Friday, January 27, 2017

వామన వైభవం - 98:

8-635-సీ.
రాక్షసోత్తములార! రండు పోరాడక;
కాలంబు గాదిది కలహమునకు;
సర్వభూతములకు సంపదాపదలకు;
బ్రభువైన దైవంబుఁ బరిభవింప
మన మోపుదుమె? తొల్లి మనకు రాజ్యంబును;
సురలకు నాశంబు సొరిది నిచ్చి
విపరీతముగఁ జేయు వేల్పు నే మందము;
మనపాలి భాగ్యంబు మహిమ గాక;
8-635.1-తే.
వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు
మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె?
మనకు నెప్పుడు దైవంబు మంచిదగును
నాఁడు గెలుతుము పగవారి నేఁడు వలదు.

టీకా:
రాక్షస = రాక్షసులలో; ఉత్తములారా = ఉత్తములు; రండు = వెనుకకివచ్చేయండి; పోరాడక = యుద్ధముచేయకుండ; కాలంబు = తగుసమయము; కాదు = కాదు; ఇది = ఇది; కలహమున్ = యుద్ధమున; కున్ = కు; సర్వ = సమస్తమైన; భూతముల్ = జీవుల; కున్ = కు; సంపద = కలిసివచ్చుటకు; ఆపదలకు = దుఃఖముల; కున్ = కు; ప్రభువు = అధిదేవత; ఐన = అయిన; దైవంబున్ = దేవుని; పరిభవింపన్ = ఓడించుటకు; మనము = మనము; ఓపుదుమె = సరిపోగలమా, సరిపోము; తొల్లి = ఇంతకుముందు; మన = మన; కున్ = కు; రాజ్యంబునున్ = రాజ్యమును; సురల్ = దేవతల; కున్ = కు; నాశంబున్ = చేటును; సొరిదిన్ = క్రమముగా; ఇచ్చి = ఇచ్చి; విపరీతముగన్ = దానికి వ్యతిరేకముగా; చేయు = చేసెడి; వేల్పున్ = దేవుని; ఏమందము = ఏమనగలము; మన = మన; పాలి = పాలిటి; భాగ్యంబు = యొక్క; మహిమ = ఫలమును; కాక = తప్పించి. వెఱచి = భయపడి; పలుమాఱు = అనేకసార్లు; పాఱెడి = పారిపోయెడి; విష్ణు = నారాయణుని; భటులు = సైనికులు; మిమ్మున్ = మిమ్ములను; ఎగచుట = ఎదిరించుట; దైవంబు = దేవునియొక్క; మేర = ఏర్పాటు ప్రకారము; కాదె = కాదా అవును; మన = మన; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడు; దైవంబు = అదృష్టము; మంచిది = అనుకూలము; అగును = అగునో; నాడు = అప్పుడు; గెలుతుము = నెగ్గెదము; పగవారి = శత్రువును; నేడున్ = ఈరోజు; వలదు = వద్దు.

భావము:
“ఓ రాక్షసవీరులారా! ఆగండి! యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలకూ దుఃఖాలకూ అధికారియైన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు. దేవతలకు చేటు కలిగించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేసాడు. అటువంటి దేవుని ఏమనగలము. ఇదే మన అదృష్టఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణుసేవకులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవనిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము. ఇప్పుడు వద్దు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=635

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, January 26, 2017

వామన వైభవం - 97:



8-634-వ.
అంత నొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని "పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీ మండలంబు నాక్రమించె కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుఁడు సత్యసంధుండు గావున మాటఁ దిరుగక యిచ్చె నతని వలన నేరంబు లేదు ఈ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకట్టుగా ని జ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుటఁ గర్జం" బని తర్జనంబులును గర్జనంబులునుఁ జేయుచు, వజ్రాయుధాధి మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి కసిమెసంగి ముసరికొని దశదిశలఁ బ్రసరించినఁ జూచి హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండ బలులుఁ దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులం బరలోకంబున కనుచువారలై వారల నెదుర్కొని కదనంబునకున్ బరవసంబు చేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁ దలంచి దనుజ వల్లభుం డిట్లనియె.

