Tuesday, November 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 124



karuNaakara

6-530-తో.
కరుణాకర! శ్రీకర! కంబుకరా!
శరణాగత సంగత జాడ్య హరా!
పరిరక్షిత శిక్షిత భక్త మురా!
కరిరాజ శుభప్రద! కాంతిధరా!
          కరుణకు ఆలవాలమైన వాడా! సంపదలను సమకూర్చే వాడ!శరణు జొచ్చిన భక్తుల కష్టాలు కడతేర్చెడి వాడా! ఆర్తులను కాపాడి మురాసుర ఆదులను సంహరించిన వాడా! గజరాజుకి మేలు ప్రసాదించిన వాడా!కాంతి మయ స్వరూపా! ప్రణామములు,
6-530-tO.
karuNaakara! Sreekara! kaMbukaraa!
SaraNaagata saMgata jaaDya haraa!
parirakshita Sikshita bhakta muraa!
kariraaja Subhaprada! kaaMtidharaa!
కరుణాకర = నారాయణ {కరుణాకరుడు - దయామయుడు, విష్ణువు}; శ్రీకర = నారాయణ {శ్రీకరుడు -శుభములను కలిగించెడి వాడు, విష్ణువు}; కంబుకరా = నారాయణ {కంబు కరుడు - కంబు (పాంచజన్యము యనెడి శంఖమును) కరుడు (చేత ధరించెడి వాడు), విష్ణువు}; శరణాగత సంగత జాడ్యహరా = నారాయణ {శరణాగత సంగత జాడ్యహరుడు - శరణు (శరణని) ఆగత (వచ్చిన వారికి) సంగత (కలిగిన) జాడ్య (కష్టములను) హరుడు (నశింప జేసెడి వాడు), విష్ణువు}; పరిరక్షిత శిక్షిత భక్త మురా = నారాయణ {పరిరక్షిత శిక్షిత భక్త మురా - పరిరక్షిత(చక్కగా కాపాడ బడెడి) శిక్షిత (శిక్షింప బడిన) భక్త (భక్తులు) ముర (మురాసుర ఆదులు) గల వాడు, విష్ణువు}; కరిరాజ శుభ ప్రద = నారాయణ {కరిరాజ శుభ ప్రదుడు - కరిరాజు (గజేంద్రుని)కి శుభ (శుభములు) ప్రదుడు (ఇచ్చెడి వాడు), విష్ణువు}; కాంతిధరా = నారాయణ {కాంతి ధరుడు - కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించు వాడు), విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, November 25, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 123



palukulu

8-309-క.
పలుకులు మధురసధారలు
దలఁపులు నానా ప్రకార దావానలముల్
చెలుములు సాలావృకములు
చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?
          అమృతం పంచమని అడుగుతున్న దానవులతో జగన్మోహిని పలుకులు – అందగత్తెల మాటలు తేనెలు కారుతుంటాయి. ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు. స్నేహాలు తోడేళ్ళు. అలాంటి వారిని విశ్వసించండం వేదసమ్మతం కాదు కదా.
8-309-ka.
palukulu madhurasadhaaralu
dala@Mpulu naanaa prakaara daavaanalamul
chelumulu saalaavRkamulu
cheluvala nammuTalu vaedasiddhaaMtamulae?
పలుకులు = మాటలు; మధు = తేనెల వంటి; రస = రుచులు; ధారలు = కారునవి; తలపులు = ఆలోచనలు; నానా = అనేక; ప్రకార = విధములైన; దావానలముల్ = కార్చిచ్చులు; చెలుములు = స్నేహములు; సాలావృకములు = నక్కలు; చెలువలన్ = అందగత్తెలను; నమ్ముటలు = విశ్వసించుట; వేదసిద్ధాంతములే = ప్రమాణికములా, కాదు కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, November 24, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 122



sarvaeSu@MDu

6-220-క.
సర్వేశుఁడు సర్వాత్ముఁడు
సర్వగతుం డచ్యుతుండు సర్వమయుండై
సర్వంబుఁ జేరి కొలువఁగ
సర్వగుఁడై దక్షునకుఁ బ్రసన్నుం డయ్యెన్.
          పునరుజ్జీవితు డైన దక్షుడు తాను చేసిన సృష్టికి సంతుష్టి చెందక శ్రీహరిని గూర్చి హంసగుహ్య స్తవరాజం కావించగా – సర్వమునకు ప్రభువు అయిన వాడు, సర్వము తానే అయినవాడు, సర్వు లందలి అంతరాత్మ అయిన వాడు సర్వం తాను అయ్యి సమస్త పరివారము సేవిస్తుండగా సమస్త మందు వ్యాపించిన వాడై పొరపడు టన్నది లేని శ్రీమహావిష్ణువు దక్షునకు దర్శన మిచ్చాడు.
6-220-ka.
sarvaeSu@MDu sarvaatmu@MDu
sarvagatuM DachyutuMDu sarvamayuMDai
sarvaMbu@M jaeri koluva@Mga
sarvagu@MDai dakshunaku@M brasannuM Dayyen.
          సర్వేశుడు = నారాయణుడు {సర్వేశుడు - సర్వ (సమస్తమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు}; సర్వ గతుండు = నారాయణుడు {సర్వగతుడు - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు}; అచ్యుతుండు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; సర్వ మయుండు = సర్వము తానైన వాడు {సర్వ మయుడు - సర్వము తానైన వాడు, విష్ణువు}; ఐ = అయ్యి; సర్వంబు = అందరు; చేరి = పూని; కొలువగన్ = సేవిస్తుండగా; సర్వగుడు = సర్వము నందు వ్యాపించినవాడు {సర్వగుడు - సర్వమునందు వ్యాపించినవాడు, విష్ణువు}; ఐ = అయ్యి; దక్షున్ = దక్షుని; కున్ = కి; ప్రసన్నుడు = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~