Tuesday, July 26, 2016

క్షీరసాగరమథనం – దంతచతుష్టాహతి

అష్టమ స్కంధము : ఐరావతావిర్భావము

8-258-క.
దంతచతుష్టాహతి శై
లాంతంబులు విఱిగి పడఁగ నవదాత కుభృ
త్కాంతంబగు నైరావణ
దంతావళ ముద్భవించె ధరణీనాథా!
8-259-క.
తడ లేని నడపు వడి గల
యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడఁగై యువతుల మురిపపు
నడకలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్.

టీకా:
            దంత = దంతములు; చతుష్టా = నాలుగింటి; హతిన్ = దెబ్బకి; శైలాంతంబులున్ = కొండశిఖరములు; విఱిగిపడగన్ = కూల్చివేయగలిగి; అవదాత = వెండి (తెల్లని); కుభృత్ = కొండవలె; కాంతంబు = ప్రకాశించునది యగు; ఐరావణ = ఐరావతము యనెడి; దంతావళము = ఏనుగు; ఉద్భవించెన్ = పుట్టెను; ధరణీనాథా = రాజా.
            తడ = తడబాటు; లేని = లేనట్టి; నడపు = నడక; వడి = బిగువు; కల = కలిగిన; ఒడలునున్ = దేహము; పెను = మిక్కలి; నిడుద = పొడవైన; కరము = తొండము; ఉరు = పెద్ధ; కుంభములున్ = కుంభములు; పెడగు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; యువతుల = ప్రాయపుస్త్రీల; మురిపపు = కులుకుల; నడకల్ = నడకల; కున్ = కు; మూలగురువు = ఒజ్జబంతి; అనన్ = అనగా; గజమున్ = ఏనుగు; ఒప్పెన్ = చక్కగానున్నది.

భావము:
            అదిగో పాలసముద్రంలో “ఐరావతం” పుట్టింది. ఆ ఏనుగునకు బలమైన నాలుగు (4) దంతాలు ఉన్నాయి.   వాటితో కొండశిఖరాలను సైతం కూల్చివేయగలదు. ఆ తెల్లని గజరాజు వెండికొండలా మెరిసిపోతోంది.
            ఆ మనోహరమైన ఐరావతము దేహం, తడబాటులేని అందమైన నడకల వేగం కలది. యౌవనంలో ఉన్న యువతులకు కులుకుల నడకలు నేర్పే ఒజ్జబంతిలా ఉంటుంది దాని అందమైన నడక. ఇంకా ఆ ఏనుగునకు చక్కగా అమరిన బాగా పొడవైన తొండమూ, పెద్ద కుంభస్థలముతో ఒప్పి ఉన్నాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, July 25, 2016

క్షీరసాగరమథనం – సచ్చంద్రపాండురంబై

అష్టమ స్కంధము : ఉచ్చైశ్రవావిర్భవము

8-255-క.
సచ్చంద్రపాండురంబై
యుచ్చైశ్రవ మనఁగ దురగ మొగి జనియించెం
బుచ్చి కొనియె బలి దైత్యుం
డిచ్చ గొనం డయ్యె నింద్రుఁ డీశ్వరశిక్షన్.
8-256-క.
ఒఱ పగు నురమును బిఱుఁదును
నెఱిఁ దోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్
కుఱచచెవులుఁ దెలిఁగన్నులు
దఱచగు కందంబుఁ జూడఁ దగు నా హరికిన్.
8-257-వ.
అంత నా పాలకుప్ప యందు.

టీకా:
            సత్ = స్వచ్ఛమైన; చంద్ర = చంద్రుని వంటి; పాండురంబు = తెల్లదనముగలది; ఐ = అయ్యి; ఉచ్ఛ్ర్రైశ్వము = ఉచ్ఛ్ర్రైశ్వము; అనగా = అనబడెడి; తురగము = గుర్రము; ఒగిన్ = ఒకటి; జనియించెన్ = పుట్టెను; పుచ్చుకొనియెన్ = తీసికొనెను; బలి = బలి యనెడి; దైత్యుండు = రాక్షసుడు; ఇచ్చన్ = కోరి; కొనండయ్యన్ = తీసుకొనుటలేదు; ఇంద్రుడు = ఇంద్రుడు; ఈశ్వర = నారాయణుని; శిక్షన్ = ప్రేరణవలన;
            ఒఱపు = దృఢమైన; ఉరమునున్ = రొమ్ము; పిఱుదునున్ = పిరుదులు; నెఱిన్ = నిండైన; తోకయున్ = తోక; ముఖము = ముఖము; సిరియు = శోభ; నిర్మల = స్వచ్ఛమైన; ఖురములున్ = గిట్టలు; కుఱుచ = పొట్టి; చెవులున్ = చెవులు; తెలి = తెల్లని; కన్నులున్ = కళ్ళు; తఱచు = దళసరిదైన; అగు = అయినట్టి; కందంబునున్ = కంఠము; చూడన్ = చూచుటకు; తగున్ = తగిననట్టివి; ఆ = ఆ; హరి = గుర్రమున (ఉచ్ఛైశ్రవమున); కిన్ = కు.
            అంతన్ = అంతట; ఆ = ఆ; పాలకుప్ప = పాలసముద్రము; అందున్ = లో.

భావము:
            స్వచ్ఛమైన చంద్రుడిలా తెలుపు రంగు దేహంతో “ఉచ్ఛైశ్రవము” అనే గుఱ్ఱము పుట్టింది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. భగవంతుని ప్రేరణతో ఇంద్రుడు ఇందుకు కాదన లేదు.
            ఆ ఉచ్ఛైశ్రవము అనే గుఱ్ఱమునకు చిక్కటి రొమ్ము, అందమైన పిరుదులు, చక్కటి తోక, సిరులుట్టిపడే ముఖము, గుండ్రని గిట్టలు, పొట్టి చెవులు, తెల్లటి శుభ్రమైన కళ్ళు, దళసరిగా ఉన్న మెడ చూడ ముచ్చటగా అమరి ఉన్నాయి. 
            అటుపిమ్మట ఆ పాలసముద్రంలో . . . 
            దుష్కర ప్రాస ‘చ్చ’తో ఆ గుఱ్ఱము బహు ఉన్నతము, దుర్లభము అయినది అని సూచిస్తున్నారా. . రెండవ పద్యంలో గుఱ్ఱాన్ని వర్ణిస్తూ “ఱ”కార ప్రాస ప్రయోగం చక్కగా ఉంది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, July 24, 2016

క్షీరసాగరమథనం – అగ్నిహోత్రి యనుచు

8-253-ఆ.
అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
హవులు పెట్టుకొఱకు నవనినాథ!
8-254-వ.
మఱియు నా జలరాశి యందు.

టీకా:
            అగ్నిహోత్రి = అగ్నిహోత్రములకు తగినది; అనుచున్ = అనుచు; ఆ = ఆ; సురభిన్ = కామదేనువును; దేవమునులు = దేవర్షులు; పుచ్చికొనిరి = తీసుకొనిరి; మున్న = ముందుగనే; ఎఱింగి = తెలిసియుండుటచేత; విబుధ = దేవతా; సంఘముల్ = సమూహముల; కున్ = కు; వెరవు = తగినవిధము; తోన్ = ప్రకారముగ; అధ్వర = యాగ; హవులున్ = హవిస్సులను; పెట్టు = సమర్పించుట; కొఱకున్ = కోసము; అవనినాథ = రాజ.
            మఱియున్ = ఇంకను; ఆ = ఆ; జలరాశి = సముద్రము; అందున్ = లో.

భావము:
            కామధేనువు హోమకార్యక్రమాలకు తగినది అని దేవమునులు ముందుగానే గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు
            అలా చిలుకుంతుంటే క్షీరసాగరమునుండి. . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, July 23, 2016

క్షీరసాగరమథనం – తెల్లని మేనును

అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము
8-251-వ.
మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ.
8-252-క.
తెల్లని మేనును నమృతము
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లుగ నర్థుల కోర్కులు
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.

టీకా:
            మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రత్నాకరంబు = సముద్రమును; సుర = దేవతలు; అసురులున్ = రాక్షసులు; త్రచ్చు = చిలికెడి; ఎడన్ = సమయమునందు.
            తెల్లని = తెల్లటి రంగుగల; మేనునున్ = దేహము; అమృతమున్ = పాలను; జిల్లునన్ = జిల్లుమని; జల్లించు = ధారలుగానిచ్చెడి; పొదుగున్ = పొదుగు; శిత = చక్కటి, వాడియైన; శృంగములున్ = కొమ్ములు; పెల్లుగన్ = పుష్కలముగ; అర్థుల = కోరెడివారి; కోర్కులున్ = కోరికలను; వెల్లిగొలుపు = కురిపించెడి; మొదవు = పాడియావు; పాలవెల్లిన్ = పాలసముద్రమునందు; పుట్టెన్ = జనించెను.

భావము:
            హాలాహలభక్షణం పిమ్మట మరల, దేవతలూ రాక్షసులూ సముద్రాన్ని చిలక సాగారు.
            ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగూ, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, July 22, 2016

క్షీరసాగరమథనం – హాలాహల భక్షణ కథ

8-250-క.
హాలాహల భక్షణ కథ
హేలాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్
వ్యాళానల వృశ్చికముల
పాలై చెడ రెట్టిజనులు భయవిరహితులై.

టీకా:
            హాలాహల = హాలాహలమును; భక్షణ = మింగిన; కథన్ = వృత్తాంతమును; హేలాగతిన్ = సంతోషముగా; విన్నన్ = వినినచో; వ్రాయన్ = వ్రాసినచో; ఎలమిన్ = పూనికతో; పఠించినన్ = చదివినచో; వ్యాళ = సర్పముల; అనల = అగ్ని; వృశ్చికములన్ = తేళ్లకు; పాలు = గురి; ఐ = అయ్యి; చెడరు = చెడిపోరు; ఎట్టి = ఎటువంటి; జనులున్ = వారైనను; భయ = భయము; విరహితులు = పూర్తిగాపోయినవారు; ఐ = అయ్యి.

భావము:
            ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్పూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వలన కానీ, తేళ్ళ వలన కానీ, అగ్ని వలన కానీ కష్టాలు కలుగవు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :