Friday, August 16, 2019

కపిల దేవహూతి సంవాదం - 90


( గర్భ సంభవ ప్రకారంబు )

3-996-సీ.
అనవుడు సుతునకు జనని యిట్లనుఁ "దగ; 
మహితాత్మ! యెవ్వని మహిమచేత
ఘనమోహులై గుణకర్మనిమిత్త సాం; 
సారికమార్గ సంచారములను
ధృతిసెడి యలసి యేదిక్కు నెఱుంగక; 
హరిపాద ధ్యానంబు నాత్మ మఱచి
యుండు వారలకు నే యుక్తియు నమ్మహా; 
పురుషు ననుగ్రహబుద్ధి లేక
3-996.1-తే.
తద్గుణధ్యాన తన్మూర్తి దర్శనములు
గోచరించుట యెట్లు నాకునుఁ బ్రబోధ
కలితముగఁ బల్కు" మనవుడుఁ గపిలుఁ డనియె
నంబతోడను సుగుణకదంబతోడ.

భావము:
అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది “ఓ మహానుభావా! ఎవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక, అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో, ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలనీ, ఆయన రూపాన్ని దర్శించాలనీ బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు” అని అడిగిన సద్గుణవల్లియైన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=996

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, August 15, 2019

కపిల దేవహూతి సంవాదం - 89


( గర్భ సంభవ ప్రకారంబు )

3-995-సీ.
ఎవ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు; 
మాయావలంబున మహితకర్మ
బద్ధుఁడై వర్తించు పగిది దందహ్యమా; 
నంబగు జీవ చిత్తంబు నందు
నవికారమై శుద్ధమై యఖండజ్ఞాన; 
మున నుండు వానికి ముఖ్యచరితు
నకు నకుంఠితశౌర్యునకుఁ పరంజ్యోతికి; 
సర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ
3-995.1-తే.
గడఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ
డయిన వానికి మ్రొక్కెద నస్మదీయ
దుర్భరోదగ్ర భీకర గర్భనరక
వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు."

భావము:
ఏ దేవుడు సమస్త జీవరాసులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కన్పిస్తాడో, దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశుద్ధుడై, అఖండజ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ దయామయునికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషులకంటె అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=995

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, August 14, 2019

కపిల దేవహూతి సంవాదం - 88


(గర్భ సంభవ ప్రకారంబు)

3-993-క.
అనయమును భువనరక్షణ
మునకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి
ష్ణుని భయవిరహిత మగు పద
వనజయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్.
3-994-వ.
అదియునుం గాక; పంచభూత విరహితుఁ డయ్యుం బంచభూత విరచితం బైన శరీరంబు నందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుం డైన నేను.

భావము:
ఎల్లప్పుడు లోకాలను రక్షించడానికి ఇచ్ఛానుసారం జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాదపద్మాలను అనురక్తితో, భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి. అంతేకాక పంచభూతాలు లేకున్నా పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఇంద్రియగుణాలు, ఇంద్రియార్థాల అస్తిత్వం తెలిసీ తెలియని అభాసజ్ఞానం కలిగిన నేను....

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=994

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 87


(గర్భ సంభవ ప్రకారంబు)

3-992-వ.
మఱియు; మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులు గలిగి నాలవ మాసంబున సప్తధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి షష్ట మాసంబున మావిచేతం బొదువం బడి తల్లి కుక్షిని దక్షిణభాగంబునం దిరుగుచు మాతృభుక్తాన్న పానంబులవలనఁ దృప్తి బొందుచు నేధమానధాతువులు గల్గి జంతు సంకీర్ణంబగు విణ్మూత్రగర్తం బందుఁ దిరుగుచుఁ క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబు లైన రసంబులచేత బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిప్రదేశంబు నందు నాత్రంబులచేత బద్ధుండై కుక్షి యందు శిరంబు మోపికొని భుగ్నం బైన పృష్టగ్రీవోదరుండై స్వాంగ చలనంబు నందు నసమర్దుం డగుచుఁ బంజరంబందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వజన్మ దుష్కృతంబుల దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించు; అంత నేడవ నెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతి వేపితుం డగుచు యోచమానుండు దేహాత్మదర్శియుఁ బునర్గర్భ వాసంబునకు భీతుండు నగుచు బంధనభూతం బగు సప్తధాతువులచే బద్ధుం డై కృతాంజలి పుటుండు దీనవదనుండు నై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింపఁబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు.

భావము:
మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాలుగవ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. ఐదవనెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. ఆరవ నెలలో మావిచేత కప్పబడి, తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేశ్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మల మూత్రాల గుంటలలో పొర్లుతూ, అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తపింపచేస్తాయి. మావిచే కప్పబడి, బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లిపొట్టలో తలదూర్చి, వంగి, ముడుచుకొని, పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తుకూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. ఏడవనెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తూ, మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై, చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=992

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, August 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 86


(గర్భ సంభవ ప్రకారంబు)

3-991-సీ.
"కైకొని మఱి పూర్వకర్మానుగుణమున; 
శశ్వత్ప్రకాశకుం డీశ్వరుండు
ఘటకుండు గావునఁ గ్రమ్మఱ జీవుండు; 
దేహసంబంధంబుఁ దివిరి తాల్ప
దొరఁకొని పురుషరేతోబిందుసంబంధి; 
యై వధూగర్భంబు నందుఁ జొచ్చి
కైకొని యొకరాత్రి గలిలంబు పంచరా; 
త్రముల బుద్బుదమును దశమ దివస
3-991.1-తే.
మందు గర్కంధు వంత యౌ నంతమీఁదఁ
బేశి యగు నంతమీఁదటఁ బేర్చి యండ
కల్ప మగు నొక్క నెల మస్తకమును మాస
యమళమైనను గరచరణములుఁ బొడము
గర్భస్థ పిండం దశలు

భావము:
“ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై, తర్వాత ఐదురాత్రులకు బుద్బుదమై, ఆపైన పదవదినానికి రేగుపండంత అయి, అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=991

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, August 8, 2019

కపిల దేవహూతి సంవాదం - 85


(భక్తి యోగం)

3-989-ఉ.
ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్రగదాసిధారలం
దెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీఁద నిభేంద్ర పంక్తి ఱొ
ప్పింతురు ఘోర భంగిఁ గఱపింతురు పాములచేత బిట్టు ద్రొ
బ్బింతురు మీఁద గుండ్లు దినిపింతురు దేహముఁ గోసి కండలన్.
3-990-వ.
మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుం డై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునుం బొంది నిజ ధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునం బరస్పర సంబంధంబునఁ గల్పింపబడిన తమిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి తీవ్రంబు లయిన బహుయాతనల ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు" నని చెప్పి వెండియు నిట్లనియె.

భావము:
వేడినీళ్ళలో ముంచుతారు. పెద్ద గదలతోను, కత్తులతోను మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచుతారు. మదపుటేనుగులతో త్రొక్కిస్తారు. పాములచేత క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్ళు మీదకు విసరుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండలను ఆ పాపాత్మునిచేతనే తినిపిస్తారు. పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ, తన పొట్టను నింపుకొంటూ, అధర్మమార్గంలో నడుస్తూ, ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకొని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకొని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిస్రం, అంధతామిస్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ, తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్యజన్మను పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=990

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 84


(భక్తి యోగం)

3-987-వ.
ఇట్లు మహాపాపాత్ముం డైనవాఁడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్యదోషి యగువాఁడు ముహుర్తద్వయంబునను నేగి యాతనం బొందును; అందు.
3-988-క.
పట్టుదురు కొఱవులను వడిఁ
బెట్టుదు రసిపత్రికలను బెనుమంటల యం
దొట్టుదు రొడళ్ళు నలియన్
మట్టుదు రప్పాపచిత్తు మత్తుం బెలుచన్.

భావము:
ఈవిధంగా మహాపాపి యైనవాడు మూడు ముహూర్తాల కాలంలో, సామాన్యదోషి యైనవాడు రెండు ముహూర్తాల కాలంలో వెళ్ళి యాతనలను పొందుతారు. ఆ యమలోకంలో ప్రమత్తుడైన ఆ పాపాత్ముని పట్టుకొని కొరవులతో కాలుస్తారు. చురకత్తులు గ్రుచ్చుతారు. భగభగ మండే మంటలో పడవేస్తారు. ఒళ్ళంతా చిల్లులు పడేటట్లు చితుకబొడుస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=988

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :