Friday, October 28, 2016

వామన వైభవము : ప్రేమ యొకింత లేక

8-468-వ.
అని పలికినం బతికి సతి యి ట్లనియె.
పలికెను.
8-469-ఉ.
ప్రేమ యొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా
భీమ బలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా
క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే మని విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే?

టీకా:
          అని = అని; పలికిన = అడిగిన; పతి = భర్త; కిన్ = కి; సతి = భార్య; ఇట్లు = ఇలా;  అనియె = పలికెను  
          ప్రేమ = ప్రేమాభిమానములు; ఒకింత = కొంచముకూడ; లేక = లేకుండగ; దితి = దితి యొక్క; బిడ్డలు = పిల్లలు; బిడ్డలబిడ్డలు = మునుమలు; మహా = అధికమైన; భీమ = భీకరమైన; బలాఢ్యులు = శక్తిమంతులు; ఐ = అయ్యి; తనదు = నా; బిడ్డలన్ = పిల్లలను; అందఱన్ = అందరిని; తోలి = పారదోలి; సాహస = సాహసముతో; ఆక్రమిత = ఆక్రమించిన; వైరులు = శత్రువులు; అయ్యున్ = అయ్యి; అమరావతిన్ = దేవతలరాజధానిని; ఏలుచున్నావారు = పరిపాలించుచున్నారు; నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమిటి; అని = అని; విన్నవింతున్ = చెప్పుకోగలను; హృదయేశ్వర = భర్తా; మేలు = ఏది మంచిదో; తలచి = ఆలోచించి; చూడవే = చూడుము.

భావము:
            ఇలా కుశలం అడిగిన భర్త కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.
            “ఓ నా హృదయానికి ప్రభువు అయిన పతీ! దితి బిడ్డలూ వారి బిడ్డలూ బలవంతులై నా బిడ్డలపై సవితి సోదరులు అన్న ప్రేమ ఏమాత్రం చూపకుండా, పగబూని ఓడించి, పారద్రోలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాదవార్త నీకు ఏమని చెప్పమన్నావు. నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదో ఆలోచిం చూడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, October 27, 2016

వామన వైభవము : అన్నమైనఁ

8-464-ఆ.
అన్నమైనఁ దక్రమైనఁ దోయంబైన
శాకమైన దనకుఁ జరగు కొలఁది
నతిథి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లేనివారు.
8-465-వ.
మఱియు
భావము:
8-466-ఆ.
నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున
కాననంబు శిఖియు నవనిసురులు; 
వారు దనియఁ దనియు వనజాతలోచనుం
డతఁడుఁ దనియ జగము లన్నిఁ దనియు.
8-467-క.
బిడ్డలు వెఱతురె నీకఱ
గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె
యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్.

టీకా:
          అన్నము = భోజనము; ఐనన్ = అయినను; తక్రము = మజ్జిగ; ఐనన్ = అయినను; తోయంబు = మంచినీరు; ఐనన్ = అయినను; శాకము = కాయలు; ఐనన్ = అయినను; తన = తన; కున్ = కు; జరుగు = వీలగునంత; కొలది = వరకు; అతిథి = అతిథులైన; జనుల = వారి; కున్ = కి; అడ్డమాడక = లేదనకుండ; ఇడరు = పెట్టని; ఏని = చో; లేమ = సుందరి {లేమ - లేతయౌవనముగలామె, స్త్రీ}; వారు = అట్టివారు; కలిగి = సంపన్నులైయుండికూడ; లేనివారు = బీదవారే.
          మఱియున్ = ఇంకను.
          నెలత = సుందరి {నెలత - చంద్రునివలెచల్లనియామె, స్త్రీ}; విష్ణున్ = నారాయణున; కును = కు; నిఖిలదేవాత్మున్ = నారాయణున {నిఖిలదేవాత్ముడు - నిఖిల (సమస్తమై) దేవ (దేవతలు) ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు}; కున్ = కు; ఆననంబు = ముఖము; శిఖియున్ = అగ్ని; అవనిసురులు = బ్రాహ్మణులు {అవనిసురులు - అవని (భూమికి) సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; వారు = వారు; తనియన్ = తృప్తిచెందగ; తనియున్ = సంతృప్తులౌదురు; వనజాతలోచనుండు = హరి {వనజాతలోచనుడు - వనజాతము (పద్మము) వంటి లోచనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అతడు = అతను; తనియన్ = సంతృప్తుడైనచో; జగములు = లోకములు; అన్నియు = సమస్తమును; తనియున్ = తృప్తిచెందును.
          బిడ్డలు = పిల్లలు; వెఱతురె = భయభక్తులతోనున్నారా; నీ = నీ; కున్ = కు; అఱగొడ్డంబులు = తిరగబడుట; చేయకన్ = చేయకుండగ; ఎల్ల = అందరు; కోడండ్రును = కోడళ్ళు; మాఱొడ్డారింపక = ప్రతిఘటించకుండగ; నడతురె = వర్తించుతున్నారా; ఎడ్డము = ఇబ్బంది; కాక = లేకుండగ; ఉన్నదె = ఉన్నాదా; మృగేక్షణ = సుందరీ {మృగేక్షణ - మృగ (లేడివంటి) ఈక్షణ (చూపులుగలామె), స్త్రీ}; ఇంటన్ = ఇంటిలో.

భావము:
            అన్నమైనా, మజ్జిగైనా, నీళ్ళైనా చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిధులకు లేదనకుండా పెట్టాలి .అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైనా వారు దరిద్రులే.
            అంతేకాకుండా. . . .
            చంద్రుని వలె చల్లని మగువా! దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి. ఆయన ముఖము అయిన అగ్నినీ, బ్రాహ్మణులనూ సంతోష పెడితే విష్ణువు సంతోషపడతాడు. విష్ణుమూర్తి తృప్తిచెందితే, సమస్తలోకాలూ తృప్తి చెందుతాయి.
            లేడికన్నులతో అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా? నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, October 26, 2016

వామన వైభవము : తెఱవా

8-462-వ.
ఆ మహాత్ముం డిట్లనియె.
8-463-మ.
తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్? 
తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే? 
నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే? 
మఱ లే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ!

టీకా:
          ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          తెఱవా = సుందరీ {తెఱవ - తెఱ (స్వచ్చమైన) వ(ఆమె), స్త్రీ}; విప్రులు = బ్రాహ్మణులు; పూర్ణులే = సంతృప్తులేనా; చెలగునే = చక్కగానున్నవా; దేవ = దేవతలు; ఆర్చన = పూజలు; ఆచారముల్ = ఆచారములు; తఱి = సమయపాలన; తోన్ = తోటి; వేలుతురే = హోమములుచేస్తున్నారా; గృహస్థులు = ఇంటిలోనివారు; సుతుల్ = కొడుకులు; ధర్మ = ధర్మమును; అనుసంధానులే = పాటిస్తున్నారా; నెఱిన్ = పద్దతిప్రకారముగ; అభ్యాగత = అతిథులకు; కోటి = అందరకు; అన్నము = భోజనము; ఇడుదే = పెట్టుచున్నావా; నీరంబునున్ = మంచినీరుకూడ; పోయుదే = ఇస్తున్నావా; మఱ = మరపు; లేక = లేకుండగ; అర్థులన్ = యాచకులను; దాసులను = సేవకులను; సుజనులన్ = సజ్జనులను; మన్నింపుదే = సమ్మానించుచున్నావా; పైదలీ = చిన్నదానా.

భావము:
            కశ్యపుడు తన ఇల్లాలు అదితితో ఇంకా ఇలా అన్నాడు.
            “చిన్నదానా! స్వచ్ఛమైనదానవు నీవు. ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు. బ్రాహ్మణులను ఏ లోటూ లేకుండా ఆదరిస్తున్నావు కదా! దేవాలయాలలో పూజలు సమయానుగుణంగా సాగుతున్నాయా? మన వారు అందరూ ఇక్కడ వేళకు సరిగా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా? నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిధులకు అన్న పానాలు ఇచ్చి ఆదరిస్తున్నావు కదా! మర్చిపోకుండా బిచ్చగాళ్లకు, సేవకులకూ, సజ్జనులకు సత్కారాలు చేస్తున్నావు కదా!


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :