Saturday, July 1, 2017

దక్ష యాగము - 76:

4-166-చ.
మఱియును రాజహంస రుచిమద్భ్రమణీకృత తాలవృంత చా
మరములు వీవఁగా దివిజమానిను లచ్చసుధామరీచి వి
స్ఫురణ సితాతపత్ర రుచిపుంజము దిక్కులఁ బిక్కటిల్లఁగాఁ
గరివరదుండు వచ్చె సుభగస్తుతి వర్ణ సుపర్ణయానుఁడై.

టీకా:
మఱియును = ఇంకనూ; రాజహంస = రాజహంస వలె; రుచిమత్ = మెరుస్తూ; భ్రమణీకృత = తిరుగుతున్న; తాలవృంత = తాటియాకు; చామరములు = విసనకర్రలు; వీవగా = వీస్తుండగ; దివిజ = దేవతా; మానినులు = స్త్రీలు; అచ్చ = స్వచ్చమైన; సుధా = చంద్రుని; మరీచి = వెన్నెలలా; విస్పురణన్ = మెరుస్తున్న; సిత = తెల్లని; అతపత్ర = గొడుగు; రుచి = కాంతుల; పుంజము = సమూహము; దిక్కులన్ = దిక్కులమ్మట; పిక్కటిల్లగ = నిండగ; కరివరదుండు = విష్ణుమూర్తి {కరివరదుడు - కరి (గజేంద్రుని)కి వరదుడు (వరము ప్రసాదించినవాడు), హరి}; వచ్చెన్ = వచ్చెను; సుభగ = సౌభాగ్యకరమైన; స్తుతి = స్తుతుల, చక్కటి; వర్ణ = వర్ణింపబడు, రంగుకల; సుపర్ణ = గరుత్మంతునిపై {సుపర్ణుడు - సు (మంచి) పర్ణుడు (రెక్కలుకలవాడు) గరుత్మంతుడు}; యానుడు = విహరించువాడు; ఐ = అయ్యి.

భావము:
ఇంకా దేవతాస్త్రీలు రాజహంసలవలె తెల్లనైన విసనకర్రలతో, వింజామరలతో వీస్తూ ఉండగా, పున్నమనాటి చంద్రబింబం వంటి తెల్లని గొడుగు కాంతులు దిక్కులందు వ్యాపించగా కరివరదుడైన హరి గరుడవాహన మెక్కి అక్కడికి వచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=163

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: