Thursday, August 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 395

శ్రీపంబులు

1-446-క.
శ్రీపంబులు ఖండిత సం
తాపంబులు గల్మషాంధతమస మహోద్య
ద్దీపంబులు పాషండ దు
రాపంబులు విష్ణు వందనాలాపంబుల్.
        ఆ నందనందమని వందనాలాపాలు, శ్రీలను చెందించేవి, సంతాపాలన సమూలంగా తొలగించేవి, ఉద్దీపితమైన దివ్వెలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందులేనివి.
భాగవత భక్తిప్రపత్తుల విశిష్ఠతను ఇలా తలచుకుంటు, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు
1-446-ka.
SreepaMbulu khaMDita saM
taapaMbulu galmashaaMdhatamasa mahOdya
ddeepaMbulu paashaMDa du
raapaMbulu vishNu vaMdanaalaapaMbul.
     శ్రీ = సంపదలను; పంబులు = అతిశయింప చేయునది; ఖండిత = బద్దలు చేయబడిన; సంతాపంబులు = వ్యధలు కలవి; కల్మష = పాపము అను; అంధతమస = కటిక చీకటికి {అంధము - అంధతరము - అంధతమము}; మహా = గొప్ప; ఉద్యత్ = పెద్దవి / పైకెత్త బడిన; దీపంబులు = దీపములు; పాషండ = పాషండులకు; దురాపంబులు = పొందవీలుకానివి; విష్ణు = విష్ణుదేవుని; వందన = నమస్కారములు; ఆలాపంబుల్ = స్మరణములు.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, August 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 394

ఏనుమృతుండ

12-25-ఉ.
ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.
     ఓ మహారాజా! నేను చనిపోతాను అన్న భయాన్ని పూర్తిగా మనసులోంచి తుడిచెయ్యి. జన్మించిన మానవు లందరికి మరణించటం అన్నది శాశ్వతమైన తప్పనిసరి ధర్మం. కనుక హరిని ధ్యానంచేసుకో. దీనివల్ల మళ్ళా ఈ భూలోకంలో జన్మించటం జరుగదు. మాధవలోక మైన వైకుంఠంలో నివసించి, అక్కడ సౌఖ్యాలు అనుభవించే యోగం కలుగుతుంది.
భాగవత పురాణం చక్కగా వివరించాడు శుకమహర్షి. ఇక సమయం దగ్గరకొచ్చింది, యిలా పరీక్షిన్మహారాజయోగిని ముక్తికి, వైకుంఠయాత్రకి సిద్ధం చేస్తున్నాడు.
 12-25-u.
 aenu mRtuMDa naudu nani yiMta bhayaMbu manaMbulOpalan
maanumu; saMbhavaMbu gala maanavakOTlaku@M jaavu nityamau@M;
gaana hariM dalaMpu; mika@M galgadu janmamu neeku dhaatripai;
maanavanaatha! poMdedavu maadhavalOkanivaasasaukhyamul.
          ఏను = నేను; మృతుండను = చనిపోయినవాడను; ఔదున్ = అయిపోతాను; అని = అని; ఇంత = ఇంత అధికమైన; భయంబున్ = భయమును; మనంబు = మనసు; లోపలన్ = లో; మానుము = విడిచి పెట్టుము; సంభవంబు = పుట్టుట; కల = కలిగిన; మానవ = మానవులు; కోట్లు = అందరి; కున్ = కి; చావు = చచ్చిపోవు టన్నది; నిత్యము = శాశ్వతమైన ధర్మము; ఔన్ = అయి ఉన్నది; కాన = కనుక; హరిన్ = విష్ణుమూర్తిని; తలంపుము = స్మరించుము; ఇక = ఈ పైన; కల్గదు = సంభవించదు; జన్మము = పుట్టుక; నీ = నీ; కున్ = కు; ధాత్రి = భూలోకము; పైన్ = అందు; మానవనాథ = రాజా; పొందెదవు = పొందుతావు; మాధవలోక = వైకుంఠము నందు {మాధవలోకము - విష్ణుమూర్తి యొక్క పదము, వైకుంఠము}; నివాస = నివసించెడి; సౌఖ్యముల్ = సుఖములను.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, August 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 393

సాలావృక

1-122-క.
సాలావృక కపి భల్లుక
కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్.
          తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, మహిషాలు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.
పూర్వజన్మలో నారదుడు తన తల్లి మరణానంతరం పూర్తి భాగవతమార్గంలో తిరుగుతు ప్రవేశించిన జంతువులు అనేకం ఉన్న అడవి వర్ణన యిది.
1-122-ka.
saalaavRka kapi bhalluka
kOlaebha lulaaya Salya ghooka Sarabha Saa
rdoola SaSa gavaya khaDga
vyaaLaajagaraadi bhayada vanamadhyamunan
          సాలావృక = పెద్దతోడేళ్ళు; కపి = కోతులు; భల్లుక = ఎలుగుబంట్లు; కోల = అడవిపందులు; ఇభ = ఏనుగులు; లులాయ = అడవిదున్నలు; శల్య = ముళ్ళపందులు; ఘూక = గుడ్లగూబలు; శరభ = శరభమృగములు; శార్దూల = పెద్దపులులు; శశ = కుందేళ్ళు; గవయ = ఎనుబోతులు; ఖడ్గ = ఖడ్గమృగములు; వ్యాళ = పాములు; అజగర = కొండచిలువలు; ఆది = మొదలగువానితో; భయద = భయంకరమైన; వన = అడవి; మధ్యమునన్ = నడుమ.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, August 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 392

సంపూర్ణవృష్టి

1-233-సీ.
సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు;
 నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు;
 ఫలవంతములు లతాపాదపములు
పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల;
 ధర్మ మెల్లెడలను దనరి యుండు
దైవభూతాత్మ తంత్రము లగు రోగాది;
 భయములు సెందవు ప్రజల కెందు
ఆ.
గురుకులోత్తముండు గుంతీతనూజుండు
దాన మానఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకలమహీరాజ్య
విభవభాజి యయిన వేళ యందు
          దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురులాలంకారుడు, కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు. పృథివి బంగారు పంటలు పండించింది. గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి. వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి. దేశమంతటా ధర్మం పాతుకున్నది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన తాపత్రయాలు వ్యాధులు ప్రజలను బాధించలేదు.
1-233-see.
saMpoorNa vRshTi@M barjanyuMDu guriyiMchu;
nila yella@M gOrkula neenuchuMDu
gOvulu varshiMchu ghOshabhoomula@M baalu;
phalavaMtamulu lataapaadapamulu
paMDu sasyamulu dappaka Rtuvula nella;
dharma melleDalanu danari yuMDu
daivabhootaatma taMtramu lagu rOgaadi;
bhayamulu seMdavu prajala keMdu
aa.
gurukulOttamuMDu guMteetanoojuMDu
daana maanaghanu@MDu dharmajuMDu
satyavaakyadhanu@MDu sakalamaheeraajya
vibhavabhaaji yayina vaeLa yaMdu
          సంపూర్ణ = సంపూర్ణమైన; వృష్టిన్ = వర్షమును; పర్జన్యుండు = మేఘుడు {పర్డన్యుడు - ఉరిమెడువాడు, మేఘుడు}; కురియించు = కురిపించును; ఇల = భూమి; ఎల్లన్ = సమస్తమైన; కోర్కులన్ = కోరికలను; ఈనుచుండున్ = పుట్టించును; గోవులు = ఆవులు; వర్షించున్ = ఎక్కువగా ఇచ్చును; ఘోషభూములన్ = గొల్లపల్లెలలో; పాలు = పాలు; ఫల = ఫలములతో; వంతములున్ = నిండి ఉండును; లతా = తీగలు; పాదపములు = చెట్లు; పండు = పండును; సస్యములున్ = ధాన్యములు; తప్పక = తప్పకుండగ; ఋతువులన్ = ఋతువులలో; ఎల్లన్ = సమస్తమును; ధర్మము = ధర్మవర్తనము; ఎల్ల = సమస్త; ఎడలను = స్థలములందును; తనరి = విస్తరించి; ఉండున్ = ఉండును; దైవ = దేవతలు; భూత = భూతములు; ఆత్మ = ఆత్మలు; తంత్రములు = హేతు భూతములు; అగు = అయినట్టి; రోగ = రోగములు; ఆది = మొదలగు; భయములు = భయములు; చెందవు = కలుగవు; ప్రజలు = లోకులు; కున్ = కు; ఎందున్ = ఎక్కడాకూడ; కురు = కురు; కుల = వంశములో; ఉత్తముండు = ఉత్తముడు; కుంతీ = కుంతియొక్క; తనూజుండు = పుత్రుడు; దాన = దానమునందును; మాన = మానమునందును; ఘనుఁడు = గొప్పవాడు; ధర్మజుండు = ధర్మరాజు; సత్య = సత్యమైన; వాక్య = వాక్కు; ధనుఁడు = ధనముగాగలవాడు; సకల = సమస్త; మహీ = భూమియందలి; రాజ్య = రాజ్యములలోను; విభవ = (తన) వైభవము; భాజి = భజింపబడువాడు; అయిన = అయినట్టి; వేళ = సమయము; అందున్ = లో.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~