుడైన హరిని దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళి దేవతలంతా నారాయణునికి నమస్కరించి చేతులు మోడ్చి ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=274

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 18

4-270-వ.
అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; అంత.
4-271-సీ.
సకల భూతేంద్రి యాశయ మగు హృదయంబు;
నందు విషయములఁ జెందనీక
మహదాది తత్త్వ సమాజమ్ములకును నా;
ధార భూతమును బ్రధాన పూరు
షేశ్వరుఁ డైనట్టి శాశ్వత బ్రహ్మంబుఁ;
దనదైన హృదయ పద్మమున నిలిపి
హరి రూపమున కంటె నన్యంబు నెఱుఁగక;
చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న
4-271.1-తే.
కతన ముల్లోకములు చాలఁ గంపమొందె;
వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి
నొక్కపాదంబు చేర్చి నిల్చున్నవేళఁ
బేర్చి యబ్బాలు నంగుష్టపీడఁ జేసి.

భావము:
ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు. ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చొరనీయలేదు. మహత్తు మొదలైన తత్త్వాలకు ఆధారభూతుడూ, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడూ, శాశ్వతుడూ అయిన భగవంతుణ్ణి తన హృదయపద్మంలో నిలుపుకున్నాడు. శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తదాయత్తం చేశాడు. ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు. అతని తపఃప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిలుచున్నాడు. అతని కాలి బొటనవ్రేలి ఒత్తిడికి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=271

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Wednesday, March 25, 2020

ధ్రువోపాఖ్యానము - 17


4-264-ఉ.
కావున నమ్మహాత్ముఁడు సుకర్మము చేత సమస్త లోకపా
లావళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు
శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ
త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా!
4-265-వ.
అదియునుం గాక.
4-266-క.
నీ కీర్తియు జగముల యం
దాకల్పము నొందఁజేయు నంచిత గుణర
త్నాకరుఁ డిట కేతెంచును
శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!"
4-267-క.
అని నారదుండు పలికిన
విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం
దనుఁ జింతించుచు నాదర
మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్.
4-268-వ.
అంత నక్కడ నా ధ్రువుండు.
4-269-క.
చని ముందటఁ గనుఁగొనె మధు
వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా
వనమును దుర్భవ జలద ప
వనమును నిఖిలైక పుణ్యవరభవనంబున్.

భావము:
రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.” అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు. ఆ సమయంలో అక్కడ ధ్రువుడు పోయి పోయి ఎదురుగా మధువనాన్ని చూశాడు. దాని పవిత్రతను మునులు, దేవతలు, యోగులు మొదలైన వారు వర్ణించారు. అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది. సకల పుణ్యాలకు తావైనది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=269

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 16

4-261-మ.
చని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బరిశ్రాంతుండు క్షుత్పీడితుం
డును నామ్లాన ముఖాంబుజుండు ననఘుండున్ బాలకుం డైన మ
త్తనయున్ ఘోర వృ కాహి భల్ల ముఖ సత్త్వశ్రేణి నిర్జించెనో
యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్.
4-262-తే.
అట్టి యుత్తమబాలు నా యంకపీఠ
మందుఁ గూర్చుండనీక నిరాకరించి
యంగనాసక్త చిత్తుండ నైనయట్టి
నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర!"
4-263-ఉ.
నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా
దేవకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీవదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ
ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్?

భావము:
అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను.అటువంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.” ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=263

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :