Monday, January 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 184

రామున్

2-160-క.
రామున్ మేచకజలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసు
త్రామున్ దుష్టనిశాటవి
రామున్ బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్.
          నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు, సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.
2-160-ka.
raamun maechakajalada
Syaamun suguNaabhiraamu sadvaibhavasu
traamun dushTaniSaaTavi
raamun bommaniye@M baMktirathu@M DaDavulakun.
          రామున్ = రాముని; మేచక = నల్లని; జలద = మేఘము వంటి; శ్యామున్ = చాయ కలవానిని; సుగుణ = సుగుణములతో; అభిరామున్ = అందమైన వానిని; సత్ = మంచి, గొప్ప; వైభవ = వైభవముతో; సుత్రామున్ = దేవేంద్రుని వంటి వానిని {సుత్రాముడు – లోకములను లెస్సగా రక్షించువాడు, ఇంద్రుడు}; దుష్ట = చెడ్డ; నిశాటన్ = రాక్షసులను; విరామున్ = సంహరించిన వానిని; పొమ్ము = వెళ్ళుము; అనియెన్ = అనెను; పంక్తిరథుఁడు = దశరథుడు {పంక్తి - పది, దశ}; అడవులన్ = అడవుల; కున్ = కు;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, January 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 183

రావేసుందరి

10.1-773-శా.
రావే సుందరి! యేమె బోటి! వినవే; రాజీవనేత్రుండు బృం
దావీధిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో
భ్రూవిన్యాసము లంగుళీ క్రమములుం బొల్పార షడ్జంబుగాఁ
గావించెన్ నటుభంగి బ్రహ్మ మగు ద ద్గాంధర్వ సంగీతమున్.
          ఓ చక్కదనాల చిన్నదాన! ఇలారావే. ఏమే వింటున్నావా. బృందావన వీధిలో పద్మాక్షుడు మన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబౌమలాడిస్తూ వేణువుపై వేళ్ళవిన్యాసాలు వెలయిస్తూ నటునివలె షడ్జమస్వరంలో బహ్మగాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.
          అని బృందావనంలో కృష్ణుడు మన్మథోద్దీపితంగా వాయిస్తున్న మురళీగాన లోలులైన గోపికలు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నారు. అసలే బృందావనం బాగా పెద్దది, అతిశ్రేష్ఠమైనది, బహుమనోహరమైనది. శ్రీకృష్ణభగవానుల ఆకర్షణ చాలా ఎక్కువ, ఆలపిస్తున్నది పరబ్రహ్మం తానైన గాంధర్వగీతం, అది మనస్సును మథించి ఉద్దీపితం చేసేది, మరి గోపికలు గో (జ్ఞానం) ఓపిక ఎక్కు వున్నవాళ్ళుట. మరి వేగిరపాటు సహజమే కదా.
10.1-773-Saa.
raavae suMdari! yaeme bOTi! vinavae; raajeevanaetruMDu bRM
daaveedhiM daga vaeNu voo@Mduchu lasatsavyaanataasyaMbutO
bhroovinyaasamu laMguLee kramamuluM bolpaara shaDjaMbugaa@M
gaaviMchen naTubhaMgi brahma magu da dgaaMdharva saMgeetamun.
          రావే = రమ్ము; సుందరి = చక్కని చుక్క; ఏమె = ఒసేయ్; బోటి = వనితా; వినవే = వినుము; రాజీవనేత్రుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; బృందా = బృందావనము; వీధిన్ = దారులమ్మట; తగన్ = చక్కగా; వేణువున్ = మురళిని; ఊదుచున్ = పూరించుచు; లసత్ = తేటగాయున్న; సవ్య = ఎడమపక్కకు; ఆనత = వంచబడిన; ఆస్యంబు = మోము; తోన్ = తోటి; భ్రూ = కనుబొమల; విన్యాసములన్ = కదలించుటలతో; అంగుళీ = వేళ్ళ యొక్క; క్రమములున్ = వాడుటలోని లయలు; పొల్పారన్ = చక్కగా యుండు నట్లు; షడ్జంబున్ = షడ్జమ స్వరము; కాన్ = కలుగు నట్లు; కావించెన్ = చేసెను, పలికించెను; నటు = నటుని; భంగిన్ = వలె; బ్రహ్మము = గొప్పది, వేద మయ మైనది; అగు = ఐన; తత్ = ఆ యొక్క; గాంధర్వ = గంధర్వులు చేయు నట్టి; సంగీతమున్ = గానమును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, January 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 182

జనకసుతా

9-734-క.
జనకసుతాహృచ్చోరా!
జనకవచోలబ్దవిపిన శైలవిహారా!
జనకామితమందారా!
జనకాది మహీశ్వరాతిశయ సంచారా!
          జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. జనకమహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడికగల మహారాజువి. అయినట్టి శ్రీరామచంద్రప్రభు! నీకు వందనములు
పాదంలో రెండవ అక్షర నియమం ప్రాస కదా, అదే నియమాన్ని ప్రాసాక్షర ముందరి తరువాత కూడ పాటించిన తీరు, యతి స్థానాలు రెండు ఒకే అక్షరం వాడటం ఈ నవమ స్కంధాంత ప్రార్థన పద్యానికి ప్రత్యేక అందాన్ని ఇచ్చాయి.
9-734-ka.
janakasutaahRchchOraa!
janakavachOlabdavipina Sailavihaaraa!
janakaamitamaMdaaraa!
janakaadi maheeSvaraatiSaya saMchaaraa!
జనకసుతాహృచ్చోరా = శ్రీరామా {జనకసుతా హృచ్చోరుడు - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు}; జనక వచోలబ్ద విపిన శైల విహారా = శ్రీరామా {జనక వచోలబ్ద విపిన శైల విహారుడు - తండ్రి మాట జవదాటక కొండకోనలలో తిరిగినవాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందారుడు - ప్రజల కోరికలు తీర్చుటలో కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జనకాది మహీశ్వరాతిశయ సంచారా = శ్రీరామా {జనకాది మహీశ్వరాతిశయ సంచారుడు - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, January 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 181

వాచవి యైన

1-421-ఉ.
వాచవియైన గడ్డిఁ దిని వాహిను లందు జలంబు ద్రావఁగా
నీ చరణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁ జేసె వాఁడు దా
ఖేచరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్
వేచని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్.
          నోటికి రుచించిన గడ్డి పరకలు తిని, కాలవల్లో నీళ్ళు తాగి బతికే సాధు జీవివైన నీ పాదాలను ఇలా ఎవడు నరికేసాడు. వాడెవడైనా సరే వాడు భూమ్మీద తిరిగే వాడైనా, ఆకాశంలో తిరిగే వాడైనా సరే వాడి చేతులు మణికంకణాదులు అలంకరించుకొనేంత గొప్పవైతే వాటితో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా, నేలలో దూరిపోయినా సరే వదలనే వదలను.
భూదేవి ధర్మదేవతలు గో వృషభ రూపాలలో ఒక చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించటం వల్ల, ఇద్దరు దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలిమీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని చితక తన్నుతున్నాడు. పరీక్షిత్తు విధివశాత్తు ఇదంతా చూసాడు. కోపంతో కలిని నిగ్రహిస్తు, గో వృషభ రూపులను ఓదారుస్తు, వృషభ రూపునితో ఇలా అంటున్నాడు.
1-421-u.
vaachaviyaina gaDDi@M dini vaahinu laMdu jalaMbu draava@Mgaa
nee charaNaMbu levva@M DiTu nirdaLitaMbuga@M jaese vaa@MDu daa
khaecharu@MDaina, vaani maNi keelita bhooshaNa yukta baahulan
vaechani truMchivaitu vinuveethiki naegina naela Daa@Mginan.
          వాచవి = నోటికి రుచి; ఐన = అయినట్టి; గడ్డిన్ = గడ్డిని; తిని = తిని; వాహినులు = నదులు కాలువలు; అందున్ = అందు; జలంబున్ = నీరు; త్రావఁగా = తాగుచుండగ; నీ = నీయొక్క; చరణంబులు = పాదములను; ఎవ్వఁడు = ఎవడు; ఇటు = ఈ విధముగ; నిర్దళితంబుగన్ = ఖండితముగ; చేసెన్ = చేసెను; వాఁడు = వాడు; తాన్ = తాను; ఖేచరుఁడు = ఆకాశమున తిరుగు వాడు; ఐన = అయినప్పటికిని; వాని = వాని యొక్క; మణి = రత్నములు; కీలిత = చెక్కిన; భూషణ = అలంకారములతో; యుక్త = కూడిన; బాహువులన్ = చేతులను; వే చని = శ్రీఘ్రముగ వెళ్ళి; త్రుంచి = ఖండించి; వైతున్ = వేయుదును; విను = ఆకాశ; వీథి = మార్గము; కిన్ = కు; ఏగినన్ = వెళ్ళిన; నేలన్ = నేలలో; డాఁగినన్ = దాగికొనినను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~