Tuesday, July 28, 2015

హిరణ్యకశిపుని తపస్సు. - అజరామర

7-71-కంద పద్యము
అజరామర భావంబును
ద్రిజగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో
ర్విజితాఖిలశాత్రవమును
గజరిపుబలమును హిరణ్యకశిపుఁడు గోరెన్.
          హిరణ్యకశిపుడు తనకు ముసలితనం కానీ చావు కానీ లేని అమరత్వం కావాలని కోరుకున్నాడు; ఇంకా ముల్లోకాలను ఎదురు లేకుండా పరిపాలించే శక్తినీ, బాహుబలంతో శత్రువులను ఎవరినైనా జయించే బలాన్నీ, సింహపరాక్రమం పొందాలనీ ఆశించాడు.
७-७१-कंद पद्यमु
अजरामरभावंबुनु
द्रिजगद्राज्यंबु नप्रतिद्वंद्वमु दो
र्विजिताखिलशात्रवमुनु
गजरिपुबलमुनु हिरण्यकशिपुँडु गोरेन.

   అజర = ముసలితనములేని; అమర = చావులేని; భావంబును = స్థితిని; త్రిజగత్ = ముల్లోకము లందు విస్తరించిన; రాజ్యంబున్ = రాజ్యాధికారము; అప్రతిద్వంద్వమున్ = ఎదురులేనిది, నిష్కంటకము; దోః = బాహు బలముతో; విజిత = జయించబడిన; అఖిల = సమస్తమైన; శాత్రవమున్ = శత్రువులు కలుగుట; గజరిపు = సింహము వంటి {గజరిపు - గజము (ఏనుగు)నకు రిపు (శత్రువు), సింహము}; బలమును = శక్తి; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; కోరెన్ = ఆశించెను.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, July 27, 2015

సుయజ్ఞోపాఖ్యానము - కాలము వచ్చిన

7-66-కంద పద్యము
కాలము వచ్చిన శబరుని
కోలను ధరఁగూలె ఖగము ఘోషముతోడం
గాలము డాసిన నేలం
గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్.
          కాలం మూడిన ఆ మగ పక్షి గోలపెట్టిమరీ అలా బోయవాడి బాణం దెబ్బతిని పడి చచ్పిపోయింది. అవును, ఆయువు తీరిన తరువాత చావకుండా ఉండటం అన్నది ఎంతటి తెలివైనవాడైనా, బలవంతుడైనా, అధికార సంపదలు కలవాడి కైనా అసాధ్యమే కదా.
७-६६-कंद पद्यमु
कालमु वच्चिन शबरुनि
कोलनु धरँगूले खगमु घोषमुतोडं
गालमु डासिन नेलं
गूलक पो वशमे येट्टि गुणवंतुलकुन.
          కాలము = అదను, సమయము; వచ్చిన = రాగా; శబరుని = కోయవాని; కోలను = బాణమువలన; ధరన్ = నేలపైన; కూలెన్ = పడిపోయెను; ఖగము = పక్షి; ఘోషము = గోలపెట్టుట; తోడన్ = తోటి; కాలము = కాలము, అదను; డాసిన = కలిసివచ్చిన; నేలంగూలక = మరణించకుండుట; వశమె = సాధ్యమేనా ఏమి; ఎట్టి = ఎటువంటి; గుణవంతుల = తెలివిగలవారి; కున్ = కైనను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, July 26, 2015

సుయజ్ఞోపాఖ్యానము - కుంఠితనాదము

7-64-వచనము
అని యివ్విధంబున.
7-65-కంద పద్యము
కుంఠితనాదముతోడను
గంఠము శోషింప వగచు ఖగమును హననో
త్కంఠుండైన కిరాతుఁ డ
కుంఠితగతి నేసె నొక్క కోలం గూలన్.
          ఇలా ఆడపిచ్చుకను చూసి, దుఃఖంతో గద్గదమైన కంఠంతో, గొంతెండిపోయేలా విలపిస్తోంది. ఆ మగ పిచ్చుకను పక్షులను వేటాడుతున్న ఆ బోయవాడు వేగంగా ఒక్క బాణం వేసి నేలమీద పడిపోయేలా కొట్టాడు.
७-६५-कंद पद्यमु
कुंठितनादमुतोडनु
गंठमु शोषिंप वगचु खगमुनु हननो
त्कंठुंडैन किरातुँ ड
कुंठितगति नेसे नोक्क कोलं गूलन.
          అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
          కుంఠిత = గద్గద; నాదము = స్వరము; తోడను = తోటి; కంఠము = గొంతు; శోషింపన్ = ఎండిపోతుండగ; వగచు = విచారించున్న; ఖగమును = పక్షిని; హనన = చంపుటకు; ఉత్కంఠుండు = పూనినవాడు; ఐన = అయిన; కిరాతుడు = బోయవాడు; అకుంఠిత = అడ్డులేని; గతిన్ = విధముగ; ఏసెన్ = కొట్టెను; ఒక్క = ఒక; కోలన్ = బాణమును; కూలన్ = పడిపోవునట్లుగ.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, July 25, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఱెక్కలు రావు

7-63-ఉత్పలమాల
ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ
దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా!”
          మన పిల్లలకేమో ఇంకా రెక్కలు రాలేదు. రేపటినుండి ఆహారం కనబడక ఏడుస్తూ ఉంటాయి. ఫోనీ ఎగిరి వెళ్ళి తెచ్చుకుందా మంటే వాటికింకా ఎగరటం కూడ రాదు. అయ్యో! “ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మ ఈ ప్రక్క నుండి తిండి పట్టుకొచ్చేది” అని ఒకే ధ్యాసతో, కళ్ళు తిప్పకుండా నల్దిక్కులా నిక్కి చూస్తూ ఉంటాయి. వాటి దీనమైన ముఖాలు ఎలా చూడాలి? కడుపు తరుక్కుపోయే ఆ రోదనలు భరించట మెలా?
७-६३-उत्पलमाल
र्रेक्कलु रावु पिल्ललकु र्रेपटिनुंडियु मेँत गानमिं
बोक्केडु गूटिलॉ नेगसि पोवँग नेरवु; मुन्नु तल्लि यी
दिक्कुननुंडि वच्चु ननि त्रिप्पनि चूड्कुल निक्किनिक्कि न
ल्दिक्कुलुँ जूचुचुन्न वतिदीनत नेट्लु भरिंतु नक्कटा!”
          ఱెక్కలు = రెక్కలు; రావు = ఇంకారాలేదు; పిల్లల్ = పిల్లల (పక్షి); కున్ = కు; ఱేపటి = రేపటి; నుండియున్ = నుంచి; మేతన్ = ఆహారమును; కానమిం = కనబడకపోవుటచేత; పొక్కెడున్ = ఏడ్చును; గూడు = నివాసము; లోన్ = నుండి; ఎగసిపోవగ = ఎగురుటకు; నేరవు = సమర్థములుగాదు; మున్ను = ఇంతకు పూర్వము; తల్లి = తల్లి పక్షి; ఈ = ఈ; దిక్కున = వైపు; నుండి = నుండి; వచ్చును = వస్తూ ఉంటుంది; అని = అని; త్రిప్పని = ఇటునటు తిరగని; చూడ్కులన్ = చూపులతో; నిక్కినిక్కి = తలలునిక్కబొడిచి; నలు = నాలుగు (4); దిక్కులన్ = వైపులకును; చూచుచున్నవి = ఎదురుచూచుచున్నవి; అతి = మిక్కలి; దీనతన్ = జాలితో; ఎట్లు = ఏ విధముగ; భరింతున్ = ఓర్చుకొనగలను; అకటా = అయ్యో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, July 24, 2015

సుయజ్ఞోపాఖ్యానము - ఒకమాటు

7-62-కంద పద్యము
ఒకమాటు మనల నందఱఁ
బ్రకటించి కిరాతువలలఁ బడఁజేయక ని
న్నొకతిన్ వలఁబడఁ జేసిన
వికటీకృతదక్ష మైన విధి నే మందున్.
          వంకరపనులు చేయటంలో మిక్కిలి నేర్పున్న ఈ విధిని ఏమని నిందించాలి? నిన్ను ఒక్కదానిని బోయవాడి వలలో పడమని వ్రాసాడు చూడు! కనీసం మనం అందరం ఒకేమాటు వాడి వలలో పడమని వ్రాయవచ్చు కదా!
७-६२-कंद पद्यमु
ओकमाटु मनल नंदर्रँ
ब्रकटिंचि किरातुवललँ बडँजॅयक नि
न्नोकतिन वलँबडँ जॅसिन
विकटीकृतदक्ष मैन विधि नॅ मंदुन.
          ఒకమాటు = ఒకేసారి; మనలన్ = మనలను; అందఱన్ = అందరిని; ప్రకటించి = నియమించి; కిరాతు = బోయవాని; వలలన్ = వలలలో; పడన్ = పడునట్లు; చేయక = చేయకుండగ; నిన్నున్ = నిన్ను; ఒకటిన్ = ఒక్కదానిని; వలన్ = వలయందు; పడన్ = పడునట్లు; చేసిన = చేసినట్టి; వికటీ = వంకరపనులు; కృత = చేయుటందు; దక్షము = నేర్పరి; ఐన = అయిన; విధిన్ = దైవమును; ఏమి = ఏమి; అందున్ = అనగలను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :