Monday, February 26, 2018

నీలకంఠ వైభవం - 19

8-238-వ.
అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె" నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.


భావము:
ఇలా హాలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.” ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 18

8-236-క.
హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చఁగ
గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ!
8-237-క.
శిక్షింతు హాలహలమును
భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతుఁ బ్రాణి కోట్లను
వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!

భావము:
ఓ మృగాక్షీ! ఉమాదేవీ! ఓ పద్మాక్షి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచిపని. వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=237

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, February 25, 2018

నీలకంఠ వైభవం - 17

8-234-క.
ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రాణుల కిత్తురు సాధులు 
బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా!
8-235-క.
పరహితము జేయు నెవ్వఁడు
పరమ హితుం డగును భూత పంచకమునకుం
బరహితమె పరమ ధర్మము
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!


భావము:
ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. ఓ సౌందర్యరాశీ! పార్వతీదేవీ! ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకూ పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోకారికి ఎక్కడా తిరుగు లేదు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=234


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 16

8-232-వ.
అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.
8-233-క.
కంటే జగముల దుఃఖము; 
వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

భావము:
ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు.“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో. ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్ళలో పుట్టిన ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=233

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, February 24, 2018

నీలకంఠ వైభవం - 15

8-231-క.
నీకంటె నొండెఱుంగము; 
నీకంటెం బరులు గావ నేరరు జగముల్; 
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!


భావము:
సమస్తలోకాల యందూ కీర్తింపబడు స్వామీ! శివా! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=231


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 14

8-230-క.
లంపటము నివారింపను
సంపదఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

భావము:
అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=230

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, February 20, 2018

నీలకంఠ వైభవం - 13

8-229-మత్త.
బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

భావము:
ఓ పరమేశ్వరా! దేవతలూ రాక్షసులూ కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలోనుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. 
'శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా అలా దయాసాగరా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయదొంగలింపన్' (దయ + తొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::