Thursday, August 10, 2017

శ్రీ కృష్ణ జననం - 19

10.1-69-క.
గురుతరముగఁ దన కడుపునఁ
సరసిజగర్భాండభాండ చయములు గల యా
హరి దేవకి కడుపున భూ
భరణార్ధము వృద్ధిఁబొందె బాలార్కు క్రియన్.
10.1-70-వ.
అంత.
10.1-71-సీ.
విమతులమోములు వెలవెలఁ బాఱంగ; 
విమలాస్యమోము వెల్వెలకఁ బాఱె; 
మలయు వైరులకీర్తి మాసి నల్లనగాఁగ; 
నాతిచూచుకములు నల్లనయ్యె; 
దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట; 
లేమ యారున రోమలేఖ మెఱసె; 
నరి మానసముల కాహారవాంఛలు దప్ప; 
వనజాక్షి కాహారవాంఛ దప్పె;
10.1-71.1-తే.
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర
జడత వాటిల్లె శత్రులు జడను పడఁగ; 
మన్ను రుచియయ్యెఁ బగతురు మన్ను చొరఁగ; 
వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁబొంద.

భావము:
ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయసూర్యునిలాగ వృద్దిపొందాడు. అలా భగవదవతారాన్ని దేవకీదేవి గర్భంలో దాచుకున్న ఆ సమయంలో... దేవకీదేవికి గర్భవతులైన స్తీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లపడుతుండగా, దుర్మార్గుల ముఖాలు వెలవెలపోడం మొదలయింది. ఆమె చనుమొనలు నల్లపడుతుండగా, శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తికడుపుపై నూగారు మెరుస్తుండగా, దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా, శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూంటే, శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టికరసే స్థితి వస్తూ ఉన్నట్లు, ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువ అయింది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధిచెందసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=71

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Wednesday, August 9, 2017

శ్రీ కృష్ణ జననం - 18

10.1-66-క.
ఆనకదుందుభి మనమున 
శ్రీనాథుం డంశభాగశిష్టతఁ జొరఁగన్
భానురుచి నతఁడు వెలిఁగెను
గానఁగఁ బట్టయ్యె భూతగణములకు నృపా!
10.1-67-ఉ.
ఆ వసుదేవుఁ డంతఁ దన యం దఖిలాత్మక మాత్మ భూతముం
బావనరేఖయున్ భువనభద్రమునై వెలుఁగొందుచున్న ల
క్ష్మీవిభు తేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో
దేవకి యొప్పెఁ బూర్వయగు దిక్సతి చంద్రునిఁ దాల్చు కైవడిన్.
10.1-68-వ.
అనిన విని తర్వాతి వృత్తాంతం బెట్లయ్యె నని రా జడిగిన శుకుం డిట్లనియె.

భావము:
శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించిడంతో అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకూ జీవులకూకూడా అది చూసి ఆనందం కలిగింది. అలా తనలో విష్ణుతేజం ప్రవేశించిన వసుదేవుడు, ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణుతేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది. అన్నిటికి ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలది. లోకాలు అన్నిటికి క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువు యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో, దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పుదిక్కు అనే స్తీ చంద్రోదయానికి ముందు చంద్రునికాంతితో నిండిపోయినట్లు, దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది.” అలా శుకముని చెప్పగా విన్న పరీక్షుత్తు కుతూహలంతో “ఆ తరువాత ఏమి జరిగింది.” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=8&padyam=67

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 17

10.1-62-తే.
దేవకీదేవికడుపులోఁ దేజరిల్లు
దీప్త గర్భంబు మెల్లనఁ దిగిచి యోగ
నిద్ర రోహిణికడుపున నిలిపి చనియెఁ; 
గడుపు దిగె నంచుఁ బౌరులు గలగఁ బడగ.
10.1-63-వ.
అంత.
10.1-64-ఆ.
బలము మిగులఁ గలుగ "బలభద్రుఁ" డన లోక
రమణుఁ డగుటఁ జేసి "రాముఁ" డనగ
సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున "సం
కర్షణుం" డనంగ ఘనుఁడు సుతుఁడు.
10.1-65-వ.
తదనంతరంబ.

భావము:
యోగనిద్రాదేవి, కాంతులు చిమ్ముతున్న దేవకీదేవి కడుపులో ఉన్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులు బాధపడ్డారు. కొన్ని నెలలకు... రోహిణిగర్భాన చాలా గొప్పవాడు అయిన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అనీ, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అనీ, అందరిని ఆనందింపచేసేవాడు కనుక రాముడు అనీ అతనికి పేర్లు వచ్చాయి. పిమ్మట. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=64

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, August 8, 2017

శ్రీ కృష్ణ జననం - 16

10.1-60-క.
నానావిధ సంపదలకుఁ
దానకమై సర్వకామదాయిని వగు నిన్
మానవులు భక్తిఁ గొలుతురు
కానికలును బలులు నిచ్చి కల్యాణమయీ!
10.1-61-వ.
మఱియు నిన్ను మానవులు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి యీశాన శారద యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదు రయ్యై స్థానంబుల యం”దని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహాప్రసాదం బని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి చయ్యన ని య్యిల కయ్యెడ బాసి వచ్చి. 

భావము:
మాయాదేవీ! కల్యాణమయీ! నీవు అన్నిరకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవనీ, మానవులు నిన్ను భక్తితో పూజిస్తుంటారు. నీకు కానుకలు, బలులు ఇస్తారు. దేశంలో వివిధ ప్రాంతలలో ఉన్న మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పద్నాలుగు పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా” అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్రాదేవి “మహప్రసాద” మని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=61

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, August 7, 2017

శ్రీ కృష్ణ జననం - 15

10.1-58-వ.
అయ్యవసరంబున విశ్వరూపుం డగు హరి దన్ను నమ్మిన యదువులకుఁ గంసునివలన భయంబు గలుగు నని యెఱింగి యోగమాయాదేవి కిట్లనియె.
10.1-59-సీ.
గోపికా జనములు గోపాలకులు నున్న; 
పసులమందకుఁ బొమ్ము భద్ర! నీవు
వసుదేవుభార్యలు వరుసఁ గంసుని చేత; 
నాఁకల బడియుండ నందుఁ జొరక
తలఁగి రోహిణి యను తరళాక్షి నంద గో; 
కుల మందు నున్నది గుణగణాఢ్య
దేవకికడుపున దీపించు శేషాఖ్య; 
మైన నా తేజ మీ వమరఁ బుచ్చి
10.1-59.1-ఆ.
నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ
జొనుపు దేవకికిని సుతుఁడ నగుదు
నంశభాగయుతుఁడనై యశోదకు నందు
పొలఁతి కంత మీద బుట్టె దీవు. 
వసుదేవుని భార్యలు 
వసుదేవుని వంశ వృక్షం 

భావము:
ఆసమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. “భద్రా! మాయాదేవీ! నీవు గోపాలకులు గోపికలు ఉన్న వ్రేపల్లె కువెళ్ళు. వసుదేవుని భార్యలు అందరూ కంసునిచేత బంధీలు అయి జైలులో ఉన్నారు. కానీ, రోహిణి మాత్రం నందుని గోకులంలో తలదాచుకుంది. ఆమె చక్కని గుణగుణాలు కలది. దేవకి కడుపులో ఉన్న శేషుడు అనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆతరువాత నీవు నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టగలవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=59

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

శ్రీ కృష్ణ జననం - 14

10.1-54-మ.
కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుడై పట్టి బ
ద్ధులఁ గావించి హరిం దలంచి వెస తోడ్తో వారు గన్నట్టి పు
త్రులఁ జంపెన్; గురు నుగ్రసేను యదుఁ దద్భోజాంధకాధీశు ని
ర్మలు బట్టెం గడు వాలి యేలెఁ జల మారన్శూరసేనంబులన్.
10.1-55-ఆ.
తల్లిఁ దండ్రి నైనఁ దమ్ము లనన్నల
సఖుల నైన బంధుజనుల నైన 
రాజ్యకాంక్షఁ జేసి రాజులు చంపుదు
రవనిఁ దఱచు జీవితార్థు లగుచు.
10.1-56-వ.
మఱియును బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టి కారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై కంసుండు కదనంబున మదంబు లడంచిన వదనంబులు వంచికొని, సదనంబులు విడిచి యదవలై, యదువులు, పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులుఁ జొచ్చిరి; మచ్చరంబులు విడిచి కొందరు కంసునిం గొలిచి నిలిచి; రంత.
10.1-57-క.
తొడితొడిఁ గంసుడు దేవకి
కొడుకుల నార్వుర వధింప గురుశేషాఖ్యం
బొడవగు హరిరుచి యా సతి
కడుపున నేడవది యైన గర్భం బయ్యెన్.

భావము:
ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగినకోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు. విజృంభించి యదుభోజ అంధకదేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు. రాజులు ఈ లోకంలో రాజ్యకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, తల్లితండ్రులు ఎవరినైనా వారు వదలిపెట్టరు. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మొదలైన రాక్షసులతో కలుపుకున్నవాడై యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయినవాళ్ళు అవమానంతో తమ ఇండ్లు వదలి పదవులు వదలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ మధురలో ఉండిపోయారు. దేవకీదేవి కొడుకులు ఆరుగురిని వెంటవెంటనే కంసుడు వధించాడు. మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు అయిన ఆదిశేషుడనే పేర ప్రసిద్ధుడు దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=57

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, August 6, 2017

శ్రీ కృష్ణ జననం - 13

10.1-52-సీ.
ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని; 
యింటికిఁ జనుదెంచి యేకతమున
"మందలోపలనున్న నందాదులును, వారి; 
భార్యలుఁ బుత్రులు బాంధవులును
దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ; 
డాదిగాఁగల సర్వ యాదవులును, 
సురలుగాని, నిజంబు నరులు గా రని చెప్పి; 
కంసుండ! నీవు రక్కసుడ వనియు
10.1-52.1-ఆ.
దేవమయుడు చక్రి దేవకీదేవికిఁ
బుత్రుఁడై జనించి భూతలంబు
చెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ
జంపు" ననుచుఁ జెప్పి చనియె దివికి.
10.1-53-క.
నారదు మాటలు విని పె
ల్లారాటముఁ బొంది యదువు లనిమిషు లనియున్
నారాయణకరఖడ్గవి
దారితుఁ డగు కాలనేమి దా ననియు మదిన్.

భావము:
ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేశాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాత్రులు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=6&padyam=52

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::