నారాయణీయము

శ్రీ రామ
::ఓం శ్రీ పరమాత్మనే నమః::
గరువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం
వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం||
నారాయణభట్టతిరికృతం
శ్రీమన్నారాయణీయము

ప్రథమ స్కంధము

ఒకటవ దశకము

భగవన్మహిమ
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం|
అస్పష్టం దృష్టమాత్రేపునరురు పురుషార్ధాత్మకంబ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానామ్||                          1
పరమాత్మ చిక్కటి జ్ఞాన ఆనంద స్వరూపుడు; దేశ, కాల, వస్తువులకు హద్దు ఐనవాడు; పోలికలకు అతీతమైనవాడు; సర్వవ్యాపకుడు; శాశ్వతమైన ముక్తి స్వరూపుడు; వందల, వేల కొలది వేదాలు సైతం ఆ దివ్యస్వరూపాన్ని చూపలేని వాడు; తెలుసుకోడానికి ఎంతగా ప్రయత్నించినా స్పష్టంగా తెలియరాని వాడు; పరమపురుషార్థమైనవాడు ఆ పరతత్వము; ఆ పరబ్రహ్మము అంశయే స్వయంగా గురువాయూరు పురము నందు వెలసి ఉన్నాడు. దర్శించుకునే ప్రజల భాగ్యాన్ని ఎంతని కొనియాడగలము.
ఏవందుర్లభ్యవస్తున్యపి  సులభతయా హస్తలబ్దే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్తై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధిశమేవాశ్రయామః॥                               2
ఇలా పరమాత్మ పరమ దుర్లభుడు ఐనప్పటికీ, చేతికందేంత చేరువగా ఈ పట్టణాన వెలసి ఉన్నాడు. పరమాత్మ ఇంత సులభుడైనప్పటికీ, కొందరు మానవులు తమ మనోవాక్కాయకర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్ధముగా కాలక్షేపం చేస్తున్నారు ఇది ఎంత శోచనీయము? కాని ఆ అనితరమైన పరమాత్మ, శ్రీకృష్ణుడిగా గురువాయూరు పట్టణమున స్పష్టంగా వెలసియున్నవాడు. ఆ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగుటకై స్థిరచిత్తముతో మనం ఆశ్రయిద్దాము.
సత్త్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్
తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిదర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహేతే                            3
 పరమాత్మా! నీ దివ్యశరీరము రజస్తమోగుణములు లేశమైనా లేనిది; మిక్కిలి నిర్మలమైనది; శుద్ధ సత్త్వ గుణము కల సకలభూత భూతేద్రింయాలకు మూలకారణం ఐనది, పంచభూతాత్మకమైనది అని వేదవ్యాసుడు అనేక మార్లు తెలిపాడు. ఆ విధముగా పరమ స్వచ్ఛము చిదానంద స్వరూపము ఐన నీ స్వరూప సౌందర్యముగురించి విన్నను స్మరించుకొన్నను మిక్కిలి ఆనందము కలుగును. అటువంటి నీ రూపమును భక్తుడు అతి సులభముగా దర్శించుకొంటాడు. కావున అదృష్టవంతులు నీ స్వరూపమును దర్శిస్తూ, స్మరిస్తూ గొప్ప ఆనందానుభూతిని పొందుతారు                                              (3)
నిష్కంపే నిత్యపూర్ణే నిరవధిపరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావళిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్।।                      4
పరబ్రహ్మము అపారమైన సముద్రమువంటిది కాని ఈరెండిటి మధ్య అనేకభేదములు పోలికలున్నవి పరబ్రహ్మసాగరము నిశ్చలముగాఉండును నిత్యపూర్ణమైనది అంతులేనిపరమానందమనే అమృతముతో నిండియున్నది ముక్తులైనఅనేకజీవులు ముత్యాలు మణులవంటివారు అట్టిజీవులతో ఆసాగరము సుందరముగాకనిపించును అట్టిపరబ్రహ్మసాగరమున పరిశుద్ధమైన సత్వ గుణము అలలవలె ఉండును శుద్ధసత్వస్వరూపుడవైన నీవు వస్తుత: నిష్కలుడవుగా ప్రకాశింతువు ఐనను ఓపరమాత్మా నీవుసకలకళాసహితుడవుగా ఆకారమునుధరించి కనిపించుచున్నావు అదియేనీగొప్పతనము                                                                                                 (4)
నిర్వ్యాపారోz పి నిష్కారణమజ। భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాzపి కల్పాదికాలే।
తస్యాస్సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
సత్త్వంధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠవైకుంఠ। రూపం।।                          5
పరమాత్మా నీవుఎట్టికర్మలనూ ఆచరింపవలసినపనిలేదు ఐననూ అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లు నీ కృపాకటాక్ష వీక్షణ ప్రాభావమున నీయందు విలీనమై: అసత్: స్వరూపమైన ప్రకృతి సృష్టి ప్రారంభకాలమగు కల్పాదియందు వ్యక్తమగుచున్నది ఆమాయయొక్క ఆవరణరహితమై పరిశుద్ధమైన అంశను సత్త్వము అనియందురు నీవుప్రకృతికి అతీతుడవు నీమహిమా ప్రభావముచే అకుంఠితమైన వైకుంఠరూపమున నీవువిలసిల్లుచున్నావు భక్తులను అనుగ్రహించుటకై ప్రకృతి విభూతులద్వారా నిన్నునీవు ప్రకటించుకొనుచున్నావు.   (5)
తత్తే ప్రత్యగ్ర ధారాధర లలిత కలాయావలీ కేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ ।
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందోహమంత;-
సించత్సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ।।                                           6
గురువాయూరు పురవాసా! శ్రీకృష్ణా! నీరూపమునూతనమేఘమువలె సుందరమైనది కలువపూవులవలె ఆనందపరవశులనుచేయునది. సౌందర్యమంతా రాశిపోసినట్లుకనిపించు నీదివ్యశరీరము సుకృతాత్ములకు పుణ్యఫలమువంటిది. ఆదిలక్ష్మీదేవి స్వేఛ్చగాఉండునివాసభూమి మధురాతిమధురమైన దివ్యరూపమును సదా ధ్యానించువారి మనస్సులందు అదిఅమృతధారలను కురిపించును. జగదానందకరము’ జగన్మోహనమునైన నీరూపమును నిరంతరమునేను ధ్యానముచేయుదును              (6)
కష్టా తే సృష్టి చేష్టా బహుతరభవఖేదావహా జీవభాజామ్
ఇత్యేవం పూర్వమాలోచితమజిత! మయా నైవమద్యాభిజానే।
నోచేజ్జీవా: కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ధ్రం
నైత్ర్తే: శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్।।                                   7
పరమాత్మా! నీ సృష్టి వలన జీవులకందరకు సంసారబంధమేర్పడుననియు.బాధలేకలుగుననియు అజ్ఞానమువల్ల తొలుతభావించాను కానిఇదివాస్తవముకాదు. జీవులపై నీకుఅపారమైన కృపకలదు యదార్ధముగా నీరూపముమిక్కిలి మనోహరమైనది. జ్ఞానామృతముతో ఆర్ద్రమైనది. లేనిచో ఆజీవులందరు తమభౌతికమైన కండ్లతో చూచుచూ మధురాతి మధురమైన నీదివ్యలీలా వర్ణనమును చెవులచే వినుచుపరమానంద డోలికలలో ఎందులకు తేలిపోవుదురు?                              (7)
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్ధితాన-
ప్యర్ధాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతించ
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫల: పారిజాతో హరే। త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమలభలషతి వ్యర్థివ్రజోzయమ్।।                                 8
శ్రీహరీ సకలప్రాణులకును అంతరాత్మవైనందున నీవుసర్వజన సులభుడవు. వినమ్రులైనవారికినీవు సంతతము సాక్షాత్కరించుచుందువు కోరకున్నను నీవువారిపాలిటకొంగుబంగారమై, నిరంతరమువారికోరికలను తీర్చుచుందువు. అంతేకాదువారికి పరమానందదాయకమైన మోక్షమును కూడాఅనుగ్రహించుచుందువు కనుక నీవు నిరవధికముగా మహాఫలములనుప్రసాదించెడి కల్పవృక్ష మవు- కొందఱుఅర్థులు నీమహత్యమునెఱుగక ఇంద్రునివనమునందలి కల్పవృక్షమును ఆశ్రయించుచుందురు ఇదివ్యర్థము. నీవిచ్చెడిఫలములు అనంతములు- అదిపరిమిత ఫలములనుమాత్రమే ఇచ్చును. కనుకనీముందు ఆపారిజాతవృక్షముఏపాటిది?         (8)
కారుణ్యాత్కామమన్యందదతి ఖలుపరే స్వాత్మదస్త్యంవిశేషాత్
ఐశ్వర్యాదీశతేzన్యే జగతి పరజనే స్వాత్మనోz పీశ్వరస్త్యమ్l
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనా: స్ఫీతభాగ్యా:
త్వం చాత్మారామ ఏవత్యతులగుణగణాధారా! శౌరే! నమస్తే।।                               9
ప్రభూ! బ్రహ్మాదిదేవతలు మోక్షమును దప్ప ఇతర ఫలములను మాత్రము ఇయ్యగలరు- కాని నీవైతే ఇతరఫలములతోపాటు మోక్షమును అనగా సాయుజ్యమును కూడాప్రసాదించెదవు. వారికి ఇతరులపై అధికారము ఉన్నను, వారిపై నీవేప్రభుడవు. కాని నీవో సర్వేశ్వరుడవు. నిన్ను శాసింపగలవాడుఇతరులులేరు నీపరబ్రహ్మ స్వరూపము అనుక్షణము మధురాతిమధురమైనది. అట్టినీయందు ధన్యాత్ములైనవారు సర్వదాఆనందించుచుందురు. నీవు ఆత్మారాముడవు, అనంతకల్యాణగుణములకు ఆధారమైనవాడవు.కృష్ణా! అట్టినీకుప్రణతులు.               (9)
ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం, విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం, విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం।
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి, న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్! మురహర! భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోz సి।।                          10
పవనపురాధీశా! మురారి! సమగ్రమైన అధికారము (ఐశ్వర్యము), సాటిలేనిపరాక్రమము, నిర్మలయశస్సు, సిరిసంపదలు(శ్రీ), సర్వజ్ఞత్వము, వైరాగ్యము, అను ఆఱులక్షణములు గలవాడేభగవంతుడు. నీవుబ్రహ్మాది దేవతలనుకూడానియమింపగల ప్రభుడవు. బ్రహ్మరుద్రాది దేవతల తేజస్సులను కూడామించిన తేజస్సునీది. నీ నిర్మలయశస్సును ఎట్టికోరికలను లేని సనకాదిమహర్షులు నిరంతరము కొనియాడుచుందురు. లక్ష్మీదేవి  సర్వదా నిన్నే ఆశ్రయించియుండును. నీవిసర్వజ్ఞుడవు. దేనియందునుఆశక్తిలేనివాడవు. అనగావైరాగ్యశోభితుడవు- కావున ‘భగవంతుడు’ అనుపేరునీకేతగును.                                                                                                     (10)

ఒకటవ దశకము సమాప్తము (1)

             2-    రెండవ దశకము

             భగవద్రూప భక్తిమహత్యము
 సూర్యస్పర్ధి కిరీట మూర్థ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్థ్రహసితోల్లాసం సునాసాపుటం
గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే।।    1
 కృష్ణా! నీ కిరీటమణికాంతులు సూర్యతేజస్సును మించినవి, ఫాలభాగమందలి కస్తూరితిలకము మిగుల మనోజ్ఞమైనది, నీ చూపులు సకలప్రాణులపై కృపను ప్రసరింపచేయుచుండును ప్రేమతో నిండిన నీ చిఱునవ్వు ఆహ్లాదకరమైనది నీనాసిక చూడముచ్చటగొలుపునది, అద్దములవంటి నీ చెక్కిళ్ళపై ప్రతిఫలించు మకరకుండముల కాంతులు మిక్కిలిమనోహరములు, నీ కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్యమానములు. నీ వక్ష: స్థలమునకల వనమాలలు, దివ్యహారములు, శ్రీవత్సచిహ్నము అపూర్వములు.అట్టి నీ దివ్య రూపమును నేను ధ్యానించెదను       (1)
కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగులీయాంకిత-
శ్రీమద్భాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహం.
కాంచిత్కాంచనకాంచిలాంఛితలసత్పీతాంబరాలంబినీం
ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం।।  2
జగన్నాధా నీ నాలుగు బాహువులయందలి శంఖ చక్ర గదా పద్మముల శోభలు దివ్యములు, నీవుధరించిన భుజకీర్తులు, దండకడియములు, కంకణములు అంగుళీయకములు చక్కనికాంతులను వెల్లివిరియజేయుచున్నవి. నీ బంగారు కటిఆభరణము యొక్కమిలమిలలు, నీ పట్టుపీతాంబరములయొక్క నిగనిగలు ఎంతయు ఆహ్లాద కరములు , నీ పవిత్రపాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి. దివ్యమైన నీమూర్తి భక్తుల ఆర్తులను రూపుమాపును- అట్టి నీమహాద్రూపమును నేను ఆశ్రయింతును.   (2)
యత్త్రైలోక్యమహీయసోz పి మహితం సమ్మోహనం మోహనాత్
కాంతం కాంతినిధానతోz పి మధురం మాధుర్యధురాదపి।
సౌందర్యోత్రతోz పి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతో-
zప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో! విభో!    (3)
సమస్తలోకములందు వ్యాపించియున్న శ్రీమహావిష్ణూ! భగవన్! నీరూపము మూడులోకములందున్న వస్తువులన్నిటికంటే మహత్తరమైనది. మోహమును కలిగించువాటికంటే మిక్కిలిమోహనమైనది  కాంతికలవానికంటె గొప్పకాంతికలది. మధురమైనవాటికంటె మిగులమధురమైనది. సుందరమైనవస్తువులన్నిటికంటె ఎంతయుసుందరమైనది. ఆశ్చర్యమును కలిగించు వస్తువులన్నిటికంటె గొప్పఆశ్చర్యముకలిగించును. అట్టి నీదివ్యరూపమును దర్శించుటకు ఎవ్వరు కుతూహలపడరు?   (3)
తత్ తాదృజ్మధురాత్మకం, తవ  వపు: సంప్రాప్య సంపన్మయీ
సాదేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి।
 తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ ।। 4
ప్రభు సకల సంపదలకు కుదురైన లక్ష్మీదేవి అద్భుతములైన నీ అందచందములకును, నీ కల్యాణ గుణములకును ఆకర్షితురాలై నీయందే స్థిరముగానిలచియున్నది.అందువలనఆదేవి నీభక్తులదగ్గఱ ఎక్కువకాలము నిలిచియుండుటలేదు. కావున మనోజ్ఞమైన నీరూపవైభవముపైగల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమయొద్ద నిలుకడ కలిగియుండకపోవుటచే వారు ఆదేవిని ‘చపల’ అని పేర్కొనుచున్నారు. స్వామీ!ఇది ఎంతశోచనీయము?  (4)
లక్ష్మీస్తావకరమణీయకహృతైవేయం   పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే!
యే. త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా:
తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా।।   5
లక్ష్మీపతీ! నీరమణీయ రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి  నీ యందు స్థిరముగాఉండుటసరే! అంతేకాదు ఆదేవికి నీపైగలఅనురాగకారణముగా ఆమె తనస్వామివైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు, నీగుణములను కీర్తించుచు పరవశించిపోవుచుండుటచూచి వారిదగ్రకూడ స్థిరముగాఉండును. నీ భక్తులుకానివారియెడ ఆదేవి నిలిచియుండదనుటకు ఇదిమఱియొకతార్కాణము.    (5)
ఏవంభూతమనోజ్ఞతా  నవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్।
 సద్య: ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం
వ్యాసించత్యపి. శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవై:।।  6
ప్రభూ! నీ రూపలావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమున వర్షింపజేయును. అదిపరమ చిదానందరసమునకు నిలయము. వినువారి చిత్తములను హరించివేయును. బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిల్లజేయును. శరీరములకు గగుర్పాటు  గూర్చును. ఆనంద పారవశ్యములచేకలిగిన శీతలబాష్పధారలచే వారిశరీరములనుతడిపివేయును.    (6)
ఏవంభూతతయా హి భక్య్తభిహితో యోగస్సయోగద్వయాత్
కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే!
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్ర్శమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా!   7
 రమాపతీ! నీవుసౌందర్య ఆనందస్వరూపుడవు. నీయందు గాఢమైన ప్రేమతో నిండినభక్తి, సామాన్యులకు సైతము ఈలోకమున ఎట్టిశ్రమలేకుండ సులభముగనేలభించును. అందువలననేకర్మ, జ్ఞాన యోగములకంటెను భక్తియోగము మిగుల ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తిచాటుతున్నారు   (7)
నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పున: ।
తత్వ్తవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో!
త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం సాద్వీయసీ శ్రేయసీ।।  8
ధర్మశాస్త్రములందు ఆయావర్ణాశ్రమములకు చెందినవారికై చెప్పబడిన నిత్యనైమిత్తిక కర్మలను విధిగాఆచరించుచు వాటివల్ల కలుగు ఫలితమునే మాత్రము ఆశింపకుండుట కర్మయోగమనబడును.ఇట్టి కర్మయోగము వలన ఫలితమునచాలాఆలస్యముగాలభించును. అట్లే ఉపనిషత్తులందుచెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగాలభించదు. కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలకష్టపడవలెను. స్వామీ! పైరెండింటికంటె  నిన్ను గాఢముగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది. రుచికరమైనది. పైగాశ్రేయస్కరమైనది   (8)
అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య  నిర్యన్మలా
బోధే భక్తిపథేzథవాz ప్యుచితతామాయాంతికిం తావతా!
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున:
చిత్తార్ధ్రత్వమృతే విచింత్య బహుభిస్సిధ్యంతి జన్మాంతరై:।।  9
స్వామీ! నిత్యనైమిత్తిక కర్మలను నియమబద్ధముగా చేయవలెనన్నచో చాలకష్టముకలుగును. ఆవిధముగామిక్కిలి కష్టముతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకుదూరమైనవారు తమతమ యోగ్యతలననుసరించి జ్ఞానమార్గమున లేక భక్తిమార్గమున ప్రవేశించుచున్నారు. మరికొందరు జ్ఞానమార్గమున అనేకకష్టములననుభవించుచు చిత్తార్ధ్రరూపమైన ప్రేమభావము లేక మననము, నిదిధ్యాసనము మొదలగువాటిద్వారా అనేకజన్మల తర్వాతమాత్రమే పరబ్రహ్మస్వరూపుడవైననిన్ను పొందుచున్నారు.( ఇచ్చటకూడభక్తియోగముకంటె కర్మజ్ఞానయోగములు చాలా కష్టమైనవి అని తెల్పబడినది.).   (9)
త్వద్భక్తిస్తు కధారసామృతఝరీనిర్మజ్జనేన. స్వయం
సిద్ధ్యంతీ   విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ।
సద్యస్సిద్ధికరీ జయత్యయి విభో! సైవాస్తుమే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్థ్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర!।।  10
గురువాయూరప్పా! శ్రీకృష్ణా! నీసుమధురమైన కధారస ప్రవాహమున మునిగినచో నీ భక్తి అతిసులభముగా లభించును. సుందరమైననీకధలను వినుటచేత నిర్మలమైనజ్ఞానము కూడ మిక్కిలి సులభముగాసిద్ధించును.దానివలన భక్తుడు తానుకోరుకొన్నకోరికలఫలములనుకూడవెంటనేపొందగలుగుచున్నాడు.పరమాత్మా!  అందువలన నీపాద భక్తివలన నామనస్సు మిక్కిలిశీఘ్రముగా ఆనందామృతమున మునిగి పరవశించునట్లుచేయుము.   (10)
రెండవ దశకము సమాప్తము (2)

3 వ. దశకము

భక్తి స్వరూప వర్ణనము- భక్తికై ప్రార్థన
 పఠంతో. నామాని ప్రమదభరసింధౌ నిపతితా:
స్మరంతో రూపంతే వరద కధయంతో గుణకధా:
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్
అహం ధన్వాన్ మన్యే సమధిగతసర్వాభిలషితాన్।।   1
భక్తులకోరికలను తీర్చుకన్నయ్యా! నీ భక్తులు నీదివ్య నామములను పఠించుచు, నీపరమసుందర రూపమును స్మరించుచున్నారు. అట్లే కల్యాణ గుణములుకల నీదివ్యగాధలను గానముచేయుచూ ఆనంద సముద్రమునఓలలాడుచూ ఈభూమండలముపైతిరుగుచుందురు. నిన్నుసదా ధ్యానించుచున్న భక్తులయొక్క కోరికలనన్నిటిని నీవు కరుణతో తీర్చెదవు.కావునకోరికలన్నీ తీరి పరమానందమున ఓలలాడు నీభక్తులు పరమధన్యులని నేనుభావింతును.   (1)
గదక్లిష్టం  కష్టం తవ చరణసేవారసభరే-
zప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో! కురుదయామ్
భవత్పాదాంభోజస్మరణరసికో. నామానివహన్
అహంగాయం గాయం కుహచన వివత్స్యామి విజనే।।  2
శ్రీమన్నారాయణా! నీ పాదపద్మాలను భక్తితో సేవింపదలచితిని. కాని అనారోగ్ముచే బాధపడుచున్న నా మనస్సు అందులకువిముఖముగాఉన్నది. ఏమిచేయుదునుప్రభూ! అందువలన నీవు నాపై దయనుచూపించినచో నీపాదపద్మములను అనన్యభక్తితో సేవించుచూ ఏకాంతమున వీదివ్య నామములను అనుక్షణము ఆనందముతో గానముచేయుచుఉందును.  (2)

కృపా తే జాతా చేత కిమివ నహి లభ్యం తుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా.  నామ  కియతీ
న కే కే లోకేస్మిన్ననిశమయి.  శోకాభిరహితా
భవద్భక్తా. ముక్తా: సుఖగతిమసక్తా విదధతే।।   3
స్వామీ! నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్దించనిది ఏమిఉండును? అందువలన నారోగబాధానివారణమనునది నీకుచాలాస్వల్పమైనవిషయము. నీ అనుగ్రహము వలననే ఎట్టికోరికలులేని ( అనాసక్తులైన) నీభక్తులు ఎల్లపుడు దు: ఖము ఏ మాత్రమూలేక ముక్తినిపొంది శాశ్వతసుఖముననుభవించుచున్నారుకదా!   (3)
మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖా:
చరంతీశ! స్త్వైరం సతతపరినిర్భాతపరచిత్
సదానందాద్వైత ప్రసరపరిమగ్నా: కీమపరమ్।।  4
ప్రభూ!ఆత్మజ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులు నీ పాదపద్మములనన సదాస్మరించుచున్నందువలన ఎట్టిబాధలును లేక సచ్చిదానందమున సదానిమగ్నులై స్వేచ్ఛగా సంచరించుచున్నారు. వారికిఇంతకంటె కావలసినదేమికలదు?   (4)
భవద్భక్తి: స్పీతా భవతు మమ సైవ ప్రశమయేత్
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా।
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్నిధ్యా రధ్యాపురుషవచనప్రాయమఖిలమ్।।   5
స్వామీ! నాకు నీ చరణారవిందములపై భక్తిమిక్కిలి దృఢముగా కలుగునట్లు దయతోఅనుగ్రహింపుము. ఆభక్తి నాసమస్తబాధలను తప్పక దూరముచేయును.ఇందునాకెట్టిసందేహములేదు. కానిచో భగవద్గీత మొదలైనగ్రంధములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు, వేదములందుచెప్పబడిన వాక్కులు అన్నియు, త్రోవలో కలిసినపుడు మాట్లాడుచిల్లర జనముయొక్క మాటలవలెవ్యర్థమగును.( కావున నీయనుగ్రహము వలన నాకు రోగబాధ అంతయు తప్పక తొలగును.  (5)
భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా  త్వద్గుణరసాత్
కిమప్యారూఢా   చేదఖిలపరితాపశ్రమనీ।
పునశ్చాంతే స్వాంతే. విమలపరిబోధోదయమిల
న్మహానందాద్వైతం దిశతి కిమత:  ప్రార్థ్యమపరమ్।।   6
ప్రభూ!  నీ చరణారవిందములయందలి భక్తి నీ గుణరసానందానుభవమువలన మధురాతి మధురమైనది. అట్టి భక్తి క్రమక్రమముగాపెరిగినచో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన సమస్త తాపములునశించును. అట్లే చివరకు నిర్మలమైన జ్ఞానోదయముకలిగి బ్రహ్మానందమున ఓలలాడుటకూడజరుగును. మానవునకు ఇంతకంటే కోరుకోవలసినదేమికలదు? ( అందువలన స్వామీ! నాకు నీభక్తిని మాత్రము అనుగ్పహింపుము).  (6)
విధూయ. క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
 భవత్ క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ।
భవన్మూర్త్యా లోకే నయనమధ తే పాదతులసీ-
 పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే।।   7
 స్వామీ! నాబాధలనన్నిటిని దూరముచేసి, నాపాదములు నీదివ్య క్షేత్రమును చేరునట్లు, నాచేతులు నిన్నుపూజించునట్లు, నానేత్రములు నీదివ్యమైనరూపమును సందర్శించునట్లు, నా ఘ్రాణేంద్రియము నీపాదములందున్న తులసినిఆఘ్రాణించునట్లు, నాచెవులు మధురాతిమధురమైన నీగాధలను మిక్కిలిభక్తితో వినునట్లు అనుగ్రహింపుము. ఆవిధముగానేను ఆనందానుభూతిని పొందెదను. (7)
ప్రభూతాధివ్యాధిప్రసభచలితే. nమామకహృది
త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్।
ఉదంచద్రోమాంచో.   గలితబహుహర్షాశ్రునివహో
యధా. విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్।।  8
స్వామీ! మిక్కుటమైన శరీరవ్యాధులతో, మానసికబాధలచే మిక్కిలిచంచలమైన నాహృదయమునందు పరమానందదాయకమైన నీ మనోహర రూపము ఉదయించునట్లుచేయుము. అందువల్ల ఆనందామృతమందు మగ్నుడనై శరీరమంతయు గగుర్పాటు చెందగా ఆనందాశ్రువులు జాలువారగా ఏమాత్రము తగ్గని సమస్తబాధలను సహితము మరచిపోవుదును.   (8)
మరుద్గేహాధీశ! త్వయి ఖలు పరాంచోz పి సుఖినో
భవత్ స్నేహీ సోzహం సుబహు పరితప్యే చ కిమిదమ్।
అకీర్తిస్తే మా zభూద్వరద!  గదాభారం. ప్రశమయన్
భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన!  9
గురువాయూరప్పా! కంసదమనా! నీయెడ ఏమాత్రము భక్తిలేనివారు సుఖములనుభవించుచున్నారు. కాని నీయందు సంపూర్ణానురాగము కలనేనుమాత్రము ఈవిధముగా రోగముతోబాధపడుచున్నాను. ఇదేమిచిత్రము? భక్తులుకోరిన వరములనొసగుస్వామీ! దీనివలన నీకు అపకీర్తికలుగునయ్యా! అది సముచితము కాదుకదా! దయతోనారోగభారమునుతగ్గించివెంటనే నన్నునీభక్తులలోశ్రేష్ఠునిగాచేయుము.  (9)
కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం. తావద్దేవ! ప్రహితవివిధార్తప్రలపిత:।
పుర: క్లుప్తేపాదే వరద! తవ నేష్యామి దివసాన్
యధాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్।।   10
భక్తులుకోరిన వరములనొసగు ఓస్వామీ! ఇంకా అతిగా నాబాధలు చెప్పుకొనుట అనవసరము. నాకుకలిగిన రోగబాధలవల్ల వ్యర్థముగా ప్రలాపనలుచేయుచుంటిని. వాటినిమానుకుని నీకుదయకలుగునంతవరకు నాశక్తిమేరకు నీదగ్గరనతులు( నమస్కారములు) నుతులు( స్తుతులు) సేవలుచేయుచు దినములనుగడుపుటకు నేనునిశ్చయించుకుంటిని. ఇదితధ్యము.( ఈశ్లోకమున ఆత్మసమర్పణకనిపించును.)
తృతీయ దశకము సమాప్తము (3)

ప్రధమస్కంధపరిచ్ఛేదము సమాప్తము

        ద్వితీయ స్కంధపరిచ్ఛేదము
          4 వ దశకము
        అష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము

కల్యతాం మమకురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా।
స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టి మాప్నుయాం।।1।।
ప్రభూ! నిన్ను చక్కగాఉపాసించుటకు తగినఆరోగ్యమును నాకు ప్రసాదింపుము. అష్టాంగయోగమును సంపూర్ణముగా అనుష్ఠించుటవలన నీ అనుగ్రహమును త్వరగా తప్పకపొందగలను అనివిశ్వసించుచున్నాను.(1)
బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమై: ఆప్లవాదినియమైశ్చపావితా: ।
కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరా: ।।2।।
స్వామీ! మీభక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యము, ప్రతిదినము స్నానము మొదలైన యమనియమములచేత పవిత్రములై సుఖాసనమునలేక పద్మాసనమున స్థిరముగా కూర్చొని యోగమునభ్యసింతుము. (2)
తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలా:।
ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖా: ।।3।।
ప్రభూ! మేము మనస్సునందు ఓంకారము ను ధ్యానించుచు ప్రాణాయామమునాచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలులమై ఇంద్రియములను విషయములనుండి మరల్చి నీయుపాసనచేయుదుము.(3)
అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహు:
తేన భక్తిరసమంతరార్థ్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకా:।।4।।
స్వామీ! నీ స్వరూపమును ధ్యానించుచున్నాము. ఐనను అదిమాకు స్పష్టముగా గోచరమగుటలేదు. కనుక బుద్ధిద్వారా పదేపదే ప్రయత్నపూర్వకముగా ధారణచేసెదము ఈసాధనవలనను, నీపాదపద్మములను నిరంతరము చింతించుచుండుటవలనను, భక్తిరసములో మునకలిడుచుందుము.(4)

విస్ఫుటావయవ భేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్; ।
అశ్రమం మనసి చింయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయా:।।5।।
ప్రభూనీపాదపద్మములనుఆశ్రయించి ఎంతోకాలము ధారణచేయుచు ధ్యానయోగమున నిరతులమగుదము. తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీస్వరూపము మాహృదయములందు స్థిరముగా నిలచియుండును. అప్పుడు ఎట్టిశ్రమయులేకుండగనే నీ స్వరూపమును మనస్సున ధ్యానించెదము.(5)
ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం।
సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి! తే z వభాసతే।।6।।
పరమాత్మా ! సమస్తకళలతో శోభిల్లుచున్న ఇట్టినీమూర్తిని ధ్యానించువారిహృదయములలో అదిగోచరమగుటచే వారుపరవసించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ స్వరూపము వారిహృదయములలో భావసమానమగును.(6)
తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక!
ఆశ్రితా: పునరత: పరిచ్యుతావారభేమహి చ ధారణాదికమ్।।7।।
జగన్నాయకా! సర్వాంగశోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమైయుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏకారణము వలననైనను ఆసమాధిస్థితినుండిజాఱినచో మఱల నీపాదములనాశ్రయించి, ధారణ ధ్యానాదులను ఆరంభించెదము.(7)
ఇత్థమభ్యసననిర్భరోల్లసత్ త్వత్పరాత్మసుఖకల్పితోత్సవా:
ముక్తభక్తకులమౌలితాం గతా: సంచరేమ శుకనారదాదివత్।। (8)
ప్రభూ ప్రగాఢమైనభ భక్తితో ఇట్లు సాధనచేయుటవలన ఆత్యంతిక సుఖానుభూతిలోఓలలాడుదము. అప్పుడు జీవన్ముక్తులుగా, భక్తశిరోమణులు ఐన శుకనారదాదులవలె మేము నిరాసక్తులమై సంచరించెదము. (8)
త్వత్సమాధి విజయే తు య: పునర్మజ్ క్షు మోక్షరసిక: క్రమేణ వా।
యోగవశ్యమనిలం షడాశ్రయై: ఉన్నయత్యజ! సుషుమ్ణయా శనై:।।9।।

జన్మరహితుడవైన పరమాత్మా! ఈవిధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే, లేక కాలక్రమేణా మోక్షతత్పరులమగుదము. అప్పుడు అష్టాంగయోగముద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకుని మూలాధారాది షట్చక్రములను సుషుమ్నమను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొనివచ్చెదము.(9)
లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహ:।
ఊర్థ్వలోకకుతుకీ తు మూర్ధత: సార్ధమేవ కరణైర్నిరీయతే ।।10।।
కృష్ణా! ఇట్టిసమాధిస్థితికి చేరినవారిలో సద్యోముక్తిని కోరుకొనెడివారు లింగ( సూక్ష్మ) శరీరమునుకూడ పరిత్యజించి, పరాత్పరుడవైన నీయందులీనమగుదురు.అనగా సాయుజ్యముక్తిని పొందుదురు. ఆవిధముగాకాక మఱికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వ లోక వైభవములను చూచుటకు కుతూహలపడువారు ప్రాణములను బ్రహ్మరంధ్రముద్వారా వదలి, ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేరుచున్నారు.(10
అగ్నివాసరవలర్ క్షపక్షగై:  ఉత్తరాయణజుషా చ దైవతై:।
ప్రాపితో రవిపదం భవత్సరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే ।।11।।
స్వామీ! సద్యోముక్తిని గోరెడివారు అగ్ని, దిన( వాసర) శుక్లపక్ష, ఉత్తరాయణ- అధిష్ఠానదేవతలద్వారా( అర్చిరాది మార్గముద్వారా) సూర్యలోకముపొందుదురు. అచటసంతతము భవత్పరాయణులై ధ్రువపదమునుజేరుదురు.(11)
అస్థితోz థ మహారాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే।
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధస: పదమత: పురైవ  వా।।12।।
ప్రభూ ! ధ్రువమండలమును చేరినతర్వాత నిన్నుసదా ఆశ్రయించి యున్నభక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుస్సుకల భృగువు మొదలైన మహర్షులుండెడి మహర్లోకమును చేరుకొనును. అక్కడనుండి  పోవునపుడు ఆదిశేషుని వేయి ముఖములనుండి వెల్వడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలలయందు మ్రగ్గుచూ క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనును. నీ పరమానుగ్రహమువలన  ఆభక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడిబాధలుచెందకుండా ముందుగానే  బ్రహ్మలోకమును కూడ చేరుకొనవచ్చును.(12)
తత్ర వా తవ పదేz థవా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం।
స్వేచ్ఛయా ఖలుపురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా।।13
పరమాత్మా! బ్రహ్మలోకమగు సత్యలోకమున లేకనీవుండెడి విష్ణులోకమున ఉండి బ్రహ్మప్రళయమను ప్రాకృత ప్రళయమేర్పడినపుడు బ్రహ్మదేవునితో కలసి నీ భక్తుడు ముక్తినిపొందును. లేక బ్రహ్మాదిలోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకుముందే యోగబలముచేత బ్రహ్మాండ భాండమును భేదించుకుని మోక్షమునందును.(13)
తస్య  చ క్షితిపయోమహోz  నిలద్యో. మహాత్ప్రకృతిసప్తకావృతీ।
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి. తే పదమనావృతం విభో! ।।14
ప్రభూ! యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అను పంచభూతములు, మహత్తత్త్వము( ఇందు అహంకారము కూడాచేరును) మూలప్రకృతి( మాయ) అనుబ్రహ్మాండమునకు సంబంధించిన ఏడుఆవరణములందు ఆయా ఆవరణరూపమున ప్రవేశించును. అచ్చట పరమానందము ననుభవించి చివరకు ఎట్టిఆవరణము లేనినీవుండు ప్రదేశమునుచేరుకొనును.(14)
అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే!
సచ్చిదాత్మక! భవద్గుణోదయానుచ్ఛరంతమనిలేశ! పాహి మామ్।।15
జగన్నాయకా! సచ్చిదానందస్వరూపా! గురువాయూరు పురాధినాధా! శ్రీకృష్ణా! ఈవిధముగా అర్చిరాది మార్గమున ( తేజోమార్గమున) పోయిన యోగీశ్వరుడు అచ్చట చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు. అతడునిత్యముక్తుడగును. స్వామీ! ఈవిధముగా నీకల్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధలనుండి కరుణతో రక్షింపుము.(15)

          అష్టాంగయోగము, యోగసిద్ధి- అను నాలుగవ దశకము సమాప్తము.
x

No comments: