Tuesday, August 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_37



రవిబింబం


8-623-మ.
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
8-623-ma.
ravibiMbaM bupamiMpa@M baatra magu Chatra Mbai SirOratna mai
Srava NaalaMkRti yai gaLaabharaNa mai sauvarNa kaeyoora mai
Chavima tkaMkaNa mai kaTisthali nudaMcha dghaMTa yai noopura
pravaraM bai padapeeTha mai vaTu@MDu daa brahmaaMDamun^ niMDuchOn^.
            అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్దహస్తుడు అయిన మన పోతనా మాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమాన మైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు. - వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తిలా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలి అందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట.
        రవిబింబం బుపమింపఁ బాత్ర మగు - రవిబింబంబున్ = సూర్య బింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రం బై - ఛత్రంబు = గొడుగు; ఐ = వలె నయ్యి; శి రోరత్న మై - శిరోరత్నము = శిరసు పైని ఆభరణము; ఐ = వలె నయ్యి; శ్రవ ణాలంకృతి - శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; యై - ఐ = వలె నయ్యి; గ ళాభరణ మై - గళ = కంఠము నందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలె నయ్యి; సౌవర్ణ కేయూర మై - సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలె నయ్యి; ఛవిమ త్కంకణ మై - ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతి కంకణము; ఐ = వలె నయ్యి; కటిస్థలి నుదంచ ద్ఘంటయై - కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; ఐ = వలె నయ్యి; నూపుర = కాలి అందెల; ప్రవరం బై - ప్రవరంబు = పేరు; ఐ = వలె నయ్యి; పద పీఠ మై – పద పీఠంబు = పాద పీఠము; ఐ = అయ్యి; వటుఁడు దా - వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపిస్తున్న సమయంలో. 
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||


Monday, August 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_36

ఆఁకలి గొన్న క్రేపులు

6-400-ఉ.
ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీకలు రాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశ గతుం డగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో
శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నా మది గోరెడుం గదే.
6-400-u.
aa@Mkali gonna kraepulu rayaMbuna neekalu raani pakshulun^
deekoni tallikin^ ma~ri vidaeSa gatuM Dagu bharta kaMgaja
vyaakulachitta yaina javaraalunu datta~ra maMdu bhaMgi nO!
Sreekara! paMkajaaksha! ninu@M jaera@Mga naa madi gOreDuM gadae.
          వృత్రాసుర వృత్తాంతం భాగవత అంతరార్థానికి ఒక చక్కటి ఉదాహరణ, విశేష్ఠ మైన భక్తి పరాకాష్టను వివరించే చక్కటి కథ. వృత్రాసురుడు అరివీర భయంకర ప్రతాపం తో యుద్దం చేస్తున్నాడు. భగవంతుని అనుగ్రహం సంపాదించిన ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో సంహారం చేయ బోతున్నాడు. అప్పుడు వృత్రాసురుడు భగవంతుని చేసిన ప్రార్థన ఒకటి. – ఓ సకల శుభాల సంధానకర్తా! శ్రీహరీ! పుండరీకాక్ష! ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తుందో, నిరీక్షిస్తున్న రెక్కలు రాని పక్షిపిల్లలు తల్లి కోసం ఆత్రుతతో ఎలా ఎదురు చూస్తాయో ఇంకా విదేశ గతుడు అయినట్టి పతి కోసం విరహవ్యాకులత చెందిన సతి ఎలా ప్రతీక్షిస్తుందో అలా నీ కోసం, నీ సమాగమం కోసం నా మది ఉవ్విళ్ళూరు తున్నదయ్యా.
        ఆఁకలి గొన్న - ఆకలి = ఆకలి; కొన్న = వేస్తు న్నట్టి; క్రేపులు = దూడలు; రయంబున నీకలు రాని - రయంబునన్ = శ్రీఘ్రముగను; ఈకలు = రెక్కలు; రాని = రానట్టి; పక్షులున్ = పక్షిపిల్లలు; దీకొని = పూని; తల్లి కిన్ - తల్లి = తల్లి; కిన్ = కి; మఱి = మఱి; విదేశ గతుం డగు - విదేశ = పరాయి దేశములకు; గతుండు = వెళ్ళిన వాడు; అగు = అయిన; భర్త కంగజ - భర్తన్ = భర్త; కున్ = కోసము; అంగజ = మన్మథుని వలన; వ్యాకుల చిత్త యైన - వ్యాకుల = వ్యాకులమైన; చిత్త = మనసు గలది; ఐన = అయిన; జవరాలును దత్తఱ మందు - జవరాలునున్ = స్త్రీ; తత్తఱము = తొందర; అందు = పడెడి; భంగినో - భంగిన్ = వలెనే; ఓ = ఓ; శ్రీకర = హరి {శ్రీకర - శ్రీ (శుభములను) కర (కలిగించెడివాడ), విష్ణువు}; పంకజాక్ష = హరి {పంకజాక్షుడు - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నినుఁ జేరఁగ - నినున్ = నిన్ను; చేరగన్ = చేరవలె నని; నా మది గోరెడుం గదే - నా = నా యొక్క; మదిన్ = మనసులో; కోరెడుం గదే = కోరెదను గాక.
తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/   
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||