Wednesday, September 5, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 9

10.1-445-ఉ.
చంచువు దీఁటి పక్షములు జల్లున విచ్చి పదంబు లెత్తి కు
ప్పించి నభంబుపై కెగసి, భీషణ ఘోషణ వక్తృడై విజృం
భించి గరుత్సమీరమున భిన్నము లై తరులోలిఁ గూలఁగా
మించి బకాసురుం డొడిసి మ్రింగె సహిష్ణునిఁ జిన్నికృష్ణునిన్.
10.1-446-క.
సంగడి లోకము లన్నియు 
మ్రింగుచుఁ గ్రక్కుచును బయల మెలఁగించుచు ను
ప్పొంగెడు వేడుకకాఁ డటు 
మ్రింగుడుపడె బకునిచేత మీఁ దెఱిఁగి నృపా!


భావము:
ఆ టక్కరి కొంగ ఒక్కసారిగా కృష్ణునివైపు కుప్పించి దూకింది. ముక్కు విదిలించింది. రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకెత్తి ఆకాశంలోకి ఎగిరింది. భయంకరంగా కూతపెడుతూ విజృంభించింది. దాని రెక్కల గాలికి అక్కడి చెట్లు విరిగి పడిపోయాయి. “సరే చూద్దాం” అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసిపెట్టి మ్రింగేశాడు. రాజా! పరీక్షిత్తూ! ఈ బ్రహ్మాండాలు అన్నింటినీ తనలో నుండి పుట్టిస్తూ మళ్లీ మ్రింగి వేస్తూ ఆడిస్తూ ఉండే లీలామయుడు అయిన ఆ కృష్ణుడు అంతా తెలిసి బకాసురుని చేత మ్రింగబడ్డాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, September 4, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 8

10.1-443-ఆ.
ఎల్ల పనులు మాని యేకాగ్రచిత్తుఁ డై
మౌనివృత్తి నితర మతము విడిచి
వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి
చేర్చి బకుఁడు తపసి చెలువుఁ దాల్చె.
10.1-444-వ.
ఇ వ్విధంబున నొదుగు పెట్టుకొని యుండి.

భావము:
ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తంతో అడవిలోని కొలనులో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంక ఏ విధమైన కోరికలు లేవు ఒక్క కృష్ణుడి మీదనే దృష్టి అంతా కేంద్రీకరించింది. కృష్ణుడిని శత్రుత్వంతో చంపజూచే ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది. అలా నీటిలో మాటువేసి ఉన్నాడు ఆ బకాసురుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=443

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 7

10.1-441-క.
అకలంకులు బాలురు గని
రకుటిలదంభోళిహతసితాద్రి శిఖర రూ
పకమున్ హరిహింసారం
భకమున్ బకమున్ విశాల భయదాంబకమున్.
10.1-442-వ.
కని దాని యొడలిపొడవునకు వెఱఁగుపడి చూచుచుండ.


భావము:
అలా తిరిగి వస్తున్నప్పుడు పుణ్యమూర్తులైన ఆ బాలకులు మహా భయంకరమైన ఒక కొంగను చూసారు. పూర్వం ఇంద్రుని వజ్రాయుధం రెక్కలను విరగగొట్టగా క్రిందపడిన పెద్ద కొండశిఖరమా అన్నట్లు ఆకొంగ నిలపడి ఉంది. భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుని చంపడానికి అక్కడ వేచి ఉంది. ఆ గోపకుమారులు ఆ దొంగకొంగ పొడవును నిర్ఘాంతపోయి చూస్తుండగా......


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=441


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, September 2, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 6

10.1-439-క.
వత్సముల పగిది జగముల
వత్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్
వత్సముల మేపు చుండియు
వత్సాసురుఁ జంపె భక్తవత్సలుఁ డధిపా!
10.1-440-వ.
మఱియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు జేసి వచ్చునెడ నందు. 

భావము:
పరీక్షిన్మహారాజా! ఆవు తన దూడను రక్షించు నట్లు ఈ లోకాలు అన్నింటిని వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేసాడు. దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎండకు గురై విపరీతమైన దాహము కలుగగా, అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=439

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 5

10.1-436-వ.
ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలం గూలెను; అప్పుడు
10.1-437-క.
గొంగడు లెగురఁగ వైచుచుఁ
జంగున దాఁటుచును జెలఁగి చప్పట లిడుచుం
బొంగుచుఁ గృష్ణుని బొగడుచు 
ద్రుంగిన రక్కసునిఁ జూచి త్రుళ్ళిరి కొమరుల్.
10.1-438-వ.
ఆ సమయంబున వేలుపులు విరులవానలు గురియించి రివ్విధంబున.


భావము:
అలా అ రాక్షసుడు దెబ్బ తిని నేలకూలాడు ఆ దెబ్బకు అంత పెద్ద చెట్టు సైతం కూలిపోయింది. గోపకుమారులు చచ్చి పడిన రాక్షసుని చూసి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగురవేసారు. ఎగిరి దూకారు. చప్పట్లు కొట్టారు. తృళ్ళింతలతో పొంగిపోయారు. కృష్ణుని బలాన్ని పొగిడారు. అప్పుడు దేవతలు పూలవానలు కురిపించారు. ఇలా....



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, August 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 4

10.1-434-వ.
వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి
10.1-435-చ.
"ఇది యొక మంచిలేగ; వినుఁ డెంతయు నొప్పెడి" నంచు దాని త
త్పదములు తోఁకయున్ బిగియఁబట్టి చెలంగి వెలంగ మ్రానితోఁ
జదియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం
గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వ లీలతోన్.

భావము:
ఆ వత్సాసురుడి విషయం ఎరిగిన కృష్ణుడు బలరాముడుకి చెప్పి. కృష్ణుడు “ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూసారా; ఎంత చక్కగా ఉందో చూడండి” అంటూ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. గభాలున దాని కాళ్ళు తోక పట్టుకుని పైకెత్తి పెద్దపెట్టున వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడి అయిపోయింది. ఈ విధంగా దూడరూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిల కొట్టుకుని చచ్చి పోయాడు. గోపాలకులు ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=435

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలావిలాసం - 3

10.1-432-వ.
అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి.
10.1-433-క.
క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ 
గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం
జూపట్టి భక్త సంగతిఁ 
గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్.


భావము:
ఒకరోజు బలరామకృష్ణులు యమునానదీతీరాన గోపాలకులతో కలసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు. వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ; ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలె సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :