Wednesday, December 13, 2017

పోతన రామాయణం - 56

9-364-వ.
ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.

భావము:
శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్దంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=364

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: