Friday, March 25, 2016

దేవతల నరసింహ స్తుతి - దుర్ణయుని

7-321-వ.
మనువు లిట్లనిరి.
7-322-క.
దుర్ణయుని దైత్యుఁ బొరిగొని
వర్ణాశ్రమ ధర్మసేతు వర్గము మరలం
బూర్ణము చేసితి వే మని
వర్ణింతుము? కొలిచి బ్రతుకువారము దేవా!
టీకా:
          మనువులు = మనువులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          దుర్ణయుని = దుర్నీతిగలవానిని; దైత్యున్ = రాక్షసుని; పొరిగొని = చంపి; వర్ణ = వర్ణముల యొక్క ధర్మముల; ఆశ్రమధర్మ = ఆశ్రమధర్మముల; సేతు = కట్టుబాట్ల; వర్గమున్ = సమూహమును; మరలన్ = తిరిగి; పూర్ణము = పరిపూర్ణము; చేసితివి = చేసితివి; ఏమని = ఏమని; వర్ణింతుము = కీర్తింతుము; కొలిచి = సేవించి; బ్రతుకు = జీవించెడి; వారము = వారిమి; దేవా = నరసింహా.
భావము:
            మనువులు ఇలా మనవి చేసుకున్నారు.
            “ఓ దేవా! ఈ దుష్టుని వలన వర్ణాశ్రమ ధర్మాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి తిరిగి ధర్మం సంస్థాపన కావించావు. నిన్ను ఏమని కీర్తించ గలము? ఎలా స్తుతించ గలము? నీ సేవే మాకు జీవనాధారం ప్రభూ!”
७-३२१-व.
मनुवु लिट्लनिरि.
७-३२२-क.
दुर्णयुनि दैत्युँ बोरिगोनि
वर्णाश्रम धर्मसेतु वर्गमु मरलं
बूर्णमु चेसिति वे मनि
वर्णिंतुमु? कोलिचि ब्रतुकुवारमु देवा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, March 24, 2016

దేవతల నరసింహ స్తుతి - రత్నములను

7-319-వ.
భుజంగు లిట్లనిరి.
7-320-క.
రత్నములను మత్కాంతా
రత్నంబుల బుచ్చికొన్న రక్కసు నురమున్
యత్నమున వ్రచ్చి వైచితి; 
పత్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!
టీకా:
          భుజంగులు = సర్పముల; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          రత్నములను = రత్నములను; మత్ = మా యొక్క; కాంతా = స్త్రీ, భార్యా; రత్నంబులన్ = రత్నములను; పుచ్చికొన్న = తీసుకొన్న; రక్కసున్ = రాక్షసుని; ఉరమున్ = వక్షస్థలమును; యత్నమునన్ = పూని; వ్రచ్చివైచితివి = చీల్చివేసితివి; పత్నులున్ = భార్యలను; రత్నములున్ = మణులు; కలిగి = పొంది; బ్రతికితిమి = బతికిపోతిమి; ఈశా = నరసింహా.
భావము:
            నాగేంద్రులు ఇలా నతులు పలికారు.
             “ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.”
७-३१९-व.
भुजंगु लिट्लनिरि.
७-३२०-क.
रत्नमुलनु मत्कांता
रत्नंबुल बुच्चिकोन्न रक्कसु नुरमुन्
यत्नमुन व्रच्चि वैचिति;
पत्नुलु रत्नमुलुँ गलिगि ब्रतिकिति मीशा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, March 23, 2016

దేవతల నరసింహ స్తుతి - దానవుని

7-317-వ.
విద్యాధరు లిట్లనిరి.
7-318-క.
దానవునిఁ జంపి యంత
ర్ధానాదికవిద్య లెల్ల దయతో మరలం
గా నిచ్చితివి విచిత్రము
నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహా!
టీకా:
          విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          దానవునిన్ = రాక్షసుని; చంపి = సంహరించి; అంతర్థాన = మాయమగుట; ఆది = మొదలగు; విద్యలు = విద్యలు; ఎల్లన్ = అన్నిటిని; దయ = కరుణ; తోన్ = తోటి; మరలంగన్ = మళ్ళీ; ఇచ్చితివి = ఇచ్చతివి; విచిత్రము = అద్భుతము; నీ = నీ యొక్క; నిరుపమ = సాటిలేని; వైభవంబు = ప్రభావము; నిజము = సత్యము; నృసింహా = నరసింహుడా.
భావము:
            విద్యాధరులు ఇలా వినుతులు పలికారు.
             “ఓ నరకేసరీ! నీ వైభవం అతులితమూ, అసాధారణమూ. నీ చారిత్రము బహు విచిత్రము. హిరణ్యకశిప రాక్షసుడిని చంపి, అంతర్ధానం మున్నగు మా శక్తులు అన్నీ దయతో మాకు వెనక్కు ఇచ్చావు.”
७-३१७-व.
विद्याधरु लिट्लनिरि.
७-३१८-क.
दानवुनिँ जंपि यंत
र्धानादिकविद्य लेल्ल दयतो मरलं
गा निच्चितिवि विचित्रमु
नी निरुपम वैभवंबु निजमु नृसिंहा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, March 22, 2016

దేవతల నరసింహ స్తుతి - క్రుద్ధుండై

7-315-వ.
సిద్ధు లిట్లనిరి.
7-316-క.
క్రుద్ధుండై యణిమాదిక
సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి; మహా
యోద్ధవు నీ కృప మాకును
సిద్ధులు మరలంగఁ గలిగె శ్రీనరసింహా!
టీకా:
          సిద్ధులు = సిద్ధులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          క్రుద్ధుండు = కోపముగలవాడు; ఐ = అయ్యి; అణిమాదిక = అణిమ మొదలైన; సిద్ధులున్ = అష్టసిద్ధులను {అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రా కామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; కైకొనిన = తీసుకొన్న; దైత్యున్ = రాక్షసుని; చీరితివి = చంపితివి; మహా = గొప్ప; యోద్ధవున్ = యోధుడవు; నీ = నీ యొక్క; కృపన్ = దయవలన; మా = మా; కును = కు; సిద్ధులు = అష్టసిద్ధులు; మరలంగన్ = మళ్ళీ; కలిగెన్ = కలగినవి; శ్రీ = మహనీయమైన; నరసింహా = నరసింహుడా.
భావము:
            సిద్దులు నరసింహుని ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు.
            “శ్రీ నరసింహావతారా! నీవు యోధానుయోధుడవు. ఆగ్రహోదగ్రుడై హిరణ్యకశిపుడు మా అణిమ, మహిమ, గరిమ మున్నగు సిద్ధులు అన్నింటిని లాక్కున్నాడు. ఆ రాక్షసుడిని చీల్చిచెండాడి సంహరించావు. మేలయ్యను. నీ దయ వలన మరల నా సిద్ధులు మాకు లభించాయి.”
७-३१५-व.
सिद्धु लिट्लनिरि.
७-३१६-क.
क्रुद्धुंडै यणिमादिक
सिद्धुलु गैकोनिन दैत्युँ जीरितिवि; महा
योद्धवु नी कृप माकुनु
सिद्धुलु मरलंगँ गलिगे श्रीनरसिंहा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, March 21, 2016

దేవతల నరసింహ స్తుతి - చండక్రోధముతోడ

7-313-వ.
పిత్రుదేవత లిట్లనిరి.
7-314-శా.
చండక్రోధముతోడ దైత్యుఁడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్
పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు
ద్దండత్వంబునఁ దాన కైకొను మహోదగ్రుండు; వీఁ డిక్కడన్
ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్ గావింతు మాత్మేశ్వరా!
టీకా:
          పిత్రుదేవతలు = పిత్రుదేవతలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          చండ = తీవ్రమైన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; దైత్యుడు = రాక్షసుడు; వడిన్ = వేగముగ; శ్రాద్ధంబులన్ = ఆబ్దికములాది పితృకర్మలలో; మత్ = మా యొక్క; సుతుల్ = సంతతివారు; పిండంబులన్ = పిండములను; సతిలోదకంబులుగన్ = నువ్వులు నీళ్ళతో కూడినవిగా; అర్పింపంగన్ = సమర్పించుతుండగా; మా = మా; కున్ = కు; ఈక = ఈయకుండ; ఉద్ధండత్వంబునన్ = దాష్టీకముతో; తాన = తనే; కైకొనున్ = స్వీకరించును; మహా = మిక్కలి; ఉదగ్రుండు = క్రూరుడు; వీడు = ఇతడు; ఇక్కడన్ = ఇక్కడ; ఖండింపంబడె = చంపబడెను; నీ = నీ; నఖంబులన్ = గోళ్ళతోటి; నుతుల్ = స్తోత్రములను; కావింతుము = చేసెదము; ఆత్మేశ్వరా = నరసింహుడా {ఆత్మేశ్వరుడు - ఆత్మ (తమయొక్క) ఈశ్వరుడు (దేవుడు), విష్ణువు}.
భావము:
            పిత్రుదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు.
            “ఓ పరమాత్మా! నరసింహరూపా! మా సుతులు మా సుగతుల కోసం శ్రాద్ధాలు పెడుతున్నారు; పిండాలు, నువ్వులు నీళ్ళూ వదులుతున్నారు. కాని అవి మాకు అందనీయకుండా ఈ హిరణ్యాక్ష అసురుడు అమిత కోపంతో వేగంగా వచ్చి, హరించి, పట్టుకు పోయేవాడు. ఆ స్వార్థపర దుండగీడుని ఇక్కడ సంహరించావు. మా కష్టాలు తీర్చావు. నీకు నమస్కారములు”
७-३१३-व.
पित्रुदेवत लिट्लनिरि.
७-३१४-शा.
चंडक्रोधमुतोड दैत्युँडु वडिन् श्राद्धंबुलन् मत्सुतुल्
पिंडंबुल् सतिलोदकंबुलुग नर्पिंपंग मा कीक यु
द्दंडत्वंबुनँ दान कैकोनु महोदग्रुंडु; वीँ डिक्कडन्
खंडिंपंबडे नी नखंबुल नुतुल् गाविंतु मात्मेश्वरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, March 20, 2016

దేవతల నరసింహ స్తుతి - భవదీయాదరలీల

7-311-వ.
ఋషు లిట్లనిరి.
7-312-మ.
భవదీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ
డవి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ
యవినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే
దవిధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ధర్మానుసంధాయివై.
టీకా:
          ఋషులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి.
          భవదీయ = నీ యొక్క; ఆదర = ఆదరము యనెడి; లీలన్ = విలాసముచేత; లోకములన్ = లోకములను; ఉత్పాదించి = సృష్టించి; రక్షింపన్ = కాపాడగా; నేడు = ఇప్పుడు; అవి = అవి; దైత్య = రాక్షస; ఈశుని = రాజు; చేత = చేత; భేదితములు = చెరుపబడినవి; ఐ = అయ్యి; హ్రస్వంబులు = క్షీణించినవి, చిక్కిపోయినవి; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఈ = ఈ; అవినీతున్ = నీతిమాలినవాని; నరసింహ = నరసింహుని; రూపమునన్ = స్వరూపముతో; సంహారంబునొందించి = చంపి; వేద = వేదానుసార; విధిన్ = ధర్మమును; క్రమ్మఱన్ = మరల; ఉద్ధరించితి = నిలబెట్టితివి; కదా = కదా; ధర్మ = ధర్మమార్గమును; అనుసంధాయివి = కూర్చెడివాడవు; ఐ = అయ్యి.
భావము:
            మునీశ్వరులు ఇలా స్తోత్రాలు చేశారు.
            “ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి, రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా భిన్నం చేశాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”
७-३११-व.
ऋषु लिट्लनिरि.
७-३१२-म.
भवदीयादरलील लोकमुल नुत्पादिंचि रक्षिंप नेँ
डवि दैत्येशुनिचेत भेदितमुलै ह्रस्वंबुलै युंड नी
यविनीतुन् नरसिंहरूपमुन संहारंबु नोंदिंचि वे
दविधिं ग्रम्मर्र नुद्धरिंचिति गदा धर्मानुसंधायिवै.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, March 19, 2016

దేవతల నరసింహ స్తుతి - ప్రాణిసంఘముల

7-309-వ.
ఇంద్రుం డిట్లనియె.
7-310-సీ.
ప్రాణిసంఘముల హృత్పద్మమధ్యంబుల; నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు; 
దింతకాలము దానవేశ్వరుచే బాధ; పడి చిక్కి యున్న యాపన్నజనుల
రక్షించితివి మమ్ము; రాక్షసుఁ జంపితి; క్రతుహవ్యములు మాకుఁ గలిగె మరల; మంటిమి; నీ సేవ మరిగిన వారలు; కైవల్య విభవంబు కాంక్ష చేయ
7-310.1-ఆ.
రితరసుఖము లెల్ల నిచ్ఛగింపఁగ నేల?; యస్థిరంబులివి, యనంతభక్తిఁ;
గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక; చిత్తభయదరంహ! శ్రీనృసింహ!
టీకా:
          ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          ప్రాణి = జీవ; సంఘముల = కోటి యొక్క; హృత్ = హృదయములనెడి; పద్మ = పద్మముల; మధ్యంబులన్ = నడిమియందు; నివసించి = ఉండి; భాసిల్లు = ప్రకాశించెడి; నీవ = నీవే; ఎఱుంగుదు = తెలిసి యుందువు; ఇంత = ఇంత; కాలము = కాలము; దానవ = రాక్షసుల; ఈశ్వరు = రాజు; చేన్ = వలన; బాధ = బాధలందు; పడి = పడి; చిక్కి = నీరసించి; ఉన్న = ఉన్నట్టి; ఆపన్న = అపాయములపడిన; జనులన్ = వారలను; రక్షించితివి = కాపాడితివి; మమ్మున్ = మమ్ము; రాక్షసున్ = రాక్షసుని; చంపితి = చంపితివి; క్రతు = యజ్ఞములందలి; హవ్యములున్ = హవిర్భాగములు; మా = మా; కున్ = కు; కలిగె = లభించినవి; మరలన్ = మరల; మంటిమి = బతికితిమి; నీ = నీ యొక్క; సేవన్ = భక్తిని; మరిగిన = మరలుగొనిన, మోహపడిన; వారలు = వారు; కైవల్య = ముక్తిపదము యొక్క; విభవంబున్ = వైభవమును కూడ; కాంక్షచేయరు = కోరరు; ఇతర = మిగిలిన. 
సుఖముల్ = సుఖములను; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చగింపన్ = కోరుట; ఏల = ఎందులకు; అస్థిరంబులు = చపలములు; ఇవి = ఇవి; అనంత = తెంపులేని; భక్తిన్ = భక్తితో; కొలువనిమ్ము = సేవించనిమ్ము; నిన్నున్ = నిన్ను; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షస; అనీక = సేనల; చిత్త = మనసులందు; భయద = భయముపుట్టించెడి; రంహ = సంరంభముగలవాడ; శ్రీ = శుభకరమైన; నృసింహ = నరసింహుడా.
భావము:
            ఇంద్రుడు ఇలా సన్నుతించాడు
            “అరి వీర భయంకర స్పూర్తీ! నరసింహమూర్తీ! నీవు భీకర ప్రవృత్తి గల రాక్షసులు అందరి మనసులలోనూ భయము రేకెత్తించే వాడవు. సమస్త ప్రాణుల హృదయ పద్మాలలోనూ ప్రకాశించు వాడవు. నీకు తెలియనిది ఏమున్నది. ఇంతకాలం ఈ రాక్షసుల ప్రభువు అయిన హిరణ్యకశిపుని వలన కష్టాలు అనుభవించి ఆర్తులం అయ్యాము. నీవు ఆ రాక్షసుని సంహరించి మమ్ములను రక్షించావు. మాకు మరల మా హవిర్భాగాలు దక్కాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. నీ సేవా భాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరుకోరు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర కోరికలు కోరుకోటం ఎందుకూ, దండగ. అపారమైన భక్తితో నిన్ను సేవించుకునే వరం ప్రసాదించు నరకేసరీ!”
७-३०९-व.
इंद्रुं डिट्लनिये.
७-३१०-सी.
प्राणिसंघमुल हृत्पद्ममध्यंबुल; निवसिंचि भासिल्लु नीव येर्रुँगु;
दिंतकालमु दानवेश्वरुचे बाध; पडि चिक्कि युन्न यापन्नजनुल
रक्षिंचितिवि मम्मु; राक्षसुँ जंपिति; क्रतुहव्यमुलु माकुँ गलिगे मरल; मंटिमि; नी सेव मरिगिन वारलु; कैवल्य विभवंबु कांक्ष चय
७-३१०.१-आ.
रितरसुखमु लेल्ल निच्छगिंपँग नेल?; यस्थिरंबुलिवि, यनंतभक्तिँ;
गोलुव निम्मु निन्नु घोरदैत्यानीक; चित्तभयदरंह! श्रीनृसिंह!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :