Friday, February 9, 2018

నీలకంఠ వైభవం - 5

8-220-క.
వారలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యారతుఁడై చంద్రచూడుఁ డవసర మిచ్చెన్.
8-221-వ.
అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.

భావము:
అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=220

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: