Tuesday, July 9, 2019

కపిల దేవహూతి సంవాదం - 58


( సాంఖ్య యోగము )

3-946-సీ.
సుత దార మిత్రానుజులకంటె మర్త్యుండు; 
భిన్నుఁడై వర్తించుచున్నరీతి
విస్ఫులింగోల్ముక విపులధూమములచే; 
హవ్యవాహనుఁడు వేఱయినరీతి
వలనొప్ప దేహంబువలన నీ జీవాత్మ; 
పరికింప భిన్నరూపమున నుండుఁ
దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల; 
భాసిల్లుచున్న యీ ప్రకృతిరూప
3-946.1-తే.
బ్రహ్మమున కాత్మ దాఁ బృథగ్భావ మగుచు 
ద్రష్టయయి బ్రహ్మ సంజ్ఞచేఁ దనరుచుండు
నఖిలభూరి ప్రపంచంబు లందుఁ దన్నుఁ
దవిలి తనయందు నఖిల భూతములఁ గనుచు.

భావము:
పుత్ర మిత్ర కళత్రాదులకంటె మానవుడు వేరైనట్లు, మిణుగురుల కంటే, కొరవుల కంటే, పొగ కంటే అగ్ని వేరైనట్లు దేహం కంటే జీవాత్మ వేరై ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము, వీటితో భాసించే ఈ ప్రకృతి రూప పరమాత్మ కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ సంజ్ఞతో ద్రష్టయై ఒప్పుతూ అఖిల భూతాలలో తననూ, తనలో అఖిల భూతాలను కనుగొంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=946

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 57


( సాంఖ్య యోగము )

3-945-వ.
మదిరాపానంబునం జేసి మత్తుం డగు వాఁడు దనకు బరిధానంబగు నంబరంబు మఱచి వర్తించు చందంబునఁ, దన శరీరంబు దైవాధీనం బని నశ్వరం బని తలంచి యాత్మతత్త్వనిష్ఠుండై యుపేక్షించు; అదియునుం గాక సమాధియోగంబునం జేసి సాక్షాత్కృతాత్మతత్త్వంబు గలవాడయి స్వాప్నికశరీరంబు చందంబున యావత్కర్మఫలానుభవ పర్యంతంబు పుత్ర దార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి; యటమీదఁ బుత్ర దారాది సంబంధంబువలనం బాసి వర్తించు.

భావము:
మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమనీ, అది ఎప్పుడో నశించిపోయేదనీ భావించి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింప వలసినంత వరకు భార్యాపుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కలనుండి మేల్కొన్నవానిలాగా ఈ సంసార బంధాలన్నీ వదలిపెట్టి వర్తిస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=945

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Saturday, July 6, 2019

కపిల దేవహూతి సంవాదం - 56


( సాంఖ్య యోగము )

3-944-సీ.
పురుషుఁడు చరమమై భువి నన్య విషయ ని; 
వృత్తమై తగ నివర్తించు చిత్త
వృత్తాదులను గల్గి వెలయంగ నాత్మీయ; 
మగు మహిమ సునిష్ఠుఁడై లభించు
సుఖదుఃఖముల మనస్సునఁ దలపక యహం; 
కారధర్మంబులుగాఁ దలంచి
యనయంబు సాక్షాత్కృతాత్మతత్త్వము గల్గు; 
నతఁడు జీవన్ముక్తుఁ డండ్రు ధీరు
3-944.1-తే.
లతఁడు నే చందమున నుండు ననిన వినుము
తన శరీరంబు నిలుచుటయును జరించు
టయును గూర్చుండుటయు నిఁకేమియునెఱుంగ
కర్థి వర్తించు విను తల్లి! యతఁడు మఱియు.

భావము:
ఏ పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాలనుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో ఆ పురుషునికి ఆత్మతత్త్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు. తల్లీ! ఇంకా విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=944

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 55


( సాంఖ్య యోగము )

3-943-వ.
అది గావున; ముక్తి నపేక్షించు మహాత్ముం డగు వాని చిత్తంబు విముక్తం బైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీరభావంబుల ననన్యభావం బగు నిర్వాణపదంబు సూక్ష్మం బగు తేజంబు దన కంటె నధింకబగు తేజంబు తోడి సమానాకారంబు నగు చందంబున నిచ్చగించు; వెండియు.

భావము:
అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాలనుండి విముక్తమవుతుంది. దానిలో భగవంతునికంటె వ్యతిరిక్తమైన భాగానికి తావు లేదు. భగవంతునికంటె అన్యం కన్పించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషునకు అనన్యస్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే విధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలైన వానియందు వేరే భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఆ అనన్యభావమే మోక్షం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=943

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, July 3, 2019

కపిల దేవహూతి సంవాదం - 54


( సాంఖ్య యోగము )

3-942-సీ.
"ఈ ప్రకారమున సర్వేశ్వరు నందును; 
బ్రతిలబ్ధ భావసంపన్నుఁ డగుచుఁ
జిరతర సద్భక్తిచేఁ బ్రవృద్ధం బైన; 
యతి మోదమునఁ బులకితశరీరుఁ
డగుచు మహోత్కంఠ నానందభాష్పముల్; 
జడిగొనఁ బరితోషజలధిఁ గ్రుంకి
భగవత్స్వరూప మై భవగుణగ్రాహక; 
మగుచు మత్సంబంధ మనుకరించి
3-942.1-తే.
సుమహితధ్యానమునఁ బరంజ్యోతి యందు
మనముఁ జాల నియోజించి మహిమఁ దనరు
మోక్షపద మాత్మలోన నపేక్షసేయు
ననఘవర్తనుఁ డైన మహాత్ముఁ డెపుడు.

భావము:
ఈ విధంగా నిష్కళంకజీవనుడైన మహాత్ముడు సర్వేశ్వరునిపై నిలిపిన భావసంపద కలవాడై సమధిక సద్భక్తితో మిక్కిలి మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోషబాష్పాలు పొంగిపొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటిని మించిన వెలుగునందు మనస్సును నిల్పగలుగుతాడు. హృదయ పూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=942

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 53


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-941-సీ.
మునులకు మకరకేతనునకు మోహనం; 
బైన స్వకీయ మాయావిలాస
మున రచితం బైన భ్రూమండలంబును; 
ముని మనఃకుహర సమ్మోదమానుఁ
డగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల; 
వాధర కాంతిచే నరుణ మైన
మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు; 
దంతపంక్తిని మదిఁ దలఁపవలయు
3-941.1-తే.
వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ
సంచితధ్యాన నిర్మల స్థానములుగ
మనములోఁ గను" మని చెప్పి మఱియుఁ బలికె
దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

భావము:
మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి” అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=941

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, June 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 52


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-940-తే.
పూని నతశిరులైనట్టి భూజనముల
శోకబాష్పాంబుజలధి సంశోషకంబు
నత్యుదారతమము హరిహాస మెపుడుఁ
దలఁపఁగావలె నాత్మలోఁ దవిలి వినుము.

భావము:
తలలు వంచి నమస్కరించే దాసుల శోకబాష్ప సముద్రాలను ఎండించి కోరికలు పండించే హరియొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా భావించాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=940

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :