Monday, August 24, 2015

బ్రహ్మవరములిచ్చుట - సకల మహాద్వీప

7-104-సీస పద్యము
సకల మహాద్వీప సహిత విశ్వంభరా; స్థలిని దున్నక పండు సస్యచయము;
కామధేన్వాదుల కరణి నర్ధులు గోరు; కోర్కులు గగనంబు గురియుచుండు;
వననిధు లేడును వాహినీసందోహ; ములును వీచుల రత్నములు వహించు;
నుర్వీరుహంబులు నొక్కకాలంబున; నఖిలర్తు గుణముల నతిశయిల్లు;
7-104.1-తేటగీతి
నంబుసంపూరితద్రోణులగుచు నొప్పుఁ; బర్వతంబులు; సర్వదిక్పాల వివిధ
గుణము లెల్లను తానె కైకొనుచు దైత్య; విభుఁడు త్రైలోక్యరాజ్యసంవృద్ధి నుండ.
            ఆ రాక్షసుడు దిక్పాలకులు అందరి రాజ్యాధికారాలు అన్నీ లాగేసుకున్నాడు. ముల్లోకాల లోకి తన రాజ్యాధికారాన్ని పెంచుకుంటూ పోయాడు. అలా ఏలుతుండగా, సప్త మహా ద్వీపాలతో సహా భూమండలంలో అన్ని చోట్లా పొలాలు దున్నకుండానే అన్ని పంటలూ పండుతూ ఉన్నాయి. కామధేనువులాగా ఆకాశం కావలసిన అంత కురుస్తోంది. సప్త సముద్రాలు అన్నీ, నదులు అన్నీ తమ అలలతో రత్నాలను కుమ్మరిస్తు ఉన్నాయి. చెట్లు అన్నీ ఆరు ఋతువుల ధర్మాలు ఏక కాలంలోనే పొందుతూ ఉన్నాయి. పర్వతాల మీది గుంటలు అన్నీ నిత్యం నీటితో నిండి ఉంటున్నాయి.
७-१०४-सीस पद्यमु
सकल महाद्वीप सहित विश्वंभरा; स्थलिनि दुन्नक पंडु सस्यचयमु;
कामधेन्वादुल करणि नर्धुलु गरु; कोर्कुलु गगनंबु गुरियुचुंडु;
वननिधु लेडुनु वाहिनीसंदोह; मुलुनु वीचुल रत्नमुलु वहिंचु;
नुर्वीरुहंबुलु नोक्ककालंबुन; नखिलर्तु गुणमुल नतिशयिल्लु;
७-१०४.१-तेटगीति
नंबुसंपूरितद्रोणुलगुचु नोप्पुँ; बर्वतंबुलु; सर्वदिक्पाल विविध
गुणमु लेल्लनु ताने कैकोनुचु दैत्य; विभुँडु त्रैलोक्यराज्यसंवृद्धि नुंड.
                      సకల = అఖిలమైన; మహాద్వీప = సప్తమహాద్వీపములతో {సప్తద్వీపములు - 1జంబూద్వీపము 2ప్లక్షద్వీపము 3శాల్మలీద్వీపము 4కుశద్వీపము 5క్రౌంచద్వీపము 6శాకద్వీపము 7పుష్కరద్వీపములు}; సహిత = సహా; విశ్వంభరాస్థలిని = భూమండలమునందు; దున్నకన్ = పొలములు దున్నకుండగనే; పండున్ = పండును; సస్య = ధాన్యములు; చయము = అన్నియును; కామధేనువు = కామధేనువు; ఆదుల = మొదలగువాని; కరణిన్ = విధముగ; అర్థులు = కోరికలుకోరువారు; కోరు = కోరెడి; కోర్కులు = కోరికలు; గగనంబున్ = ఆకాశము; కురియుచుండున్ = వర్షించును; వననిధులు = సముద్రములు; ఏడును = ఏడు (7); వాహనీ = నదుల; సందోహములును = సమూహములు; వీచులన్ = తరంగములందు; రత్నములు = రత్నములు; వహించు = కలిగియుండును; ఉర్వీరుహంబులు = చెట్లు; ఒక్కకాలంబునన్ = అన్నికాలములలోను; అఖిలర్తు = అన్నిరుతువుల; గుణములన్ = లక్షణములతోను; అతిశయిల్లున్ = సమృద్ధిగానుండును;
          అంబు = నీళ్లు; సంపూరిత = నిండిన; ద్రోణులు = గుంటలు,; అగుచున్ = కలిగినవయ్యి; ఒప్పున్ = చక్కగానుండును; పర్వతంబులు = పర్వతములు; సర్వ = అఖిలమైన; దిక్పాల = దిక్పాలకుల; వివధ = అన్నిరకముల; గుణములు = గుణములు; ఎల్లను = అన్నిటిని; తానె = తనే; కైకొనుచు = తీసేసుకొనుచు; దైత్యవిభుడు = హిరణ్యకశిపుడు; త్రైలోక్య = ముల్లోకములను; రాజ్య = ఏలెడి; సంవృద్ధిన్ = అభివృద్దితో; ఉండన్ = ఉండగా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, August 23, 2015

తెలుగుభాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవం.



బ్రహ్మవరములిచ్చుట - యాగములు

7-103-కంద పద్యము
యాగములు బుధులు ధరణీ
భాగములం జేయుచుండఁ బఱతెంచి హవి
ర్భాగములు దాన కైకొనుఁ
జాగింపఁడు దైత్యుఁ డమరసంఘంబునకున్.
            భూలోకంలో జ్ఞానులు అక్కడక్కడ యజ్ఞాలు చేయటం ఆలస్యం, పరుగున వచ్చి ఆ రాక్షసుడు హవిస్సులు అన్నీ తనే కాజేస్తాడు. దేవతలకు దక్కనివ్వడు.
७-१०३-कंद पद्यमु
यागमुलु बुधुलु धरणी
भागमुलं जेयुचुंडँ बर्रतेंचि हवि
र्भागमुलु दान कैकोनुँ
जागिंपँडु दैत्युँ डमरसंघंबुनकुन्.
          యాగములు = యజ్ఞములకై; బుధులు = జ్ఞానులు; ధరణీభాగములన్ = భూప్రదేశముల; చేరుచుండ = దగ్గరకువచ్చుచుండగ; పఱతెంచి = పరుగునవచ్చి; హవిర్భాగములను = యజ్ఞహవిస్సులను; తాన = తనే; కైకొను = తీసుకొనును; చాగింపడు = పోనీయడు, సాగనీయడు; దైత్యుడు = రాక్షసుడు; అమర = దేవతల {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; సంఘంబున్ = సమూహమున; కున్ = కు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, August 22, 2015

బ్రహ్మవరములిచ్చుట - లీలోద్యాన

7-102-శార్దూల విక్రీడితము
లీలోద్యాన లతా నివాసములలో లీలావతీయుక్తుఁడై
హాలాపానవివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుఁడై
కేళిం దేలఁగ నేనుఁ దుంబురుఁడు సంగీతప్రసంగంబులన్
వాలాయంబుఁ గరంగఁ జేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా!
            ఓ మహారాజా! దేవతల శత్రువు అయిన హిరణ్యకశిపుడు లీలావతి మహారాణి తో కూడి పొదరిళ్ళ యందు విలాసాల్లో తేలుతున్నాడు. ఇంకా మధ్యం తాగిన మత్తుతో వాడి ఎర్రని కళ్ళు పెద్దవి అయ్యాయి, గుండ్రంగా తిరుగున్నాయి. అలాంటప్పుడల్లా, వాడిని మా సంగీత ఆలాపనలతో తుంబురుడు, నేను శాంతింప జేస్తూ ఉంటాం. 
७-१०२-शार्दूल विक्रीडितमु
लीलोद्यान लता निवासमुलल लीलावतीयुक्तुँडै
हालापानविवर्धमान मदलोलावृत्त ताम्राक्षुँडै
केळिं देलँग नेनुँ दुंबुरुँडु संगीतप्रसंगंबुलन्
वालायंबुँ गरंगँ जेयुदुमु देवद्वेषि नुर्वीश्वरा!
          లీలోద్యాన = శృంగారపు పూతోటలోని; లతా = తీగ; నివాసముల = పొదరిళ్ళ; లోన్ = అందు; లీలావతీ = లీలావతితో {లీలావతి - హిరణ్యకశిపుని భార్య}; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; హాలా = కల్లు, మధ్యము; పాన = తాగుటచే; వివర్ధమాన = పెద్దవియైన; మద = మత్తెక్కి; లోలావృత = గుండ్రముగాతిరుగుచున్న; తామ్ర = ఎర్రని; అక్షుడు = కన్నులుగలవాడు; ఐ = అయ్యి; కేళిన్ = విలాసములలో; తేలగా = తేలుతుండగా; నేనున్ = నేను; తుంబురుడు = తుంబురుడు; సంగీత = సంగీతపు; ప్రసంగంబులన్ = ఆలాపనలతో; వాలాయంబున్ = ఎల్లప్పుడును; కరగన్ = శాంతించి కరిగిపోవునట్లు; చేయుదుము = చేసెదము; దేవద్వేషిన్ = హిరణ్యకశిపుని {దేవద్వేషి - దేవతల యెడ ద్వేషముగల వాడు, హిరణ్యకశిపుడు}; ఉర్వీశ్వరా = రాజా {ఉర్వీశ్వరుడు - ఉర్వి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :