Wednesday, June 21, 2017

దక్ష యాగము - 68:

4-151-వ.
అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."
4-152-చ.
అని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.

టీకా:
అదిగావున = ఆకారణముచేత; యజ్ఞ = యజ్ఞములందలి హవ్యములలో; భాగ = భాగమునకు; అర్హుండవు = అర్హతకలవాడవు; అయిన = అయిన; నీకు = నీకు; సవన = యజ్ఞములందలి హవ్యములలో; భాగంబున్ = భాగమును; సమర్పింపని = ఇవ్వని; కతన = కారణమువలన; నీ = నీ; చేతన్ = చేత; విధ్వస్తంబు = విధ్వంసముచేయబడిన; పరిసమాప్తి = పూర్తి; ఒందని = పొందని; దక్ష = దక్షుని; అధ్వరంబున్ = యజ్ఞమును; మరలన్ = మళ్ళీ; ఉద్దరించి = ఉద్ధరించి; దక్షునిన్ = దక్షుని; పునర్జీవుతున్ = మరలజీవించువానిగ; చేయుము = చేయుము; భగుని = భగుని యొక్క; నేత్రంబులును = కన్నులు; భృగుముని = భృగుముని యొక్క; శ్మశ్రువులును = మీసములు; పూషుని = పూషుని; దంతంబులును = పండ్లు; కృపజేయుము = దయచేయుము; భగ్నాంగులు = విరిగిన అవయవములు కలవారు; అయిన = అయిన; దేవ = దేవతలు; ఋత్విక్ = ఋత్విక్కులు; నికాయంబుల = సమూహముల; కున్ = కు; ఆరోగ్యంబున్ = ఆరోగ్యమును; కావింపుము = కలిగించుము; ఈ = ఈ; మఖ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; యజ్ఞ = యజ్ఞము; పరిపూర్తి = సంపూర్తికి; హేతు = కారణ; భూతంబున్ = భూతము; అయిన = అయిన; భవదీయ = నీ యొక్క; భాగంబున్ = భాగము; అగుంగాక = అవుగాక. అని = అని; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - చతుర (నాలుగు, 4) ఆననుడు (ముఖములు కలవాడు), బ్రహ్మదేవుడు}; వినయంబునన్ = వినయముగ; వేడినన్ = వేడికొనగ; ఇందుమౌళి = శివుడు {ఇందుమౌళి - ఇందు (చంద్రుడు)ని మౌళి (సిగ)లో కలవాడు, శివుడు}; సయ్యన = గబుక్కున; పరితుష్టి = సంతుష్టి; పొంది = పొంది; దరహాసము = చిరునవ్వు; మోమున = ముఖమున; తొంగిలింపన్ = తొంగిచూడగ; ఇట్లు = ఈవిధముగ; అను = అనెను; హరి = విష్ణువు యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; అనయంబున్ = అవశ్యము; పామరులు = పామరులు; ఐన = అయిన; వారు = వారు; చేసిన = చేసిన; అపరాధ = తప్పులు; దోషములు = పాపములు; చిత్తము = మనసు; లోన్ = లో; గణియింపన్ = ఎంచను; ఎన్నడును = ఎప్పుడును.

భావము:
అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.” అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=152

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, June 20, 2017

దక్ష యాగము - 67:

4-150-సీ.
అమర సమస్త దేశము లందు నఖిల కా; 
లములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ
డగు పద్మనాభు మాయా మోహితాత్మకు; 
లై భేదదర్శను లైనవారి
వలనను ద్రోహంబు గలిగిన నైనను; 
నది దైవకృత మని యన్యదుఃఖ
ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు; 
గాని హింసింపఁడు గాన నీవు
4-150.1-తే.
నచ్యుతుని మాయమోహము నందకుంటఁ
జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి
తాత్ములై కర్మవర్తను లయినవారి
వలన ద్రోహంబుగలిగిన వలయుఁ బ్రోవ.

టీకా:
అమరన్ = అమరునట్లు; సమస్త = సమస్తమైన; దేశములు = ప్రదేశములు; అందున్ = లోను; అఖిల = సమస్తమైన; కాలముల్ = కాలముల; అందున్ = లోను; తలంప = తలచిన; దుర్లంఘ్య = దాటరాని; మహిముడు = మహిమకలవాడు; అగు = అయిన; పద్మనాభు = విష్ణువు యొక్క {పద్మనాభుడు - పద్మము నాబి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; మాయా = మాయచేత; మోహిత = మోహింపబడిన; ఆత్మకులు = ఆత్మలు కలవారు; ఐ = అయ్యి; భేద = వైమనస్యముతో; దర్శనులు = చూసెడివారు; ఐన = అయినట్టి; వారి = వారి; వలనను = మూలమున; ద్రోహంబున్ = ద్రోహము; కలిగిన = కలిగినది; ఐనను = అయినప్పటికి; అది = అది; దైవకృతము = దేవునిచేత చేయబడినది; అని = అని; అన్య = ఇతరుల; దుఃఖములు = దుఃఖములు; కున్ = కు; ఓర్వ = ఓర్వ; లేక = లేక; సత్పురుషుండు = మంచివాడు; దయచేయు = వెళ్ళిపోవును; కాని = కాని; హింసింపడు = బాధించడు; కాన = కావున; నీవున్ = నీవు కూడ; అచ్యుతుని = విష్ణుదేవుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}. 
మాయ = మాయచేత; మోహమునన్ = మోహమును; అందకుంట = చెందకుండుట; చేసి = వలన; సర్వజ్ఞుడవు = సర్వముతెలిసినవాడవు; మాయ = మాయ; చేతన్ = చేత; మోహిత = మోహింపబడిన; ఆత్ములు = ఆత్మలు కలవారు; ఐ = అయ్యి; కర్మ = కర్మలందు; వర్తనులు = తిరుగువారు; అయిన = అయిన; వారి = వారి; వలన = వలన; ద్రోహంబున్ = ద్రోహములు; కలిగినన్ = కలిగినప్పటికిని; వలయున్ = వలసినది; ప్రోవన్ = కాపాడగ.

భావము:
సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=150

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, June 19, 2017

దక్ష యాగము - 66:

4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.
4-149-సీ.
"మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల; 
మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ
బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ; 
దగిలి మర్మాత్మ భేదకము లయిన
బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు; 
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ; 
వంటి సత్పురుషుఁ డేవలన నైన
4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత! 
నీలలోహిత! మహితగుణాలవాల! 
లోకపాలనకలిత! గంగాకలాప! 
హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక.

టీకా:
అట్లు = ఆవిధముగ; అగుటన్ = అవుట; చేసి = వలన; తత్ = ఆ; కర్మంబులు = పనులు; ఒకానొకనికి = ఏవరో ఒకనికి; విపర్యాయంబు = వ్యత్యాసము; ఒందుట = కలుగుట; కున్ = కి; కారణంబున్ = హేతువు; ఎయ్యదియో = ఏదో; భవదీయ = నీ యొక్క; రోషంబు = కోపము; హేతువు = కారణము; అని = అని; తలంచితిన్ = అనుకొందము; ఏనిన్ = అంటే; త్వదీయ = నీయొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మములందు; నిహిత = లగ్నమైన; చిత్తులు = మనసులుకలవారు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; భూతంబుల = భూతముల; అందున్ = లోను; నినున్ = నిన్నే; కనుంగొనుచున్ = దర్శిస్తూ; భూతంబులన్ = భూతములను; ఆత్మ = తమ; అందున్ = లో; వేఱు = వేరు; కాన్ = అగునట్లు; చూడక = చూడకుండగ; వర్తించు = ప్రవర్తించు; మహాత్ముల = గొప్పవారి; అదున్ = లో; అజ్ఞులు = జ్ఞానములేనివారు; ఐన = అయిన; వారిన్ = వారి; అందున్ = లో; పోలెన్ = వలె; రోషంబున్ = కోపము; తఱచు = తరచుగా; ఒరయదట = కలుగదట; నీకున్ = నీకు; క్రోధంబున్ = కోపము; కలదే = ఉందా ఏమి; అని = అని. మఱి = మరి; భేద = వైమనస్యమైన; బుద్ధిన్ = బుద్ధితో; కర్మ = కర్మలందు; ప్రవర్తనముల = నడచుటలలో; మద = మదముతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; దుష్ట = దుర్మార్గపు; హృదయులు = హృదయములు కలవారు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; విభవ = వైభవములవలన; అసహ్య = సహించలేకపోవుటచే; భవ = కలిగిన; మనస్ = మానసిక; వ్యాధులన్ = వ్యాధులకు; తగిలి = తగుల్కొని; మర్మా = ప్రాణముల; ఆత్మ = మూలముల; భేదకములు = బద్దలుకొట్టునవి; అయిన = అయినట్టి; బహు = అనేకమైన; దురుక్తుల్ = చెడుమాటల; చేతన్ = తోటి; పరులన్ = ఇతరులను; పీడించుచున్ = బాధిస్తూ; ఉండు = ఉండెడి; మూఢులను = మూర్ఖులను; దైవోపహతులు = మాయోవిమోహితులు; కాన్ = అగనట్లు; తలపోసి = అనుకొని; ఆ = ఆ; కపట = మోసపూరిత; చిత్తులు = మనసులు కలవారి; కున్ = కి; నీ = నీ; వంటి = లాంటి; సత్ = మంచి; పురుషుడు = పురుషుడు; ఏవలనన్ = ఏవిధముగ; ఐన = అయిన. హింస = హింసించుట; కావింపకుండు = చేయకుండును; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిధ్ధ; చరిత = వర్తనకలవాడ; నీలలోహిత = శివ {నీలలోహితుడు - నీలవర్ణము లోహితవర్ణములతో కూడినవాడు, శివుడు}; మహితగుణాలవాల = శివ {మహితగుణాలవాలుడు - మహిత (గొప్ప) గుణాల (గుణముల)అలవాల (పాదువంటివాడు), శివుడు}; లోకపాలనకలిత = శివ {లోకపాలనకలిత - లోకములను పాలించువాడు, శివుడు}; గంగాకలాప = శివ {గంగాకలాప - గంగ (గంగదేవి)ని కలాప (భూషణముగ కలవాడు), శివుడు}; హర = శివ {హరుడు - లయకారుడు, శివుడు}; జగన్నుతచారిత్ర = శివ {జగన్నుతచారిత్ర - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్ర (చరిత్ర కల వాడు), శివుడు}; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:
అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=149

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, June 18, 2017

దక్ష యాగము - 65:

4-147-సీ.
అనఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ; 
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
బలసి మహాజన పరిగృహీతంబులై; 
యఖిల ధర్మార్థదాయకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట; 
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి; 
వటుగాన శుభమూర్తివైన నీవు
4-147.1-తే.
గడఁగి జనముల మంగళకర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
భక్తజనపోష! రాజితఫణివిభూష!

టీకా:
అనఘ = పుణ్యుడ; లోకంబుల = లోకములు; అందున్ = లో; వర్ణ = వర్ణ ధర్మములకు {వర్ణధర్మములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చతుర్వర్ణముల ధర్మములు}; ఆశ్రమ = ఆశ్రమ ధర్మములకు {ఆశ్రమధర్మములు - 1బ్రహ్మచర్య 2గార్హస్త్య 3వానప్రస్థ 4సన్యాస అనెడి చతురాశ్రమముల ధర్మములు}; సేతువులు = చెరువు కట్టలా కాపాడునవి; అనగన్ = అని; ప్రఖ్యాతిని = ప్రసిద్ధిని; ఒంది = పొంది; బలసి = వృద్ధిపొంది; మహా = గొప్ప; జన = వారిచే; పరిగృహీతంబులు = స్వీకరింపబడినవి; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; ధర్మ = ధర్మములు; అర్థ = సంపదలను; దాయకంబులు = ఇచ్చునవి; ఐన = అయిన; వేదంబులను = వేదములను; మఱి = ఇంకా; వృద్ధిన్ = అభివృద్ధిని; ఒందించుట = పొందించుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; నీవ = నీవే; దక్షుని = దక్షుని; నిమిత్తమాత్రునిన్ = కారణమగుట మాత్రమైన వానిగా; చేసి = నియమించి; ఆ = ఆ; ముఖమున్ = పేరుతో; కావించితివి = చేసితివి; అటుగాన = అందుచేత; శుభమూర్తివి = శుభమేస్వరూపము; ఐన = అయిన; నీవు = నీవు; కడగి = పూని. 
జనముల = జనులలో; మంగళ = శుభకరమైన; కర్ములు = పనులుచేసెడివారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; ముక్తిన్ = ముక్తిని; అమంగళ = అశుభములను; ఆచారులకు = చేయువారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; నరకంబున్ = నరకమును; ఒందింతు = పొందింతువు; భూరి = అత్యధికమైన; మహిమన్ = మహిమతో; భక్తజనపోష = శివ {భక్తజనపోషుడు - భక్తులయినవారిని కాపాడువాడ, శివుడు}; రాజితఫణివిభూష = శివ {రాజితఫణివిభూషణుడ - విరాజిల్లుతున్న నాగేశ్వరునితో చక్కగ అలంకరింపబడినవాడు, శివుడు}.

భావము:

ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=147

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, June 17, 2017

దక్ష యాగము - 64:

4-145-తే.
జగములకు నెల్ల యోనిబీజంబు లైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ!
4-146-తే.
సమత నది గాక తావకాంశంబు లైన
శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

టీకా:
జగముల్ = లోకముల; కున్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; యోని = గర్భము; బీజంబులు = విత్తనములు; ఐన = అయిన; శక్తి = శక్తితత్త్వము; శివ = శివత్త్వములకు; కారణుండవు = ప్రాప్తిస్థానమునవు; ఐ = అయ్యి; జగతిన్ = లోకముల; నిర్వికారబ్రహ్మంబవు = నిర్వికారబ్రహ్మవు; అగు = అయ్యెడి; నిన్నున్ = నిన్ను; విశ్వనాథున్ = విశ్వనాథుని; కాన్ = అగునట్లు; ఎఱిగెదన్ = తెలియుదును; నా = నా యొక్క; మనమునన్ = మనసులో.
సమతన్ = చక్కగా; అది = అంతే; కాక = కాకుండగ; తావక = నీయొక్క; అంశంబులు = అంశలు; ఐన = అయిన; శక్తి = శక్తి; శివ = శివ; రూపములన్ = రూపములతో; క్రీడన్ = ఆటలాగ; సలుపు = చేసెడి; తూర్ణనాభి = సాలీడు; గతిన్ = వలె; విశ్వ = జగము యొక్క; జనన = సృష్టి; వినాశ = లయ; వృద్ధిన్ = పోషణలకు; హేతుభూతుండవు = కారణమాత్రుడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; ఈశ = శివుడ; రుద్ర = శివుడ.

భావము:
“ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=146

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

దక్ష యాగము - 63:

4-143-క.
"అనఘ! మహాత్ముం డగు వా
మనుఁ డా కశ్యపునకొగి నమస్కారము చే
సినగతి నజునకు నభివం
దన మొగిఁ గావించె హరుఁడు దద్దయుఁ బ్రీతిన్.
4-144-తే.
అంత రుద్రానువర్తు లైనట్టి సిద్ధ
గణ మహర్షి జనంబులు గని పయోజ
గర్భునకు మ్రొక్కి; రంత నా కమలభవుఁడు
శర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.

టీకా:
అనఘ = పుణ్యుడు; మహాత్ముండు = మహాత్ముడు; అగు = అయిన; వామనుడు = వామనుడు; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; ఒగిన్ = చక్కగ; నమస్కారము = నమస్కారము; చేసిన = చేసిన; గతిన్ = విధముగ; అజున్ = బ్రహ్మదేవునికిన్; అభివందనము = నమస్కారము; ఒగిన్ = చక్కగ; కావించెన్ = చేసెను; హరుడు = శివుడు; దద్ధయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో. అంత = అంతట; రుద్ర = రుద్రుని; అనువర్తులు = అనుచరులు; ఐనట్టి = అయినట్టి; సిద్ధ = సిద్ధుల; గణ = సమూహము; మహర్షి = మహర్షులైన; జనంబులు = వారు; కని = చూసి; పయోజగర్భున్ = బ్రహ్మదేవుని {పయోజగర్భుడు - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కున్ = కి; మ్రొక్కిరి = నమస్కరించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; కమలభవుడు = బ్రహ్మదేవుడు {కమలభవుడు - కమలము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; శర్వున్ = శివుని; కని = చూసి; పల్కె = పలికెను; మందహాసంబు = చిరునవ్వు; తోడన్ = తోటి.

భావము:
పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఇంతో ఇష్టంతో నమస్కారం చేశాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=144

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, June 16, 2017

దక్ష యాగము - 62

4-141-క.
అలఘుని నభవుని యోగీం
ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియ భా
షలు జరుపుచున్న రుద్రుని
సలలిత పన్నగ విభూషు సజ్జనపోషున్.
4-142-క.
కని లోకపాలురును ముని
జనులును సద్భక్తి నతని చరణంబులకున్
వినతు లయి, రప్పు డబ్జా
సనుఁ గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్.

టీకా:
అలఘుని = గొప్పవాని; అభవుని = శివుని; యోగ = యోగులలో; ఇంద్రులు = శ్రేష్టులు; వినుచున్ = వింటూ; ఉండగ = ఉండగా; నారదుని = నారదుని; తోన్ = తోటి; ప్రియ = ప్రియకరమైన; భాషలు = మాటలు; జరుపుతున్ = చేస్తూ; ఉన్న = ఉన్నట్టి; రుద్రునిన్ = శివుని; సలలిత = అందముకలిగిన; పన్నగ = నాగేంద్రునిచే; విభూషు = చక్కగా అలంకరితునిని; సత్ = మంచి; జన = వారిని; పోషున్ = పోషించువానిని. కని = చూసి; లోకపాలురును = లోకపాలకులును; ముని = ముని; జనులును = జనములును; సత్ = మంచి; భక్తిన్ = భక్తితో; అతని = అతని; చరణంబుల = పాదముల; కున్ = కి; వినతులు = నమస్కరించినవారు; అయిరి = అయ్యారు; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; అబ్జాసనుని = బ్రహ్మదేవుని {అబ్జాసనునడు - అబ్జము (పద్మము)న ఆసనుడు (కూర్చున్నవాడు), బ్రహ్మదేవుడు}; కని = చూసి; ఆ = ఆ; అభవుడు = శివుడు; అధిక = మిక్కిలి; సంభ్రమము = సంతోషము; ఒప్పన్ = ఒప్పునట్లు.

భావము:
ఆఢ్యుడు, అభవుడు, నాగభూషణుడు, సజ్జన పోషకుడు, యోగీంద్రులు వింటూ ఉండగా నారదునితో ఇష్టసంభాషణం చేస్తున్నవాడు అయిన ఆ శివుణ్ణి…. లోకపాలకులూ, మునులూ సద్భక్తితో అతని పాదాలకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మను చూచి ఆ శివుడు సంభ్రమంతో…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=142

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::