Thursday, July 20, 2017

దక్ష యాగము - 94

4-201-మ.
"హర పంకేజభ వామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో
యరవిందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశ సంభూతులై
పరఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్; దేవ! యీ
శ్వర! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవా! శ్రీశ! రక్షింపుమా."
4-202-వ.
విద్యాధరు లిట్లనిరి.

టీకా:
హర = శివుడు; పంకేజభవ = బ్రహ్మదేవుడు; అమర = దేవతలు; ఆదులు = మొదలగువారు; మరీచి = మరీచి; ఆది = మొదలగు; ప్రజానాథులు = ప్రజాపతులు; ఓ = ఓ; అరవిందాక్ష = విష్ణుమూర్తి; రమాహృదీశ = విష్ణుమూర్తి; భవదీయ = నీ యొక్క; అంశ = భాగములో; అంశ = భాగమున; సంభూతులు = జనించినవారు; పరగన్ = ప్రసిద్దముగ; తావక = నీ యొక్క; లీల = లీలకొరకు; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లు; ఈ = ఈ; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; దేవ = హరి; ఈశ్వర = హరి; నీకున్ = నీకు; ఏము = మేము; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; దేవా = హరి; శ్రీశ = హరి {శ్రీశ - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు)కి ఈశ (ప్రభువు), విష్ణువు}; రక్షింపుమా = కాపాడుము. విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“కమలలోచనా! లక్ష్మీహృదయేశ్వరా! దేవా! ఈశ్వరా! శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాలచేత జన్మించారు.ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. మమ్మల్ని పాలించు.” విద్యాధరులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=201

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: