Wednesday, February 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 211

ధన్యున్

10.1-1705-శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతాలలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
    మదపుటేనుగుల లాంటి దుష్టులైన రాజుల పాలిటి సింహము వంటి ఓ శ్రీకృష్ణ ప్రభూ! నీవు కృతార్థుడవు; లోకంలో అందరి మనస్సులను రంజిపజేసే వాడవు; ఉత్తమ వంశము, విజ్ఞానము, సౌందర్యం, జవ్వనం, మంచితనం, సంపద, బలం, పరాక్రమం, కారుణ్యములతో అలరారుతుంటావు. అలాంటి నిన్ను కన్యలు ఎవరైనా వరించకుండా ఉండగలరా? నే ఒక్కర్తెనా నిన్ను మోహించింది? నా ఒక్కర్తెకేనా వలపు అన్నది పుట్టింది? ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీమహాలక్ష్మి అలనాడే నిన్ను వరించ లేదా?
అంటు రుక్మిణి పంపిన రహస్య సందేశాలు అన్ని శ్రీకృష్ణునికి విప్రుడు విన్నవిస్తున్నాడు. గొప్పదనాన్ని వర్ణించడానికి శార్దూల విక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో ఛందో సార్థక్యం, న్య కారాన్ని ప్రాసగా ప్రయోగించటంలో, పద్యం నడకలో శబ్ద సంయోజకం శైలి, వర్ణించటంలో ఉత్తమతమత్వాన్ని సూచించటానికి వాడిన నిన్ను ఎవరు కాంక్షించరు అనే చమత్కారంలో, నేను అత్యుత్తమాన్ని కోరతాను నేనేం తక్కువ కాదు అనే అణుకువతో కూడిన రాజసం సూచనలో వర్ణన విశిష్ఠత పాత్రౌచిత్యం ఈ పద్యానికి చక్కటి సౌందర్యాన్ని యిచ్చాయి.
10.1-1705-Saa.
dhanyun lOkamanObhiraamu@M gula vidyaa roopa taaruNya sau
janya Sree bala daana Saurya karuNaa saMSObhitun ninnu nae
kanya lgOraru? kOradae munu ramaakaaMtaalalaamaMbu raa
janyaanaekapasiMha! naa valananae janmiMchenae mOhamul.
          ధన్యున్ = కృతార్థుండు; లోక = లోకుల; మనః = మనసులను; అభిరామున్ = నచ్చువాడు; కుల = వంశముచేత; విద్యా = విఙ్ఞానముచేత; రూప = సౌందర్యముచేత; తారుణ్య = యౌవనశోభచేత; సౌజన్య = మంచితనముచేత; శ్రీ = సంపదలచేత; బల = శక్తిచేత; దాన = ఈవిచేత; శౌర్య = మిక్కలి వీరత్వముచేత; కరుణా = దయచేత; సంశోభితున్ = మిక్కలి ప్రకాశవంతుడు; నిన్నున్ = నిన్ను; ఏ = ఏ; కన్యల్ = కన్యలుమాత్రము; కోరరు = కావలనుకొనరు; కోరదే = వరించలేదా; మును = పూర్వము; రమా = లక్ష్మీదేవి యనెడి; కాంతాలలామంబు = శ్రేష్ఠురాలు; రాజ = రాజులలో; అన్య = శత్రువులనెడి; అనేకప = ఏనుగులకు; సింహ = సింహమువంటివాడ; నా = నా ఒక్కర్తె; వలననే = యందే; జన్మించెనే = పుట్టినవా, పుట్టలేదు; మోహముల్ = మోహించుటలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, February 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 210

పంకజముఖి

birth of krishna   10.1-105-క.

పంకజముఖి నీ ళ్ళాడఁను
సంకటపడ ఖలులమానసంబుల నెల్లన్
సంకటము దోఁచె; మెల్లన
సంకటములు లేమి తోఁచె సత్పురుషులకున్.
          పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్ర,సవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి.
అంటు విశ్వేశుడు భూమిపై అవతరించే సమయంలో విశ్వమంతా ఎలా స్పందిస్తోందో వర్ణిస్తున్నారు మన పోతనమాత్యులవారు.
10.1-105-ka.
paMkajamukhi nee LLaaDa@Mnu
saMkaTapaDa khalulamaanasaMbula nellan
saMkaTamu dO@Mche; mellana
saMkaTamulu laemi tO@Mche satpurushulakun.
          పంకజముఖి = సౌందర్యవతి; నీళ్ళాడను = ప్రసవించుటకు; సంకటబడన్ = నెప్పులుపడుతుండగా; ఖలుల = దుష్టుల; మానసంబులన్ = మనసులలో; ఎల్లన్ = అన్ని; సంకటము = కీడులు; తోచెన్ = కనబడెను; మెల్లనన్ = శాంతిగా; సంకటములు = బాధలు; లేమి = లేకపోవుటలు; తోచెన్ = కనబడెను; సత్పురుషుల్ = సజ్జనుల; కున్ = కు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, February 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 209

వేలపులటె

10.1-313-క.
వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వఁ రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.
          ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరన్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.
అంటు గోపికలు బాలకృష్ణుని చేష్టలు చెప్తున్నారు. గోపిక పదం జ్ఞానికి ప్రతీక. సర్వమునకు కారణ వస్తువైన పరమాత్మ “నే”నై ఉండగా, అహంకి ప్రతిరూపమైన నా యందు అనన్యభక్తి చూపక “నా”కంటె దేవుడు వేరే ఉన్నాడని పూజిస్తున్నారా అని నవ్వుతున్నాడు. అహం “బ్రహ్మః”, “సోహం” అని అధ్యయనాలు చేస్తు, ఇంకా బొమ్మల పూజలేమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఎంగిలి చేయటం అంటే వ్యర్థమనుట. మానవజన్మకి పరమతారకం స్వస్వరూప విజ్ఞానమే తప్ప తక్కిన సమస్తము వ్యర్థకాలక్షేపము కనుక అది కూడదు అని సూచిస్తున్నాడు శ్రీకృష్ణపరబ్రహ్మము.
10.1-313-ka.
vaelupula@MTe; naa kaMTenu
vaelupu maRi yevva@M ranuchu vikavika nagi maa
vaelupula gODapai nO
haelaavati! nee tanooju@M DeMgili@M jaesen.
          వేలుపులటె = దేవతలా (ఇవి); నా = నాకు; కంటెను = వేరైన; వేలుపు = దేముడు; మఱిన్ = ఇంకను; ఎవ్వరు = ఎవరున్నారు; అనుచున్ = అనుచు; వికవికన్ = విరగబడి వికవిక అనుచు; నగి = నవ్వి; మా = మా యొక్క; వేలుపులగోడ = దేవతలను చిత్రించిన గోడ; పైన్ = మీద; ఓ = ఓహో; హేలావతి = విలాసవతీ; నీ = నీ యొక్క; తనూజుడు = పుత్రుడు; ఎంగిలి = మైల; చేసెను = పరచెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, February 23, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 208

పలికెడిది

1-18-క.
పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
          చెప్పబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతమా! కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువే చెప్పించేవాడా! చెప్పినందువల్ల భవభందాలు పరిహారమైపోతాయా! ఇంక మిగతావి పలకటం ఎందుకు అనవసరంగా! భాగవతాన్నే చెప్తాను.
బహుళ ప్రాచుర్యం గల ఈ పద్యం మన పోతన్నగారి శైలి, అలతిపొలతి పలుకులతో అతి హృద్యంగా అలరించే అద్భుత శైలికి ఒక చక్కటి ఉదాహరణ. భాగవతం తనంతట తనే పలుకుతుంది నేను సాధనం మాత్రమే అంటున్నాడు. రమింప చేసేవాడు భద్రత ఒసగే వాడు అయిన భగవంతుడు శ్రీరాముడే పలికిస్తుంటే చిలకలా నే పలుకుతా అంతే అంటు ఈ రామచక్కని పంచదార చిలక అందించాడు. స్వయంభూగా పలకబోతున్న సాక్షాత్ భగవత్ స్వరూపం వ్యక్తంకావటంలోని నిమిత్తపాత్రత మోక్షాన్ని ఇస్తుంది కదా. అంతకన్నా కావలసిందేం ఉంది. అందుకే మిగతావన్నీ పరిత్యజించేస్తాను. ఈ పని మాత్రమే చేస్తాను అంటు సన్యాసం స్వీకరిస్తున్నాడు. దానితో ఇచ్చేవాడు, ఇవ్వబడేది, తీసుకొనేవాడు మధ్య అబేధ్య సంయోగం ఏర్పడిందేమో. అందుకే పెద్దలు బాగుపడటానికి భాగవతం అంటారేమో. అందుకే కైవల్యపదంబు జేరుకునై అని గ్రందాన్ని ప్రారంభించాడు.
1-18-ka.
palikeDidi bhaagavata ma@MTa,
palikiMcheDivaaDu raamabhadruM Da@MTa, nae@M
balikina bhavahara maguna@MTa,
palikeda, vaeRoMDu gaatha baluka@Mga naelaa?
          పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~