Saturday, July 22, 2017

దక్ష యాగము - 96

4-204-వ.
బ్రాహ్మణజనంబు లిట్లనిరి "దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భాపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరియించు చందంబున రసాతలగత యైన భూమి నెత్తితివి; అట్టి యోగిజనస్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునొందు; నట్టి నీకు నమస్కరింతుము."
4-205-క.
అని తన్ను సకల జనములు
వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం
చిన యా దక్షుని యజ్ఞము
ఘనముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్.
4-206-క.
సకలాత్ముఁడు దా నగుటను
సకల హవిర్భోక్త యయ్యు జలజాక్షుండుం
బ్రకటస్వభాగమున న
య్యకళంకుఁడు తృప్తిఁ బొంది యనె దక్షునితోన్.

టీకా:
బ్రాహ్మణ = బ్రాహ్మణులు యైన; జనులు = వారు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడ; ఈ = ఈ; క్రతువును = యజ్ఞమును; హవ్యంబును = హవ్యము; అగ్నియు = అగ్ని; మంత్రంబులును = మంత్రములు; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిద్దమైన; దర్భా = దర్భలు; పాత్రంబులును = పాత్రలును; సదస్యులును = సదస్యులును; ఋత్విక్కులును = ఋత్విక్కులు; దంపతులును = యజమాన దంపతులు; దేవతలును = దేవతలు; అగ్నిహోత్రంబులును = అగ్నిహోత్రములు; స్వధయు = స్వధ {స్వధ - తనను తాను ధరించి పోషించునది, పితృదేవతల ఆహారము}; సోమంబును = సోమరసము; ఆజ్యంబును = నెయ్యి; పశువును = బలిపశువు; నీవ = నీవే; నీవు = నీవు; తొల్లి = పూర్వము; వేద = వేదముతో; మయ = నిండిన; సూకర = వరాహ; ఆకారంబు = రూపము; ధరియించి = ధరించి; దంష్ట్రా = కోరలు అనెడి; దండంబునన్ = కర్రలతో; వారణ = ఏనుగులలో; ఇంద్రంబున్ = శ్రేష్టమైనది; నళినంబున్ = తామరపూలను; ధరియించు = ధరించు; చందంబునన్ = విధముగ; రసాతల = రసాతలము, పాతాళము నకు; గత = పోయినది; ఐన = అయిన; భూమిని = భూమిని; ఎత్తితివి = ఎత్తావు; అట్టి = అటువంటి; యోగి = యోగులైన; జన = వారిచేత; స్తుత్యుండవును = స్తుతింపబడువాడవు; యజ్ఞ = యజ్ఞము యందలి; క్రతు = కర్మముల; రూపుండవు = రూపముకలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; పరిభ్రష్ట = మిక్కిలిచెడ్డ; కర్ములము = పనులుచేయువారము; ఐ = అయ్యి; ఆకాంక్షించు = కోరుతున్న; మాకున్ = మాకు; ప్రసన్నుండవు = దయకలవాడవు; అగుము = అగుము; భవదీయ = నీ యొక్క; నామ = నామములను; సంకీర్తనంబులన్ = చక్కగాకీర్తించుటవలన; సకల = సమస్తమైన; యజ్ఞ = యజ్ఞముయొక్క; విఘ్నంబులు = ఆటంకములు; నాశంబున్ = నాశనమును; ఒందున్ = పొందును; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కరింతుము = నమస్కరించెదము. అని = అని; తన్నున్ = తనను; సకల = సమస్తమైన; జనములున్ = వారు; వినుతించినన్ = విజ్ఞప్తిచేయగ; హరి = నారాయణుడు; భవుండు = శివుడు; విఘ్నమున్ = అంతరాయము; కావించిన = కలిగించిన; ఆ = ఆ; దక్షుని = దక్షుని; యజ్ఞము = యాగమును; ఘనముగన్ = గొప్పగ; చెల్లించెన్ = పూర్తిచేయించెను; కొఱత = కొరత; కాకుండగన్ = లేకుండగా. సకల = సమస్తమును; ఆత్ముడు = తానైనవాడు; తాన్ = తాను; అగుటను = అగుటచేత; సకల = సమస్త; హవిస్ = హవిస్సులకు; భోక్త = భుజించువాడు; అయ్యున్ = అయినప్పటికిని; జలజాక్షుండు = హరి {జలజాక్షుడు - జలజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; ప్రకటన్ = ప్రసిద్దముగ; స్వ = తన; భాగమునను = భాగముతోనే; ఆ = ఆ; అకళంకుడు = మచ్చలేనివాడు; తృప్తిన్ = సంతృప్తిని; పొంది = పొంది; అనె = అనెను; దక్షుని = దక్షుని; తోన్ = తోటి.

భావము:
బ్రాహ్మణులు ఇలా అన్నారు. “దేవా! ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు - అన్నీ నీవే. నీవు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహరూపం ధరించి, ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకి ఎత్తినట్లు నీ కోరకొనతో పాతాళంనుండి భూమిని పైకి లేవనెత్తావు. యోగులు నిన్ను స్తుతిస్తారు. నీవు యజ్ఞస్వరూపుడవు. వేదకర్మలు ఆచరింపక భ్రష్టులమైన మాపై దయ చూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాలలో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. అని ఈ విధంగా సమస్త జనులూ తనను స్తుతించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన దక్షుని యజ్ఞాన్ని ఏ కొరత లేకుండ చక్కగా పూర్తి చేయించాడు. తాను సకలాంతర్యామియై సకల హవిస్సులను భుజించేవాడై కూడ తన భాగమైన ‘త్రికపాల పురోడాశం’ మంత్రంతోనే తృప్తిపడి దక్షునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=206

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, July 21, 2017

దక్ష యాగము - 95

4-203-సీ.
"నళినాక్ష! విను; భవన్మాయా వశంబున; 
దేహంబుఁ దాల్చి తద్దేహమందు
నాత్మ నహమ్మ మేత్యభిమానమును బొంది; 
పుత్ర జాయా గృహ క్షేత్ర బంధు
ధన పశు ముఖ వస్తుతతుల సంయోగ వి; 
యోగ దుఃఖంబుల నొందుచుండు
ధృతి విహీనుఁడు నసద్విషయాతిలాలసుఁ; 
డతి దుష్టమతియు నై నట్టివాఁడు
4-203.1-తే.
దవిలి భవదీయ గుణ సత్కథా విలోలుఁ
డయ్యెనేనియు నాత్తమోహంబు వలనఁ
బాసి వర్తించు విజ్ఞానపరత గలిగి
చిరదయాకార! యిందిరాచిత్తచోర!"

టీకా:
నళినాక్ష = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; విను = వినుము; భవత్ = నీ యొక్క; మాయన్ = మాయ; వశంబునన్ = లొంగుటచేత; దేహంబున్ = శరీరమును; దాల్చి = ధరించి; తత్ = ఆ; దేహము = శరీరము; అందున్ = లో; ఆత్మన్ = మనసులో; అహం = నేను; మమ = నాది; ఇతి = అని; అభిమానమును = గర్వమును; పొంది = పొంది; పుత్ర = పుత్రులు; జాయా = భార్య; గృహ = గృహములు; క్షేత్ర = భూములు; బంధు = బంధువులు; ధన = సంపదలు; పశు = పశువులు; ముఖ = మొదలగు; వస్తు = పదార్థముల; తతులు = సమూహముల; సంయోగ = సంయోగములు; వియోగ = వియోగములవలన; దుఃఖంబులన్ = దుఃఖములను; ఒందుచుండు = పొందుతుండును; ధృతి = ధైర్యము; విహీనుడు = లేనివాడు; అసత్ = అసత్యమైన; విషయా = విషయార్థములందు; అతి = మిక్కలి; లాలసుడు = ఆసక్తిచెందువాడు; అతి = మిక్కలి; దుష్టమతి = చెడ్డ; మతియున్ = హదయముకలవాడు; ఐనట్టి = అయినటువంటి; వాడు = వాడు; తవిలి = పూని; భవదీయ = నీ యొక్క; గుణ = గుణములు; సత్ = మంచి; కథా = కథల యందు; విలోలుడు = మిక్కిలి వర్తించువాడు; అయ్యెనేనియున్ = అయినప్పటికి; ఆ = ఆ; తమో = తమస్సు; మోహంబు = మోహముల; వలన = వలన; పాసి = విడిచి; = వర్తించు = వర్తించును; విజ్ఞాన = విజ్ఞానము యందు; పరతన్ = ఆసక్తి; కలిగి = కలిగుండి; చిరదయాకార = హరి {చిరదయాకార - చిర (మిక్కిలి) దయ (కృప)కి స్వరూపమైనవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = హరి {ఇందిరాచిత్తచోర - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించినవాడు), విష్ణువు}.

భావము:
“కమలనయనా! విను. నీ మాయకు వశుడై మానవుడు దేహం ధరించి, ఆ దేహంపై ‘నేను, నాది’ అని ఆసక్తి పెంచుకుంటాడు. కొడుకు, భార్య, ఇల్లు, పొలము, చుట్టాలు, ధనం, పశువులు మొదలైన వాటి సంయోగ వియోగాల వల్ల దుఃఖిస్తాడు. దయామయా! లక్ష్మీప్రియా! అలాంటి ధైర్యహీనుడు, ఇంద్రియార్థాలలో మిక్కిలి ఆసక్తి కలవాడు, చెడ్డ మనస్సు కలవాడు కూడా నీ గుణాలకు సంబంధించిన సత్కథలను వింటే ఆ అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం పొందుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=203

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Thursday, July 20, 2017

దక్ష యాగము - 94

4-201-మ.
"హర పంకేజభ వామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో
యరవిందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశ సంభూతులై
పరఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్; దేవ! యీ
శ్వర! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవా! శ్రీశ! రక్షింపుమా."
4-202-వ.
విద్యాధరు లిట్లనిరి.

టీకా:
హర = శివుడు; పంకేజభవ = బ్రహ్మదేవుడు; అమర = దేవతలు; ఆదులు = మొదలగువారు; మరీచి = మరీచి; ఆది = మొదలగు; ప్రజానాథులు = ప్రజాపతులు; ఓ = ఓ; అరవిందాక్ష = విష్ణుమూర్తి; రమాహృదీశ = విష్ణుమూర్తి; భవదీయ = నీ యొక్క; అంశ = భాగములో; అంశ = భాగమున; సంభూతులు = జనించినవారు; పరగన్ = ప్రసిద్దముగ; తావక = నీ యొక్క; లీల = లీలకొరకు; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లు; ఈ = ఈ; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; దేవ = హరి; ఈశ్వర = హరి; నీకున్ = నీకు; ఏము = మేము; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; దేవా = హరి; శ్రీశ = హరి {శ్రీశ - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు)కి ఈశ (ప్రభువు), విష్ణువు}; రక్షింపుమా = కాపాడుము. విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“కమలలోచనా! లక్ష్మీహృదయేశ్వరా! దేవా! ఈశ్వరా! శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాలచేత జన్మించారు.ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. మమ్మల్ని పాలించు.” విద్యాధరులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=201

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

దక్ష యాగము - 93

4-199-మ.
"మును కల్పాంతమునందుఁ గుక్షి నఖిలంబున్దాఁచి యేకాకివై
జనలోకోపరి లోకవాసులును యుష్మత్తత్త్వమార్గంబు చిం
తనముం జేయఁ బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం
చిన నీ రూపము నేఁడు చూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా!"
4-200-వ.
గంధర్వు లిట్లనిరి.

టీకా:
మును = పూర్వము; కల్పాంతము = కల్పము యొక్క అంతము; అందున్ = సమయమునందు; కుక్షిన్ = కడుపులో; అఖిలంబున్ = సమస్తమును; దాచి = దాచి; ఏకాకివి = ఉన్నవాడవు ఒక్కడవే; ఐ = అయ్యి; జనలోక = జనలోకము; ఉపరి = పైనున్న; లోక = లోకముల నుండు; వాసులును = వసించువారును; యుష్మత్ = నీ యొక్క; తత్త్వమార్గంబున్ = తత్త్వ విధానమును; చింతనమున్ = ఆలోచన; చేయన్ = చేయగా; పయోధి = సముద్రము; అందున్ = లో; అహిరాట్ = శేష {అహిరాట్టు - అహి (సర్పము) లందు రాట్టు (రాజు), ఆదిశేషుడు}; తల్పంబునన్ = శయ్యయందు; పవ్వళించిన = శయనించిన; = నీ = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; నేడు = ఈవేళ; చూపితివి = చూపించితివి; లక్ష్మీనాథ = విష్ణుమూర్తి; దేవోత్తమా = దేవతలలో ఉత్తముడ. గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“శ్రీపతీ! దేవాధిదేవా! పూర్వం ప్రళయకాలంలో సర్వాన్ని కడుపులో దాచుకొని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు జనలోకానికన్నా పైలోకాలలో ఉండే సిద్ధపురుషులు నీ సత్య స్వరూపాన్ని మనస్సులో మననం చేయగా ఆనాడు పాలసముద్రం మధ్యలో పన్నగరాజు తల్పంపై పవ్వళించి ఉన్న నీ దివ్య స్వరూపాన్ని ఈనాడు మళ్ళీ మాకుచూపించావు.” గంధర్వులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=199

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :

Tuesday, July 18, 2017

దక్ష యాగము - 92:

4-197-మ.
"హవరక్షా చరణుండ వై నెగడు దీ; వయ్యగ్నిహోత్రాది పం
చవిధంబున్ మఱి మంత్రపంచక సుసృష్టంబై తగంబొల్చు నా
హవరూపం బగు నీకు మ్రొక్కెదను; నీ యాజ్ఞన్ భువిన్ హవ్యముల్
సవనవ్రాతములన్ వహింతు హరి! యుష్మత్తేజముం బూనుచున్."
4-198-వ.
దేవత లిట్లనిరి.

టీకా:
హవ = యజ్ఞమును; రక్షా = రక్షించుటను; ఆచరణుండవు = చేయవాడవు; ఐ = అయ్యి; నెగడుదువు = అతిశయించుదువు; ఈవ = నీవే; అగ్నిహోత్రాది = అగ్నిహోత్రది {అగ్నిహోత్రది పంచకము- 1 అగ్నిహోత్రము 2 హవిస్సు 3 వేదిక 4నేయి 5 హోమముచేయువాడు}; పంచ = ఐదు (5); విధంబున్ = విధములును; మఱి = మరియు; మంత్రపంచక = ఐదు (5) మంత్రములుచే; సు = చక్కగా; సృష్టంబు = చేయబడినది; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; పొల్చు = విలసిల్లు; ఆ = ఆ; హవ = యజ్ఞ; రూపంబు = స్వరూపము; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదను = నమస్కరించెదను; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞతో; భువిన్ = లోకమున; హవ్యముల్ = హవ్యము {హవ్యము - అగ్నుహోత్రమున వేల్చుటకు ఇగిర్చిన అన్నము,నేయి}; సవనవ్రాతములన్ = యజ్ఞమందలి స్తోత్రముల సమూహములు; వహింతు = నిర్వహింతును; హరి = నారాయణ; యుష్మత్ = నీ యొక్క; తేజమున్ = తేజమును; పూనుచున్ = ధరించి. దేవతలు = దేవతలు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“హరీ! నీవు యజ్ఞాలను రక్షిస్తావు. ఐదు అగ్నిహోత్రాలు, ఐదు మంత్రాలు గల యజ్ఞమూర్తివి నీవే. నీవు హోమస్వరూపుడవు. నీ తేజస్సును దాల్చి నీ ఆజ్ఞానుసారం నేను యజ్ఞాలలో హోమద్రవ్యాలైన హవ్యలను ధరిస్తున్నాను. దేవతలు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=197

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Monday, July 17, 2017

దక్ష యాగము - 91

4-194-వ.
శబ్దబ్రహ్మ యిట్లనియె.
4-195-చ.
"హరి! భవదీయ తత్త్వము సమంచితభక్తి నెఱుంగ నేను నా
సరసిజ సంభవాదులును జాలము; సత్త్వగుణాశ్రయుండవున్
బరుఁడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్డు నిం
దఱముఁ జతుర్విధార్థ ఫలదాయక! మ్రొక్కెద మాదరింపవే."
4-196-వ.
అగ్నిదేవుం డిట్లనియె.

టీకా:
శబ్దబ్రహ్మ = శబ్దబ్రహ్మ {శబ్దబ్రహ్మ - ఆకాశమనబడుదేవుడు, పరాపశ్యంతిమధ్యమవైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును}; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను. హరి = నారాయణ; భవదీయ = నీ యొక్క; తత్త్వము = స్వరూపము; సమ = చక్కగా; అంచిత = ఒప్పుతున్న; భక్తిన్ = భక్తితో; ఎఱుంగన్ = తెలియుటకు; నేనున్ = నేను; ఆ = ఆ; సరసిజసంభవ = బ్రహ్మదేవుడు; ఆదులును = మొదలైనవారమును; చాలము = సమర్థులముకాము; సత్త్వగుణాశ్రయుండవున్ = నారాయణుడవు {సత్త్వగుణాశ్రయుండు - సత్త్వగుణములను ఆశ్రయించి యుండువాడు, విష్ణువు}; పరుడవు = నారాయణుడవు {పరుడవు - సమస్తమునకు పరము (అతీతము) యైనవాడు, విష్ణువు}; నిర్గుణుండవును = నారాయణుడవు {నిర్గుణుడు - సత్త్వాది త్రిగుణములను లేనివాడు, విష్ణువు}; బ్రహ్మమున్ = నారాయణుడవు {బ్రహ్మము - పరబ్రహ్మస్వరూపుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తగు = తగిన; నీకున్ = నీకు; ఎప్డును = ఎప్పుడును; ఇందఱమును = మేమందఱము; చతుర్విధఫలప్రదాయక = నారాయణ {చతుర్విధఫలప్రదాయక - చతుర్విధ (నాలుగు విధములైన) ఫల (పురుషార్థములను, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములను) ప్రదాయక (చక్కగానిచ్చువాడు), విష్ణువు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఆదరింపవే = ఆదరింపుము. అగ్నిదేవుండు = అగ్నిదేవుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:
శబ్దబ్రహ్మ ఇలా అన్నారు. “హరీ! నీ అసలైన రహస్యాన్ని గ్రహించటానికి ఉత్తమ భక్తియుక్తులమైన నేనుగాని, బ్రహ్మ మొదలైనవారు గాని సమర్థులం కాదు. నీవు సత్త్వగుణానికి నిలయమైనవాడవు. పరాత్పరుడవు. నిర్గుణుడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థ ఫలాలను నీవు ప్రసాదిస్తావు. అటువంటి నీకు మేమంతా సంతతం నమస్కరిస్తున్నాము. మమ్ము ఆదరించు.” అగ్నిదేవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=195

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, July 16, 2017

దక్ష యాగము - 90

4-192-వ.
యోగీశ్వరు లిట్లనిరి.
4-193-సీ.
"విశ్వాత్మ! నీ యందు వేఱుగా జీవులఁ; 
గనఁ డెవ్వఁ; డటు వానికంటెఁ బ్రియుఁడు
నీకు లేఁ; డయినను నిఖిల విశ్వోద్భవ; 
స్థితి విలయంబుల కతన దైవ
సంగతి నిర్భిన్న సత్త్వాది గుణవిశి; 
ష్టాత్మీయ మాయచే నజ భవాది
వివిధ భేదము లొందుదువు స్వస్వరూపంబు; 
నం దుండుదువు; వినిహత విమోహి
4-193.1-తే.
వగుచు నుందువు గద; ని న్ననన్యభక్తి
భృత్యభావంబుఁ దాల్చి సంప్రీతిఁ గొల్చు
మమ్ము రక్షింపవే; కృపామయ! రమేశ! 
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!"

టీకా:
యోగీ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి. విశ్వాత్మ = నారాయణ {విశ్వాత్మ - విశ్వమే ఆత్మ(స్వరూపము)గా కలవాడు, విష్ణువు}; నీ = నీ; అందు = నుండి; వేఱుగా = ఇతరము అగునట్లు; జీవులన్ = సమస్తజీవములను; కనడు = చూడడు; ఎవ్వడు = ఎవడో; అటువాని = అటువంటివాని; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; = నీకున్ = నీకు; లేడు = లేడు; అయినను = అయినప్పటిటకిని; నిఖిల = సమస్తమైన; విశ్వ = భువన; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; విలయంబుల = లయముల; కతన = కోసము; దైవ = దైవత్వ; సంగతిన్ = కూడుటచేత; నిర్భిన్న = నశించని; సత్త్తాదిగుణ = త్రిగుణములతో {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; విశిష్ట = ప్రత్యేకమైన; ఆత్మీయ = స్వంత; మాయన్ = మాయ; చేన్ = చేత; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; భేదములన్ = భేదములుకల రూపములను; ఒందుదువు = పొందుతావు; స్వ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = లోను; ఉండుదువు = ఉంటావు; వినిహత = బాగుగాపోగొట్టబడిన; విమోహివి = మోహము కలిగినవాడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; కదా = కదా. నిన్ను = నిన్ను; అనన్య = అనితరమైన; భక్తిన్ = భక్తితో; భృత్యు = సేవక; భావంబున్ = భావమును; తాల్చి = ధరించి; సంప్రీతిన్ = మిక్కిలిప్రీతితో; కొల్చు = సేవించు; మమ్మున్ = మమ్ములను; రక్షింపవే = కాపాడుము; కృపామయ = దయామయ; రమేశ = నారాయణ {రమేశ - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ (భర్త), విష్ణువు}; పుండరీకాక్ష = నారాయణ {పుండరీకాక్ష - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సంతతభువనరక్ష = నారాయణ {సంతతభువనరక్ష - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్ష (రక్షించువాడు), విష్ణువు}.

భావము:
యోగీశ్వరులు ఇలా అన్నారు. “ఓ విశ్వస్వరూపా! ఈ విశ్వంలోని జీవులను నీకంటె వేరుగా చూడనివాడు నీకు మిక్కిలి ఇష్టుడు. నీవు లోకాల సృష్టి, స్థితి, లయల కోసం బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన అనేక భేదాలను పొందుతావు. సత్త్వరజస్తమస్సులనే వేరు వేరు గుణాలతో కూడిన నీ మాయవల్ల ఇలా చేస్తూ స్వస్వరూపాన్ని ధరిస్తూ ఉంటావు. ఓ కరుణామయా! కమలాప్రియా! కమలనయనా! నిరంతర నిఖిల భువన రక్షా! భృత్యభావంతో, అత్యంతానురక్తితో అనన్య భక్తితో నిన్ను సేవించే మమ్ము కాపాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=193

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, July 15, 2017

దక్ష యాగము - 89:

4-191-సీ.
"దేవాదిదేవ! యీ దృశ్యరూపంబగు; 
సుమహిత విశ్వంబుఁ జూచు ప్రత్య
గాత్మభూతుండ వై నట్టి నీవు నసత్ప్ర; 
కాశ రూపంబులై గలుగు మామ
కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ; 
నొందించి పంచభూతోపలక్షి
తంబగు దేహి విధంబునఁ గానంగఁ; 
బడుదువు గాని యేర్పడిన శుద్ధ
4-191.1-తే.
సత్త్వగుణ యుక్తమైన భాస్వత్స్వరూప
ధరుఁడవై కానఁబడవుగా? పరమపురుష! 
యవ్యయానంద! గోవింద! యట్లు గాక
యెనయ మా జీవనము లింక నేమి కలవు?"

టీకా:
దేవాధిదేవ = నారాయణ {దేవాధిదేవ - దేవతలకే అధిదేవత, విష్ణువు}; ఈ = ఈ; దృశ్య = కనబడెడి; రూపంబున్ = రూపము; అగు = అయినట్టి; సు = మంచి; మహిత = మహిమకలగిన; విశ్వంబున్ = జగమును; చూచు = చూసెడి; ప్రత్యగాత్మభూతుండవు = ప్రత్యగాత్మభూతుడవు; ఐనట్టి = అయినట్టి; నీవు = నీవు; అసత్ = సత్యముకాని; ప్రకాశ = ప్రకాశము యొక్క; రూపంబులు = రూపులము; ఐ = అయ్యి; కలుగు = ఉండెడి; మామక = మాయొక్క; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చేతన్ = చేత; ఈశ్వర = నారాయణ; నీ = నీ; మాయన్ = మాయను; ఒందించి = చెంది; పంచభూత = పంచభూతములందు; ఉపలక్షితంబు = ప్రవర్తించునది; అగు = అయిన; దేహి = దేహముకలవాని; విధంబునన్ = విధముగ; కానంగబడుదువు = కనబడెదవు; కాని = కాని; ఏర్పడిన = సిద్ధించిన; శుద్ధ = పరిశుద్ధమైన. 
సత్త్వగుణ = సత్త్వగుణముతో; యుక్తము = కూడినది; ఐన = అయినట్టి; భాస్వత్ = ప్రకాశవంతమైన; రూప = రూపము; ధరుడవు = ధరించినవాడవు; ఐ = అయ్యి; కానబడవుగా = కనబడవుకదా; పరమపురుష = నారాయణ {పరమపురుషుడు - సర్వమునకు పరమము (అతీతము) యైన పురుషుడు, విష్ణువు}; అవ్యయానంద = నారాయణ {అవ్యయానంద -అవ్యయము (తగ్గిపోని) ఆనందము కలవాడు వాడు, విష్ణువు}; గోవింద = నారాయణ {గోవింద - గోవులకు ఒడయుడు}; అట్లుగాన = అందుచేత; ఎనయన్ = పొందుటకు; మా = మా యొక్క; జీవనములన్ = జీవితములలో; ఇంక = ఇంకను; ఏమి = ఏమి; కలవు = ఉన్నది.

భావము:
“దేవాదిదేవా! ఈ కనిపించే విశ్వాన్ని నీవు వేరుగా ఉండి చూస్తావు. నీవు బహిర్ముఖాలైన మా ఇంద్రియాలకు పంచభూతోపలక్షితమైన జీవివలె కనిపిస్తావు. ఇదంతా నీ మాయా విలాసం. ఓ అవ్యయానందా! గోవిందా! పురుషోత్తమా! శుద్ధ సత్త్వ గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు. ఏమి బ్రతుకులయ్యా మావి?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=191

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, July 14, 2017

దక్ష యాగము - 88

4-189-చ.
"కర చరణాదికాంగములు గల్గియు మస్తము లేని మొండెముం
బరువడి నొప్పకున్న గతిఁ బంకజలోచన! నీవు లేని య
ధ్వరము ప్రయాజులం గలిగి తద్దయు నొప్పక యున్న దీ యెడన్
హరి! యిటు నీదు రాక శుభ మయ్యె రమాధిప! మమ్ముఁ గావవే."
4-190-వ.
లోకపాలకు లిట్లనిరి.

టీకా:
కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మొదలైన; అంగములు = అవయవములు; కల్గియు = ఉండియు; మస్తము = తల; లేని = లేని; మొండెమున్ = మొండెము; పరువడి = చక్కగా; ఒప్పకున్న = శోభిల్లకున్న; గతిన్ = విధముగ; పంకజలోచన = నారాయణ {పంకజలోచన - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; నీవు = నీవు; లేని = లేని; అధ్వరము = యజ్ఞము; ప్రయాజులన్ = యఙ్ఙపరికరములను; కలిగి = కలిగున్నప్పటికిని; తద్దయున్ = మిక్కిలి; ఒప్పక = శోభలేక; ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; ఎడన్ = సమయమునందు; హరి = నారాయణ; ఇటు = ఈవిధముగ; నీదు = నీయొక్క; రాక = వచ్చుట; శుభము = మంచిది; అయ్యెన్ = అయినది; రమాధిప = నారాయణ {రమాధిప - రమ (లక్ష్మీదేవి) యొక్క అధిప (భర్త), విష్ణువు}; మమ్మున్ = మమ్ములను; కావవే = రక్షింపుము. లోకపాలకులు = లోకపాలకులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు అన్నీ ఉన్నా తలలేని మొండెము శోభిల్లదు. అలాగే ప్రయాజలు మొదలైన ఇతర అంగాలెన్ని ఉన్నా నీవు లేని యజ్ఞం శోభిల్లలేదు. ఇప్పటి నీ రాక శుభదాయకం. మధవా! మమ్ము కాపాడు.” లోకపాలకులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=189

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::