Friday, March 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 241



త్రిజగన్మోహన నీలకాంతి

1-219-మ.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
          ముల్లోకాలకు మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహంతో, పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రంతో, నల్లని ముంగురులు కదలాడుతు ముద్దులు మూటగట్టుతున్న ముఖ పద్మంతో, మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
భక్తి రసావేశంతో, సాహిత్య సౌరభాలతో, ఆధ్యాత్మిక విలువల ఔన్నత్యంతో, మంత్రపూరిత మహత్యంతో తొణికిసలాడుతుండే భీష్మస్తుతి మధురాతి మధురమైనది అంటారు. అట్టి భీష్మ స్తుతిలోని ఒక ఆణిముత్య మిది. నీలవర్ణం సర్వవ్యాపక ఆకాశానికి ప్రతీక, ప్రాభాతం ఆత్మజ్ఞానోదయానికి, ముఖారవిందం ప్రధానమైన హృదయపద్మానికి, నీలాలకాలు మానవభావలకు, అతిసేవ్యంబు దైవదర్శనానికి, ఎల్లప్పుడున్ శాశ్వతత్వానికి సూచికలు అనుకుంటే భీష్ముని విజ్ఞానం అబ్బురంగా అనిపిస్తుంది. ప్రాసగా ‘జ’ ప్రయోగిస్తు మా విజయునికి దగ్గరగా ఉండే వాడు అంటు మత్తేభం విక్రీడితం ప్రయోగించిన పోతనగారి  చమత్కారం మనోహరం.
1-219-ma.
trijaganmOhana neelakaaMti@M danu vuddeepiMpa@M braabhaata nee
rajabaMdhuprabhamaina chaelamu payin raMjilla neelaalaka
vraja saMyukta mukhaaraviMda matisaevyaMbai vijRMbhiMpa maa
vijayuM jaereDu vannelaa@MDu madi naavaeSiMchu nellappuDun.
          త్రి = మూడు; జగత్ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్ = కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు / సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్ = పైన; రంజిల్లన్ = ఎర్రగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; సంయుక్త = కూడిన; ముఖ = మఖము అనే; అరవిందము = పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింపదగినది; ఐ = అయ్యి; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరి యుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, March 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 240


ప్రాప్తానందులు

1-515-శా.
ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణు లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు మీర లార్యులు దయాళుత్వాభిరాముల్ మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా?
సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం జర్చించి భాషింపరే.
          మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన బోధనా పారీణులు, ఆత్మతత్వ మెరిగి అవిద్య తొలగిన వారు, సకలము తెలిసిన విజ్ఞలు, దయార్ధ్ర హృదయులు, లోకంలోని సమస్త విషయాలను మనోనేత్రాలతో దర్శించగలవారు. మీరు విచారించి ఏడురోజులలో మోక్షంపొందే మార్గం నాకు చెప్పండి.
అని గంగానది వద్ద ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తు వచ్చిన ఋషులు సంయమీంద్రులు అందరిని అడుగుతున్నాడు.
1-515-Saa.
praaptaanaMdulu brahmabOdhana kaLaapaareeNu laatmaprabhaa
luptaaj~naanulu meera laaryulu dayaaLutvaabhiraamul manO
guptaMbul sakalaarthajaalamulu meekuM gaanavachchuM gadaa?
saptaahaMbula mukti kae@MgeDu gatiM jarchiMchi bhaashiMparae.
          ప్రాప్త = పొందిన; ఆనందులు = ఆనందం గల వారు; బ్రహ్మ = పరబ్రహ్మమును; బోధన = బోధించు; కళా = కళయందు; పారీణులు = పరిపక్వము చెందినవారు – పారము ముట్టినవారు; ఆత్మ = తమ; ప్రభా = ప్రభావముచేత; లుప్త = లోపింప జేయబడిన; అజ్ఞానులు = అజ్ఞానము కల వారు; మీరలు = మీరు; ఆర్యులు = గౌరవింప దగినవారు; దయాళుత్వ = దయాస్వభావముతో; అభిరాముల్ = సొంపైనవారు; మనస్ = మనసు నందు; గుప్తంబుల్ = దాచబడినవి; సకల = సమస్త; అర్థ = విషయాల; జాలములు = సమన్వయములు; మీకున్ = మీకు; కానన్ = తెలిసి; వచ్చున్ = వచ్చును; కదా = కదా; సప్త = ఏడు (7); అహంబులన్ = దినములలో; ముక్తి = ముక్తి; కిన్ = కి; ఏఁగెడు = వెళ్ళుటకు; గతిన్ = దారిని – విధమును; చర్చించి = విమర్శించి; భాషింపరే = చెప్పండి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~