Friday, May 27, 2016

క్షీరసాగరమథనం – జననస్థితిలయ

8-162-క.
“జననస్థితిలయ దూరుని
మునినుతు నిర్వాణసుఖ సముద్రుని సుగుణుం
దనుతనునిఁ బృథుల పృథులుని
ననఘాత్ము మహానుభావు నభినందింతున్.
టీకా:
            జనన = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములు; దూరుని = లేనివానిని; ముని = మునులచే; నుతున్ = కీర్తింపబడువానిని; నిర్వాణ = మోక్ష; సుఖ = సౌఖ్యమునకు; సముద్రుని = సముద్రమువంటివానిని; సుగుణున్ = సుగుణములుగలవానిని; తను = సూక్ష్మమైనవానికంటె; తనున్ = సూక్ష్ముని; పృథుల = అతిపెద్దవానికంటెను; పృథులుని = పెద్దవానిని; అనఘాత్మున్ = పుణ్యాత్ముని; మహానుభావున్ = గొప్పవానిని; అభినందింతున్ = స్తుతించెదను.
భావము:
            జనన మరణాది లేనివాడవు, మహర్షులచే కీర్తింపబడువాడవు, మోక్ష సౌఖ్యాన్ని సమృద్ధిగా అందించేవాడవు, సుగుణమయుడవు, సూక్ష్మమైనవాని అన్నిటి కంటే బహు సూక్ష్మమవు, మిన్నలను అన్నింటిని మించిన మిన్నవు, పుణ్యాత్మవు అయిన నిన్ను స్తుతిస్తున్నాము.
८-१६२-क.
“जननस्थितिलय दूरुनि
मुनिनुतु निर्वाणसुख समुद्रुनि सुगुणुं
दनुतनुनिँ बृथुल पृथुलुनि
ननघात्मु महानुभावु नभिनंदिंतुन्.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, May 26, 2016

క్షీరసాగరమథనం – హార కిరీట

8-161-సీ.
హార కిరీట కేయూర కుండల పాద; 
కటక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ; 
చక్ర శరాసన సంయుతంబు
మరకతశ్యామంబు సరసిజ నేత్రంబుఁ; 
గర్ణాభరణ కాంతి గండ యుగముఁ
గలిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు; 
శ్రీ వన మాలికా సేవితంబు
8-161.1-ఆ.
నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు హర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.
టీకా:
          హార = హారములు; కిరీట = కిరీటములు; కేయూర = భుజకీర్తులు; కుండల = చెవికుండలములు; పాదకటక = కాలి అందెలు; కాంచీలత = మొలతాడు; కంకణ = కంకణములు; ఆది = మున్నగునవి; కౌస్తుభ = కౌస్తుభమణితో; ఉపేతంబున్ = కూడినది; కౌమోదకీ = కౌమోదకీ గద; శంఖ = శంఖము; చక్ర = చక్రము; శరాసన = విల్లు; సంయుతంబున్ = కలిగినది; మరకత = మరకతమణివంటి; శ్యామంబున్ = నల్లనిమేనుగలది; సరసిజ = పద్మములవంటి; నేత్రంబున్ = కన్నులుగలది; కర్ణాభరణ = చెవికుండలముల; కాంతిన్ = కాంతులుగల; గండ = చెక్కళ్ళ; యుగమున్ = జంట; కలిత = మనోహరమైన; కాంచన = బంగారు; వర్ణ = రంగుగల; కౌశేయ = పట్టు; వస్త్రంబున్ = బట్టలు; శ్రీవనమాలికా = వైజయంతిమాలచేత; సేవితంబున్ = కొలువబడుచున్నది; ఐ = అయ్యి. 
          మనోహరంబున్ = మనోహరమైనది; ఐ = అయ్యి; దివ్య = గొప్ప; సౌభాగ్యము = సౌభాగ్యవంతము; ఐన = అయినట్టి; అతని = అతని; రూపు = ఆకృతి; హర్షము = సంతోషము; ఎసగన్ = అతిశయించగా; చూచి = చూసి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; హరుడు = పరమశివుడు; సురలునున్ = దేవతలు; తానునున్ = తను; పొంగి = సంతోషిముతో పొంగిపోయి; నమ్రుడు = నమ్రతచూపువాడు; అగుచున్ = అగుచు; పొగడన్ = స్తుతించుట; తొడగెన్ = ప్రారంభించెను.
భావము:
            భగవంతుడు శ్రీహరి హారాలూ, కిరీటాలూ, భుజకూర్తులూ, కుండలాలూ, కాలి అందెలూ, మొలనూలూ, కంకణాలూ, కౌస్తుభరత్నమూ, కొమోదకీ గదా, శంఖమూ, చక్రమూ, విల్లూ ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేనూ, కాంతులీనే పద్మాల వంటి కళ్ళూ, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడూ, శివుడూ, దేవతలూ సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి ఇలా స్తోత్రం చేయటం మొదలెట్టాడు.
८-१६१-सी.
हार किरीट केयूर कुंडल पाद;
कटक कांचीलता कंकणादि
कौस्तुभोपतंबुँ गौमोदकी शंख;
चक्र शरासन संयुतंबु
मरकतश्यामंबु सरसिज नेत्रंबुँ;
गर्णाभरण कांति गंड युगमुँ
गलित कांचनवर्ण कौशेयवस्त्रंबु;
श्री वन मालिका सेवितंबु
८-१६१.१-आ.
नै मनोहरंबुनै दिव्यसौभाग्य
मैन यतनि रूपु हर्ष मेसँग
जूचि ब्रह्म हरुँडु सुरलुनु दानुनु
बोंगि नम्रुँ डगुचुँ बोगडँ दोडँगे.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, May 25, 2016

క్షీరసాగరమథనం - ఒకవేయర్కులు


విశ్వగర్భుని ఆవిర్భావము
8-158-వ.
అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠి యందుఁ గరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె.
8-159-మ.
ఒకవేయర్కులు గూడిగట్టి కదుపై యుద్యత్ప్రభాభూతితో
నొకరూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్
వికలాలోకనులై; విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్.
8-160-వ.
అప్పుడు.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగా; దేవ = దేవతల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అనేక = వివిధ; విధంబులన్ = రకములుగా; కీర్తించుచున్ = స్తుతించుచు; ఉన్న = ఉన్నట్టి; పరమేష్ఠి = బ్రహ్మదేవుని {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున యుండువాడు, బ్రహ్మ}; అందున్ = ఎడల; కరుణించి = దయకలిగి; దయా = కృపజేయుటయందు; గరిష్ఠుండు = గొప్పవాడు; అగు = అయిన; విశ్వగర్భుండు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వములు తన గర్భమునగలవాడు, విష్ణువు}; ఆవిర్భవించె = ప్రత్యక్షమయ్యెను;
          ఒకవేయు = ఒకవెయ్యి (1000); అర్కులున్ = సూర్యులు; కూడికట్టి = కలిసిపేసి; కదుపు = ముద్ద; ఐ = అయ్యి; ఉద్యత్ = పెంచబడిన; ప్రభా = కాంతులనెడి; భూతి = సంపదల; తోన్ = తోటి; ఒకరూపు = ఒకటిగాపోతబోసినది; ఐ = అయ్యి; చనుదెంచు = వస్తున్న; మాడ్కిన్ = విధముగా; హరి = నారాయణుడు; తాన్ = తను; ఒప్పారెన్ = ప్రకాశించెను; ఆ = ఆ; వేలుపుల్ = దేవతలు; వికల = చెదిరిన; ఆలోకనులు = చూపులు గలవారు; ఐ = అయ్యి; విషణ్ణ = విషాదముపొందిన; మతులు = మనస్సులు గలవారు; ఐ = అయ్యి; విభ్రాంతులు = తికమక నొందినవారు; ఐ = అయ్యి; మ్రోలన్ = ఎదురుగా నున్నది; కానక = చూడలేక; శంకించిరి = అనుమానపడిరి; కొంత = కొంచము; ప్రొద్దు = సమయము; విభున్ = ప్రభువును; కానన్ = చూచుట; పోలునే = సాధ్యమా కాదు; వారి = వారి; కిన్ = కి.
          అప్పుడు = అప్పుడు.
భావము:
            దేవతా సమూహాలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశాడు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు.
            అలా ప్రత్యక్షం అయిన మహావిష్ణువు రూపు వెయ్యి సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరి పోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్యచకితులు అయ్యారు. వారికి ప్రభువును చూడటం సాధ్యం కాదు కదా!
            ఆ సమయంలో విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు అంటే.
८-१५८-व.
अनि यिट्लु देवगणसमेतुंडै यनेक विधंबुलं गीर्तिंचुचु नुन्न परमेष्ठि यंदुँ गरुणिंचि दयागरिष्ठुंडगु विश्वगर्भुं डाविर्भविंचे.
८-१५९-म.
ओकवेयर्कुलु गूडिगट्टि कदुपै युद्यत्प्रभाभूतितो
नोकरूपै चनुदेंचुमाड्कि हरि दा नोप्पारे; ना वेलुपुल्
विकलालोकनुलै; विषण्णमतुलै; विभ्रांतुलै म्रोलँ गा
नक शंकिंचिरि कोंत प्रोद्दु; विभुँ गानं बोलुने वारिकिन्.
८-१६०-व.
अप्पुडु.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, May 24, 2016

క్షీరసాగరమథనం - మఱియు నెవ్వని బలంబున

8-155-వ.
మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బిత్రుదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబునును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక" యని మఱియును.
టీకా:
          మఱియున్ = అంతేకాక; ఎవ్వని = ఎవని; బలంబునన్ = బలమువలన; మహేంద్రుండును = దేవేంద్రుడు; ప్రసాదంబునన్ = అనుగ్రహము వలన; దేవతలును = దేవతలును; కోపంబునన్ = రౌద్రము వలన; రుద్రుండును = పరమశివుడును; పౌరుషంబునన్ = పౌరుషమువలన; విరించియున్ = బ్రహ్మదేవుడు; ఇంద్రియంబుల = ఇంద్రియముల; వలన = వలన; వేదంబులును = వేదములు; మునులును = ఋషులు; మేఢ్రంబునన్ = పురుషావయవమువలన; ప్రజాపతియును = ప్రజాపతి; వక్షంబునన్ = వక్షస్థలమున; లక్ష్మియున్ = లక్ష్మీదేవి; ఛాయ = నీడ; వలనన్ = వలన; పిత్రుదేవతలును = పిత్రుదేవతలు; స్తనంబుల = రొమ్ముల; వలన = వలన; ధర్మంబును = ధర్మము; పృష్టంబు = వీపు; వలన = వలన; అధర్మంబును = అధర్మము; శిరంబున్ = తల; వలన = వలన; నాకంబును = స్వర్గమును; విహాసంబు = నవ్వు; వలన = వలన; అప్సరస్ = అప్సరసల; జనంబులును = సమూహము; ముఖంబు = వదనము; వలన = వలన; విప్రులును = బ్రాహ్మణులు; గుహ్యంబునన్ = యోనివలన; బ్రహ్మంబును = బ్రహ్మదేవుడు; భుజంబుల = భుజముల; వలన = వలన; రాజులును = రాజులు; బలంబును = సైన్యములు; ఊరువుల = తొడల; వలన = వలన; వైశ్యులును = వ్యాపారులు; నైపుణ్యంబును = నేర్పరితనము; పదంబుల = పాదముల; వలన = వలన; శూద్రులును = శూద్రులు; అవేదంబును = వేదములుకానిజ్ఞానము; అధరంబునన్ = క్రిందిపెదవివలన; లోభంబును = లోభము; ఉపరిరదచ్ఛదనంబు = పైపెదవి; వలన = వలన; ప్రీతియున్ = ఇష్టము; నాసా = ముక్కు; పుటంబునన్ = పుటముల; వలన = వలన; ద్యుతియున్ = కాంతి; స్పర్శంబునన్ = స్పర్శవలన; కామంబును = కామము; భ్రూయుగళంబునన్ = కనుబొమలవలన; యమంబును = యముడు; పక్షంబునన్ = పక్కభాగమువలన; కాలంబును = కాలము; సంభవించెన్ = కలిగినవో; ఎవ్వని = ఎవని; యోగమాయ = యోగమాయచే; విహితంబులు = విధింపబడినో; ద్రవ్య = ద్రవ్యము; వయస్ = వయస్సు; గుణ = గుణములయొక్క; విశేషంబులున్ = విశేషములు; చతుర్విధ = నాలుగువిధములైన {చతుర్విధభూతసర్గము - 1అచరము 2భూచరము 3జలచరము 4గగనచరములు ? చతుర్విధవర్గము - 1ధర్మము 2అర్థము 3కామము 4మోక్షము}; సర్గంబున్ = భూతసర్గము; ఎవ్వని = ఎవని; ఆత్మ = స్వంత; తంత్రంబున్ = తంత్రముననుసరించునది; ఎవ్వని = ఎవని; వలనన్ = వలన; సిద్ధించి = ఏర్పడుచు; లోకంబులును = లోకములు; లోకపాలురు = లోకపాలురు; బ్రతుకుచుందురు = జీవించుతుంటారు; పెరుగుచుందురు = వృద్ధిచెందుచుతుంటారు; దివిజుల్ = దేవతలక; కున్ = కు; ఆయువున్ = ఆయుస్సు; అంధంబున్ = ఆహారము; బలంబున్ = బలము; ఐ = అయ్యి; జగంబుల్ = భువనముల; కున్ = కు; ఈశుండు = ప్రభువు; ఐ = అయ్యి; ప్రజల్ = లోకుల; కున్ = కు; ప్రజనుండు = సృష్టించెడివాడు; ఐ = అయ్యి; ప్రజ = లోకులను; అవన = కాపాడెడి; క్రియాకాండ = కర్మకాండ; నిమిత్త = కోసమై; సంభవుండు = ఏర్పడినవాడు; అగు = అయిన; జాతవేదుండు = అగ్నివి {జాతవేదుండు - పుట్టిన ప్రతిదేహమునందు యుండువాడు, అగ్నిదేవుడు}; ఐ = అయ్యి; అంత = అంతరంగమనెడి; సముద్రంబునన్ = సముద్రమునందు; ధాతువులన్ = సప్తధాతువులను {సప్తధాతువులు - 1రోమ 2త్వక్ 3మాంస 4అస్థి 5స్నాయు 6మజ్జ 7ప్రాణములు}; ప్రపంచించుచున్ = విస్తరింపజేయుచు; బ్రహ్మ = పరబ్రహ్మ; మయుండు = స్వరూపుడు; ఐ = అయ్యి; ముక్తి = మోక్షసాధనకు; కిన్ = కు; ద్వారంబు = మార్గము; ఐ = అయ్యి; అమృత = బ్రతుకు; మృత్యు = చావుల; స్వరూపుండు = స్వరూపమైనవాడు; ఐ = అయ్యి; చర = చరించగల; అచర = చరించలేని; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; ప్రాణంబున్ = జీవము; ఐ = అయ్యి; ఓజస్ = తేజము; అహస్ = అహంకారము; బల = సామర్థ్యము; వాయుః = వాయువులు నిండిన; రూపంబులు = రూపములుగలవి; ఐన = అయినట్టి; ప్రాణ = ప్రాణుల; ఇంద్రియ = ఇంద్రియములు; ఆత్మ = ఆత్మలు; శరీర = శరీరములు; నికేతనుండు = నివాసముగాగలవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యధికమైన; మహా = గొప్ప; భూతి = శక్తి; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = మహాప్రభువు; మా = మా; కున్ = కు; ప్రసన్నుండు = దయచూపువాడు; అగుంగాక = అగునుగాక; అని = అని; మఱియును = ఇంకను.
భావము:
            నీ బలం నుండి దేవేంద్రుడూ; నీ అనుగ్రహం నుండి దేవతలూ; నీ ఆగ్రహం నుండి రుద్రుడూ; నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడూ; నీ ఇంద్రియాల నుండి వేదాలూ, మునులూ; నీ పురుషాంగం నుండి ప్రజాపతీ; నీ రొమ్ములనుండి లక్ష్మీదేవీ; నీ నీడ నుండి ధర్మమూ; నీ వీపు నుండి అధర్మమూ; నీ తల నుండి స్వర్గమూ; నీ నవ్వు నుండి అప్సరసలూ; నీ ముఖం నుండి బ్రాహ్మణులూ, బ్రహ్మమూ; నీ భుజాల నుండి రాజులూ. బలమూ; నీ తొడలు నుండి వైశ్యులూ, నేర్పరితనమూ; నీ పాదాల నుండి శూద్రులూ, శుశ్రూషా; నీ క్రింద పెదవి నుండి లోభమూ; పై పెదవి నుండి ప్రేమా; నీ ముక్కుపుటాల నుండి కాంతీ; నీ స్పర్శ నుండి కామమూ; నీ కనుబొమలు నుండి యముడూ; నీ ప్రక్కభాగం నుండి కాలమూ సంభవించాయి; నీ యోగమాయ వలన ద్రవ్యమూ, వయస్సూ, కర్మమూ, గుణవిశేషాలూ విధింపబడ్డాయి; నీ ఆత్మతంత్రం నుండి ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ కలిగాయి; నీ వలన లోకాలూ, లోకపాలకులూ ఏర్పడి అభివృద్ధి పొందుతారు; దేవతలకు ఆయుస్సూ, ఆహారమూ, బలమూ నీవే; పర్వతాలపై అధికారి నీవే; ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే; సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే; మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మం నీవే; చావు బ్రతుకులు నీ రూపాలే; ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే; తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు; పరమశక్తివైన మహాప్రభూ! మాపై దయచూపు.
८-१५५-व.
मर्रियु नेव्वनि बलंबुन महेंद्रुंडुनु; ब्रसादंबुन देवतलुनु; गोपंबुन रुद्रुंडुनु; बौरुषंबुन विरिंचियु; निंद्रियंबुलवलन वेदंबुलुनु मुनुलुनु; मेढ्रंबुनँ ब्रजापतियुनु; वक्षंबुन लक्ष्मियु; छायवलनँ बित्रुदेवतलुनु; स्तनंबुलवलन धर्मंबुनु; बृष्ठंबुवलन नधर्मंबुनु; शिरंबुवलन नाकंबुनु; विहासंबुवलन नप्सरोजनंबुलुनु; मुखंबुवलन विप्रुलुनु; गुह्यंबुन ब्रह्मंबुनु; भुजंबुलवलन राजुलुनु बलंबुनु; नूरुवुलवलन वैश्युलुनु नैपुण्यंबुनु; बदंबुलवलन शूद्रुलुनु नवेदंबुनु; नधरंबुन लोभंबुनुनु; परिरदच्छदनंबुवलन ब्रीतियु; नासापुटंबुवलन द्युतियु; स्पर्शंबुनँ गामंबुनु; भ्रूयुगळंबुन यमंबुनु; बक्षंबुनँ गालंबुनु संभविंचे; नेव्वनि योग मायाविहितंबुलु द्रव्यवयः कर्मगुण विशेषंबुलु; चतुर्विध सर्गं बेव्वनि यात्मतंत्रं; बेव्वनिवलन सिद्धिंचि लोकंबुलुनु लोकपालुरुनु ब्रतुकुचुंदुरु पेरुगुचुंदुरु; दिविजुलकु नायुवु नंधंबु बलंबुनै जगंबुलकु नीशुंडै प्रजलकुँ ब्रजनुंडै प्रजावन क्रियाकांड निमित्त संभवुंडगु जातवेदुं डै; यंतस्समुद्रंबुन धातुसंघातंबुलं ब्रपचिंचुचु ब्रह्ममयुंडै; मुक्तिकि द्वारंबै; यमृत मृत्यु स्वरूपुंडै; चराचरप्राणुलकुँ ब्राणंबै; योजस्सहोबल वायुरूपंबुलैन प्राणेंद्रि यात्म शरीर निकेतनुंडै परम महाभूति यगु नप्परमेश्वरुंडु माकुं ब्रसन्नुंडगुं गाक" यनि मर्रियुनु.

 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :