Wednesday, November 30, 2016

వామన వైభవం - 40:

8-532-వ.
కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున.
8-533-శా.
శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.




టీకా:

కని = చూసి; దానవేంద్రుని = బలిచక్రవర్తి; హయమేధవాటిన్ = అశ్వమేధయాగశాలను; దఱియంజొచ్చు = చేరవచ్చెడి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; శంభుండో = పరమశివుడో; హరియో = విష్ణుమూర్తియో; పయోజభవుడో = బ్రహ్మదేవుడో {పయోజభవుడు - పయోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; చండాంశుడో = సూర్యభగవానుడో {చండాంశుడు - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు}; వహ్నియో = అగ్నిదేవుడో; దంభ = కపట; ఆకారతన్ = వేషముతో; వచ్చెన్ = వచ్చెను; కాక = కాకపోయినచో; ధరణిన్ = భూమిపైన; ధాత్రీసురుండు = బ్రాహ్మణుడు {ధాత్రీసురుడు - దాత్రీ (భూమిపైని) సురుడు (దేవత), విప్రుడు}; ఎవ్వడు = ఎవరు; ఈ = ఇంత; శుంభత్ = ప్రశస్తముగా; ద్యోతనుడు = ప్రకాశించువాడు; ఈ = ఇంత; మనోజ్ఞ = అందముగానున్న; తనుడు = దేహముగలవాడు; అంచున్ = అనుచు; విస్మయ = ఆశ్చర్యముతో; భ్రాంతులు = భ్రాంతిలోపడినవారు; ఐ = అయ్యి; సంభాషించిరి = మాట్లాడుకొనిరి; బ్రహ్మచారిన్ = వామనుని; కని = చూసి; తత్ = అక్కడి; సభ్యుల్ = సభలోనివారు; రహస్యంబుగన్ = రహస్యముగా.

భావము:

ఆ వైభోగం అంతా చూస్తూ, వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు. అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడారు.




: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, November 29, 2016

వామన వైభవం - 39:

8-531-శా.
చండస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను
ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే
దండాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా
ర్తాండస్యందన ఘోటమున్, బలిమఖాంతర్వేది కావాటమున్.

టీకా:
చండ = తీవ్రమైన; స్పూర్తిన్ = తేజస్సుగలవాడు; వటుండు = బ్రహ్మచారి; బహుధా = పెక్కవిధములుగ; జల్పన్ = వాగెడివారలను {జల్పనము - ఉపయపక్తముకాని పెక్కు మాటలాడుట}; నిశాటంబునున్ = రాక్షసులను; ఉద్దండ = ఉద్దండులైన; ఆహూత = పిలువబడిన; ముని = మునులలో; ఇభ్య = శ్రేష్ఠులవలన; బిభ్యత్ = బెదురుచున్న; అమృతాంధస్ = దేవతల {అమృతాంధస్ - అమృతము ఆహారముగా కలవారు, దేవతలు}; సిద్ధ = సిద్ధుల; కూటంబున్ = సమూహములు కలది; వేదండ = ఏనుగులు; అశ్వ = గుర్రములు; ధ్వజనీ = సేనలు; కవాటమున్ = ద్వారమువద్దనున్నది; మహా = మిక్కలి; ఉద్యత్ = చెలరేగుచున్న; ధూమ = పొగలతో; సంఛన్న = కప్పబడిన; మార్తాండ = సూర్యుని; స్యందన = రథముయొక్క; ఘోటమున్ = గుర్రములుకలది; బలి = బలి యొక్క; మఖ = యజ్ఞముయొక్క; అంతర = అంతర్భాగపు; వేదికావాటమున్ = సభాస్థలమును.

భావము:
బలిచక్రవర్తి యాగసాలను సందర్శించాడు. అలా వామనుడు చేరిన బలి యాగసాలలో రాక్షసులు పెక్కువిధాలైన పెద్దపెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలూ సిద్ధులూ భయపడుతున్నారు. ద్వారానికి ముందువైపు స్థలం ఏనుగులూ గుర్రాలూ సైన్యాలూతో నిండిపోయి ఉంది. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రధం గుఱ్ఱాలు పూర్తిగా కప్పబడి పోతున్నాయి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=531

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, November 28, 2016

వామన వైభవం - 38:

8-529-క.
శర్మద, యమదండక్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.
8-530-వ.
దాటి తత్ప్రవాహంబున కుత్తరతటంబు నందు.

టీకా:
శర్మద = శుభములనిచ్చునది; యమ = యముని; దండ = దండనము యొక్క; క్షత = దెబ్బల నుండి; వర్మదన్ = కవచమువంటిదానిని; అతి = మిక్కిలి; కఠిన = గట్టిదైన, గడుసుదైన; ముక్తి = ముక్తి యనెడి; వనిత = స్త్రీ యొక్క; చేతస్ = మనసు; మర్మదనంబున్ = మర్మమును తెలిపెడిది; అంబు = (తన) నీటితో; నివారిత = నివారించబడు; దుర్మదన్ = దోషములుగలది; నర్మదన్ = నర్మదానదిని; తరించెన్ = దాటెను; త్రోవన్ = దారిలో; వటుడున్ = బ్రహ్మచారి. దాటి = దాటి; తత్ = ఆ; ప్రవాహంబున్ = నదికి; ఉత్తర = ఉత్తరపు; తటంబున్ = గట్టు; అందున్ = అందు.



భావము:
నర్మదానది శుభాలను అందించేది. యమ బాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది; బహు గడుసుది అయిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది; తన నీళ్ళతో దోషాలను నివారించేది. తన దారిలో అలాంటి మహిమాన్వితమైన నర్మదానదిని వామనుడు దాటాడు. మంచి తేజస్సు గల ఆ వామనుడు నర్మదానదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న .. .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=529

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, November 27, 2016

వామన వైభవం - 37:

8-527-క.
సర్వప్రపంచ గురుభరనిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్
ఖర్వుని వ్రేఁగు సహింపక
నుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్.
8-528-వ.
ఇట్లు చనిచని

టీకా:
సర్వ = అఖిల; ప్రపంచ = లోకముల; గురు = బరువును; భర = భరించుట; నిర్వాహకుడు = చేయువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; నెఱిన్ = క్రమముగా; చనుదేర = వెశ్ళుచుండగ; ఖర్వుని = పొట్టివాని; వ్రేగున్ = భారమును; సహింపక = తట్టుకొనలేక; ఉర్వీస్థలి = భూమండలము; క్రుంగెన్ = కుంగిపోయినది; మ్రొగ్గెన్ = వంగిపోయెను; ఉరగేంద్రుండున్ = ఆదిశేషుడు. ఇట్లు = ఈ విధముగ; చనిచని = సాగిపోయి.

భావము:
భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే, అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు. ఆ వామనమూర్తి అలా వెళ్ళి . . . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=527

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Saturday, November 26, 2016

వామన వైభవం - 36:

8-525-క.
ప్రక్షీణ దివిజ వల్లభ
రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం
డా క్షణమున బలి యింటికి
బిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్
8-526-క.
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.



టీకా:
ప్రక్షీణ = మిక్కిలిదీనురాలైన; దివిజవల్లభ = దేవేంద్రుని; రక్షా = కాపాడుటయందు; పరతంత్రుడు = నిమగ్నమైనవాడు; అగుచున్ = అగుచు; రాజీవాక్షుండు = హరి; ఆ = ఆ; క్షణమునన్ = వెంటనే; బలి = బలి యొక్క; ఇంటికిన్ = నివాసమున; కిన్ = కు; బిక్షా = యాచించుటకు; ఆగమనంబున్ = చేరుటను; చేసెన్ = చేసెను; పేదఱికము = పేదరికము; తోను = తోటి.
                         హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలుదేరెను; పర = ఇతరులకు; హిత = మేలుచేయుటయందు; రత = ప్రీతికల; మతి = బుద్ధి; యుతుల = కలవారు; అగు = అయిన; దొరల్ = దొడ్డబుద్ధిగలవారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుటకూడ; ఒడలి = దేహ; తోడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు.

భావము:
వామనుడు బాగా బక్క చిక్కిన దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని, పేదరికాన్ని చూపిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు.
ఔరా! రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=71&Padyam=525

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, November 25, 2016

వామన వైభవం - 35:

8-523-మ.
"కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించె నధ్వరశతం బాభార్గవానుజ్ఞచే; 
బలి వేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! "
8-524-వ.
అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి.

టీకా:
కలరున్ = ఉన్నారు; దాతలున్ = దాతలు; ఇత్తురున్ = ఇచ్చెదరు; ధనములున్ = సంపదలను; కామ్య = కోరిన; అర్థముల్ = సంపదలను; కొంచున్ = తీసుకొనుచు; విప్రులు = బ్రాహ్మణులు; ఏతెంతురు = వస్తుంటారు; కాని = కాని; ఈవిని = దానమిచ్చుగుణమున; బలిన్ = బలిచక్రవర్తితో; పోలన్ = సరిపోలగల; వదాన్యుండు = దాత; లేడు = లేడు; అలఘుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఒనరించెన్ = చేసెను; అధ్వర = యాగములు; శతంబున్ = నూరింటిని (100); ఆ = ఆ; భార్గవ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని పుత్రుడు, శుక్రుడు}; అనుజ్ఞ = అనుమతి; చేన్ = తో; బలిన్ = బలిని; వేడన్ = యాచించినచో; పడయంగవచ్చున్ = పొందవచ్చును; బహు = అనేకమైన; సంపత్ = సంపదలు; లాభముల్ = లభించుటను; వామనా = వామనుడా. అని = అని; తెలియన్ = తెలియునట్లు; చెప్పిన = చెప్పగా; బ్రాహ్మణుల = విప్రుల; వచనంబులన్ = మాటలను; ఆలకించి = విని; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ప్రీతి = మేలు; పుట్టింపన్ = కలిగించుటకై; పయనంబు = ప్రయాణము; ఐ = అయ్యి; లాభవచనంబులు = ఆశీర్వాదములు; కైకొని = తీసుకొని; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులనుండి; వీడ్కొని = పోవననుజ్ఞపొంది; శుభ = శుభకరమైన; ముహూర్తంబునన్ = సమయమునందు; కదిలి = బయలుదేరి.

భావము:
“ఓ! వామనుడా! ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు నూరు చేసాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు.” ఆ విధంగా తెలియపరచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడంకోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహుర్తములో, పెద్దల దీవనలూ తల్లితండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=70&Padyam=523

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, November 24, 2016

వామన వైభవం - 34:

8-520-వ.
ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె.
8-521-క.
వత్తురె విప్రులు? వేఁడఁగ
నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దెత్తురె మీరును సంపద?
లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా.
8-522-వ.
అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; కృతకృత్యుండు = కార్యక్రమముపూర్తిచేసినవాడు; ఐన = అయిన; మాయా = కపట; మాణవకుడు = బాలకుడు; దేశాంతర = ఇతర ప్రాంతముల నుండి; సమాగతులు = వచ్చినవారు; అగు = అయిన; బ్రాహ్మణులన్ = విప్రులను; కొందఱన్ = కొంతమందిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.
                             వత్తురె = వస్తుంటార; విప్రులు = బ్రాహ్మణులు; వేడగన్ = యాచించుటకు; ఇత్తురె = ఇస్తుంటారా; దాతలును = దానములిచ్చువారు; వేడ్కన్ = సంతోషముతో; ఇష్ట = కోరిన; అర్థములన్ = కోరికలను; తెత్తురె = తెచ్చుకొన్నారా; మీరును = మీరుకూడ; సంపదలున్ = సంపదలను; ఈ = ఈ; తెఱంగునన్ = విధమైన; దానవ = రాక్షస; వీరుడు = శూరుడు; ఎవ్వడొ = ఎవరో; చెపుడా = చెప్పండి. అనినన్ = అనగా; అఖిల = అన్ని; దేశీయులు = దేశములవారు; అగు = అయిన; భూసురులు = విప్రులు {భూసురులు - భూమిపైని దేవతలు, బ్రాహ్మణులు}; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:
ఈ విధంగా ఉపనయనం పూర్తై కృతకృత్యుడు అయిన మాయాబ్రహ్మచారి ఇతర దేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు.
                               “దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరుకూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈవిధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే మహా దాత ఎవరో చెప్పండి.” ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన, వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=70&Padyam=520

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :