Friday, February 2, 2018

ద్వారక అస్తమయం - 26:

11-121-తే.
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.

భావము:
“నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=121

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, February 1, 2018

ద్వారక అస్తమయం - 25

11-119-క.
దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌
మేరునగధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌.
11-120-వ.
కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె.


భావము:
ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=119


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




ద్వారక అస్తమయం - 24:

11-118-వ.
అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు.

భావము:
ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=118

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, January 23, 2018

ద్వారక అస్తమయం - 23

11-90-క.
జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

భావము:
ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, “లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు” అని స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&padyam=90

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, January 19, 2018

ద్వారక అస్తమయం - 22

11-88-క.
నారాయణు వచనముల క
పారంబగు సమ్మదమున బలములతోడన్‌
దార సుత మిత్ర యుతులై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌.
11-89-వ.
అంత.

భావము:
శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=14&padyam=88

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, January 13, 2018

ద్వారక అస్తమయం - 21

11-87-సీ.
కాక ఘూకంబులు గనకసౌధములలోఁ; 
బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె; 
నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల; 
జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె; 
బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
11-87.1-తే.
గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
నరయ నిందుండ వలవదు యదువులార! 
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.


భావము:
శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Friday, January 12, 2018

ద్వారక అస్తమయం - 20

11-85-తే.
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు
నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు.
11-86-వ.
అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.


భావము:
“సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి.” అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్ధించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. అటుపిమ్మట...



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::