టీకా:
అంతన్ = అంతట; ఒయ్యన్ = మెల్లగ; పూర్వ = ఇంతకుముందు; ప్రకారంబునన్ = వలెనె; వామన = వామనుని; ఆకారంబున్ = రూపును; వహించి = ధరించి; ఉన్నన్ = ఉండగా; వామనునిన్ = వామనుని; కని = చూసి; పదత్రయంబు = మూడడుగులు; వ్యాజంబునన్ = నెపంతో; ఇతండు = ఇతడు; సకల = సమస్తమైన; మహీ = భూ; మండలంబున్ = మండలమును; ఆక్రమించెన్ = ఆక్రమించెను; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; రూప = రూపమున; తిరోహితుండు = మారువేషమునున్నవాడు; అగు = అయిన; విష్ణుండు = విష్ణువు; అని = అని; ఎఱుంగక = తెలియక; మన = మనయొక్క; దానవేంద్రుడు = రాక్షసరాజు; సత్యసంధుండు = సత్యవాది; కావున = కనుక; మాట = ఇచ్చినమాట; తిరుగక = వెనుతిరుగక; ఇచ్చెన్ = దానమిచ్చెను; అతని = అతని; వలన = వలన; నేరంబు = తప్పు; లేదు = లేదు; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; అప్రతిహత = తిరుగులేని; తేజస్ = మహిమయొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; సజ్జకట్టుగాన్ = సిద్ధముగ; ఈ = ఈ; జగంబులన్ = లోకములను; పరిగ్రహించి = తీసుకొని; పర్జన్య = ఇంద్రుడు {పర్జన్య}; ఆదుల్ = మున్నగువారల; కిన్ = కు; విసర్జనంబు = ఇచ్చివేయుట; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఈ = ఈ; పాఱునిన్ = బ్రాహ్మణుని; తూఱి = తప్పించుకొని; పాఱనీక = పారిపోనీయక; నిర్జించుట = సంహరించుట; కర్జంబు = చేయవలసినపని; అని = అని; తర్జనంబులునున్ = వేలెత్తిబెదిరించుటలు; గర్జనంబులును = కేకలేయుటలు; చేయుచున్ = చేయుచు; వజ్రాయుధ = ఇంద్రుడు; ఆది = మున్నగు; మరుత్ = దేవతలను {మరుత్తులు - సప్తసప్తసంఖ్యులగు వేల్పులు}; జేతలు = జయించినవారు; అగు = అయిన; హేతి = హేతి; ప్రహేతి = ప్రహేతి; విప్రచిత్తి = విప్రచిత్తి; ముఖ్యులు = మున్నగువారు; అయిన = ఐన; రక్కసులున్ = రాక్షసులు; పెక్కండ్రు = అనేకమంది; ఉక్కుమిగిలి = పరాక్రమించి; యుద్దంబున్ = యుద్దముచేయుట; కున్ = కు; సన్నధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; పరశు = గండ్రగొడ్డలి; పట్టిస = అడ్డకత్తులు; భల్ల = బల్లెములు; ఆది = మున్నగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; కసిమెసంగి = చెలరేగి; ముసురికొని = మూగి; దశదిశలన్ = అన్నివైపులనుండి; ప్రసరించినన్ = వ్యాపించుచుండగ; చూచి = చూచి; హరి = విష్ణుని; పరిచరులు = దూతలు; సునంద = సునందుడు; నంద = నందుడు; జయ = జయుడు; జయంత = జయంతుడు; విజయ = విజయుడు; ప్రబల = ప్రబలుడు; ఉద్బల = ఉద్బలుడు; కుముద = కుముదుడు; కుముదాక్ష = కుముదాక్షుడు; తార్క్ష్యు = తార్క్ష్యుడు; పుష్పదంత = పుష్పదంతుడు; విష్వక్శేన = విష్వక్సేనుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; సాత్వత = సాత్వతుడు; ప్రముఖులు = మొదలైనవారు; అగు = అయిన; దండనాథులు = సేనానాయకులు; అయుత = పదివేల; వేదండ = ఏనుగులతో; సమ = సమానమైన; ఉద్దండ = అధికమైన; బలులు = బలములుకలవారు; తమతమ = వారివారి; యూథంబులన్ = సేనలను; ఆయుధంబుల్ = ఆయుధములు; తోడన్ = తోపాటు; కూర్చుకొని = కూడగొట్టుకొని; దానవ = దానవుల; అనీకంబుల్ = సైన్యములను; అంబర = పై; లోకంబుల్ = లోకముల; కున్ = కు; అనుచు = పంపెడి; వారలు = వారు; ఐ = అయ్యి; వారల్ = వారిని; ఎదుర్కొని = ఎదుర్కొని; కదనంబున్ = యుద్దమున; కున్ = కు; పరవసంబున్ = ఉత్సహించుట; చేయుచున్న = చేయుచుండగా; కనుంగొని = చూసి; శుక్రు = శుక్రుని; శాపంబున్ = శాపమును; తలంచి = గుర్తుచేసుకొని; దనుజ = రాక్షస; వల్లభుండు = చక్రవర్తి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అటు పిమ్మట విష్ణువు మరల తన వామనరూపాన్ని ధరించాడు. హేతి ప్రహేతి విప్రచిత్తీ మొదలైన రాక్షసులు ఇంద్రుడు మొదలగు దేవతలను గెలిచిన వీరులు. అంతటి ఆ రాక్షస వీరులు “ఇతడు మూడడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడినమాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగువారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి.” అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. గండ్రగొడ్డళ్ళూ, అడ్డకత్తులూ, ఈటెలూ మొదలైన ఆయుధాలు ధరించి, చెలరేగి అన్నివైపులా మూగారు. అదంతా చూసి విష్ణుసేవకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన సేనాపతులు పదివేల ఏనుగుల బలంతోచొప్పున గల తమతమ సైన్యాలనూ ఆయుధాలనూ సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=634

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, January 25, 2017

వామన వైభవం - 96:



8-633-క.
అన్నిజగంబులఁ దానై
యున్న జగన్నాథుఁ జూడ నొగి భావింపం
గన్నందక మన మందక
సన్నుతులం జేసి రపుడు సభ్యులు బలియున్.

టీకా:
అన్ని = సర్వ; జగంబులున్ = లోకములు; తాను = తానే; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; జగన్నాథున్ = విష్ణుని; చూడన్ = చూచుటకు; ఒగిన్ = సరిగా; భావింపన్ = భావించుటకు; కన్నందక = కంటికందక; మనమందక = మనసునకందక; సన్నుతులన్ = స్తోత్రములను; చేసిరి = చేసితిరి; అపుడు = అప్పుడు; సభ్యులు = సభలోనివారు; బలియున్ = బలిచక్రవర్తి.

భావము:
అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కానీ, మనసుతో ఊహించడానికి కానీ వీలుకాక బలిచక్రవర్తి, ఆయన సభలోని వారూ చక్కటి స్తోత్రాలు చేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=633

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, January 24, 2017

వామన వైభవం - 95:



8-632-సీ.
యోగమార్గంబున నూహించి బహువిధ;
పుష్పదామంబులఁ బూజ చేసి
దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి;
ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ;
గానిక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవములు జయఘోషములుఁ జేసి;
కరుణాంబునిధి! త్రివిక్రమ! యటంచు
8-632.1-ఆ.
బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి;
రెల్ల దిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని
వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు.

టీకా:
యోగమార్గంబునన్ = దివ్యదృష్టితో; ఊహించి = ఊహించి; బహు = అనేకమైన; విధ = రకములైన; పుష్పదామంబులన్ = పూలమాలలతో; పూజచేసి = పూజించి; దివ్య = మేలైన; గంధంబులున్ = సుగంధద్రవ్యములను; తెచ్చి = తీసుకొచ్చి; సమర్పించి = సమర్పించి; ధూపదీపములన్ = ధూపదీపములను; తోడ్తోడన్ = వెంటవెంటనే; ఇచ్చి = ఇచ్చి; భూరి = అధికముగా; లాజ = పేలాలు; అక్షతలున్ = అక్షింతలు; చల్లి = వేసి; ఫలములన్ = పండ్లు; కానికలు = కానుకలు; ఇచ్చి = సమర్పించి; రాగములన్ = రాగయుక్తముగా; పొగడి = కీర్తించి; శంఖ = శంఖములు; ఆది = మున్నగు; రవములు = శబ్దములు; జయ = జయజయయనెడి; ఘోషములున్ = నాదములు; చేసి = చేసి; కరుణాంబునిధి = దయాసాగరుడా; త్రివిక్రమ = త్రివిక్రముడా; అట = అని; అంచున్ = అనుచు. బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలు = మొదలగు; లోకపాలురు = లోకపాలకులు; కొనియాడిరి = కీర్తించిరి; ఎల్లన్ = అన్ని; దిశలన్ = వైపులను; వనచర = భల్లూకము; ఈశ్వరుండు = రాజు; జాంబవంతుడు = జాంబవంతుడు; అరిగి = వెళ్ళి; చాటె = చాటింపువేసెను; భేరి = బాజాల; ధ్వని = చప్పుడు; వెలయన్ = ప్రసిద్ధముగ; చేసి = చేసి; విష్ణు = విష్ణుమూర్తి; విజయము = జయము జయము; అనుచు = అనుచు.

భావము:
యోగమార్గంలో ఊహించి లోకాలను పాలించే బ్రహ్మదేవుడు మున్నగువారు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేసారు; మేలైన సుగంధ ద్రవ్యాలను, ధూపదీపాలనూ సమర్పించారు; అనంతమైన పేలాలనూ అక్షతలనూ చల్లారు; ఫలాలూ కానుకలూ పెట్టారు; సంతోషంతో కీర్తించారు; శంఖాలు మున్నగువాటిని ఊదారు; జయజయ నాదాలు చేసారు; కరుణాసముద్రా! త్రివిక్రమదేవా! అని కొనియాడారు; భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మటా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=632

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, January 23, 2017

వామన వైభవం - 94:



8-630-మ.
తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభిపంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే
చనముం జేసెఁ గమండలూదకములం జల్లించి; తత్తోయముల్
వినువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్.
8-631-వ.
తత్సమయంబున.

టీకా:
తన = తన యొక్క; పుట్టిల్లు = జన్మస్థానము; ఇదె = ఇదె; పొమ్ము = సుమా; అంచున్ = అనుచు; అజుడు = బ్రహ్మదేవుడు; తత్ = అతని; నాభి = బొడ్డు; పంకేరుహంబున్ = తమ్మిని; నిరీక్షించి = చూసి; నటించి = మిక్కలి సంతోషించి; ఉన్నత = ఉన్నతమైన; పదంబున్ = పాదములను; చూచి = చూసి; తత్ = అతని; పాద = పాదములను; సేచనమున్ = తడపుట; చేసెన్ = చేసెను; కమండలు = కమండలములోని; ఉదకములన్ = నీటిని; చల్లించి = చల్లి; తత్ = ఆ; తోయముల్ = నీరు; వినువీథిన్ = ఆకాశమునందు; ప్రవహించెన్ = పారినవి; దేవనదిన్ = ఆకాశగంగ; నా = అనబడుతు; విశ్వాత్మున్ = విష్ణుమూర్తి; కీర్తి = యశస్సు యనెడి; ప్రభన్ = కాంతులై. తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:
మహవిష్ణువు బొడ్డు తామరను చూసి “నా జన్మస్థానం ఇదే సుమా!” అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహొన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఇంకా ఆ సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=630

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, January 22, 2017

వామన వైభవం - 93:



8-629-సీ.
భవబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ;
గాపురంబులు చేయు ఘనులు రాజు
లా మరీచ్యాదులు, నా సనందాదులు;
నా దివ్యయోగీంద్రు లచట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త;
ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ద;
కర్ములై మఱియును గలుగునట్టి
8-629.1-తే.
వార లెల్లఁ జొచ్చి వచ్చి సర్వాధిపు
నంఘ్రిఁ జూచి మ్రొక్కి రధిక భక్తిఁ
దమ మనంబు లందుఁ దలచు నిధానంబుఁ
గంటి మనుచు నేఁడు మంటి మనుచు.

టీకా:
భవ = సంసార; బంధములన్ = బంధములను; పాసి = వదలి; బ్రహ్మలోకమునన్ = సత్యలోకమునందు; కాపురంబులుచేయు = నివాసము ఉండెడి; ఘనులు = గొప్పవారు; రాజులు = రాజులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; సనంద = సనందుడు; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; దివ్యయోగీంద్రుల్ = దేవర్షులు; అచటన్ = అక్కడ; ఎపుడున్ = ఎప్పుడు; మూర్తిమంతంబులు = రూపుదాల్చినవి; ఐ = అయ్యి; మ్రోయు = మారుమోగెడి; పురాణ = పురాణములు {పురాణము - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18}; తర్క = తర్కశాస్త్రములు {తర్కము - శాస్త్రములు (నియమనగ్రంధములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము}; ఆమ్నాయ = వేదములు; నియమ = నియమము {నియమము - అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము - 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము}; ఇతిహాస = ఇతిహాసములు {ఇతిహాసము - పూర్వము జరిగిన కథ}; ధర్మ = ఉపనిషత్తులు; సంహిత = వేదాంగములు; ఆదులున్ = మొదలగునవాని; గురు = గొప్ప; జ్ఞాన = జ్ఞానము యనెడి; అగ్నిన్ = అగ్నిలో; నిర్దగ్ధ = పూర్తిగా కాలిపోయిన; కర్ములు = కర్మవాసనలుకలవారు; ఐ = అయ్యి; మఱియును = అతిశయించి; కలుగునట్టి = ఉండెడి. వారలు = వారు; ఎల్లన్ = అందరును; చొచ్చి = తోసుకు; వచ్చి = వచ్చి; సర్వాధిపున్ = విష్ణుని; అంఘ్రిన్ = పాదములను; చూచి = దర్శించుకొని; మ్రొక్కిరి = నమస్కరించిరి; అధిక = మిక్కలి; భక్తిన్ = భక్తితోటి; తమ = వారియొక్క; మనంబులన్ = మనసుల; అందున్ = లో; తలచు = భావించెడి; నిధానంబున్ = పెన్నిధిని; కంటిమి = దర్శించితిమి; అనుచున్ = అనుకొనుచు; నేడున్ = ఇవాళ; మంటిమి = ధన్యులమైతిమి; అనుచున్ = అనుకొనుచు.

భావము:
సంసార బంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మ లోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచీ మొదలైన వారూ; సనందుడూ మొదలైన దేనర్షులూ; అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలూ, తర్కశాస్త్రాలూ, వేదాలూ, వేదాంగాలు, ఇతిహాసాలూ, ధర్మశాస్తాలూ; మహజ్ఞానులైన పుణ్యాత్ములూ మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్సించారు. ఆ పాదానికి మిక్కలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో “మేము భావిస్తున్న పెన్నిధీ కనిపించింది. ఈనాడు మేము ధన్యులం అయ్యాము. ” అనుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=629

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, January 21, 2017

వామన వైభవం - 92:

8-627-వ.
తత్సమయంబున.
8-628-ఆ.
జగము లెల్ల దాఁటి చనిన త్రివిక్రము
చరణనఖర చంద్ర చంద్రికలను
బొనుఁగు పడియె సత్యమున బ్రహ్మతేజంబు
దివసకరుని రుచుల దివియ బోలె.
టీకా:తత్ = ఆ; సమయంబునన్ = సమయములో. జగములున్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; దాటి = మించి; చనిన = పోయిన; త్రివిక్రమున్ = త్రివిక్రముని; చరణ = కాలి; నఖర = గోరులనెడి; చంద్ర = చంద్రుని; చంద్రికలను = వెన్నెలలను; పొనుగుపడియెన్ = వెలవెలబోయెను; సత్యమునన్ = సత్యలోకములోని; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తేజంబున్ = తేజస్సు; దివసకరుని = సూర్యుని; రుచులన్ = కాంతులందు; దివియన్ = దివిటీ, దీపము; పోలెన్ = వలె.

భావము:ఆ సమయంలో..... అన్నిలోకాలనూ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్ళకాంతికి సత్యలోకం లోని బ్రహ్మ తేజస్సు సూర్యునిముందు దివిటీ వలె వెలవెల పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=628

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :