Sunday, June 25, 2017

దక్ష యాగము - 72:

4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
నను దండించు టది దండనము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!
4-160-సీ.
అనఘాత్మ! తగ నీవు నబ్జనాభుండును; 
బరికింపఁ బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నెవ్వలన నుపేక్షింప; 
రఁట! దృఢవ్రతచర్యు లైనవారి
యెడ నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని; 
నామ్నాయ సంప్రదాయప్రవర్త
నము నెఱింగించుట కమర విద్యాతపో; 
వ్రత పరాయణులైన బ్రాహ్మణులను
4-160.1-తే.
వరుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గేల దండంబుఁ బూని గోపాలకుండు
బలసి గోవుల రక్షించు పగిది నీవు
నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర!

టీకా:

విను = వినుము; నీకున్ = నీ ఎడల; అపరాధుడను = అపరాధము చేసినవాడను; అగు = అయిన; నను = నన్ను; దండించుట = శిక్షించుట; అది = అది; దండనము = దండనము; కాదు = కాదు; మదిన్ = అది; నను = నన్ను; రక్షించుట = రక్షించుట; కాన్ = అగునట్లు; మనమునన్ = మనసులో; తలంతును = తలుస్తాను; దేవ = దేవుడ {దేవ - దేవుడు, శివుడు}; అభవ = శివుడ {అభవ - పుట్టుకలేనివాడు, శివుడు}; పురహర = శివుడ {పురహర - త్రిపురములను హరించినవాడు, శివుడు}; రుద్రా = శివుడ {రుద్రుడు - రౌద్రము కలవాడు, శివుడు}.
అనఘాత్మ = పుణ్యాత్మ; తగన్ = తగ; నీవున్ = నీవును; అబ్జనాభుండును = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు}; పరికింప = సరిగచూసిన; బ్రాహ్మణ = బ్రహ్మణులలో; అభాసులు = బ్రష్టులు; అయిన = అయిన; వారల = వారి; ఎడ = అందు; ఎవ్వలనను = ఏవిధముగ; ఉపేక్షింపరట = నిర్లక్ష్యముచేయరట; దృఢ = గట్టి; వ్రతచర్యులు = విధముగ చరించువారు; ఐన = అయిన; వారి = వారి; ఎడ = అందు; నీకున్ = నీకు; ఉపేక్ష = అశ్రద్ధ; ఎక్కడిది = ఎక్కడిది; సర్గ = సృష్టి; ఆదిని = మొదటిలో; ఆమ్నాయ = వేదముల; సంప్రదాయమున్ = సంప్రదాయమును; ప్రవర్తనమున్ = విధానమును; ఎఱింగించుట = తెలుపుట; కున్ = కు; అమర = దేవతలను; విద్యా = విద్య; తపస్ = తపస్సు; వ్రత = వ్రతములందు; పరాయణులు = నిష్ఠకలవారు; ఐన = అయిన; బ్రాహ్మణులను = బ్రహ్మణులను. 
వరుసన్ = వరుసగా; పుట్టించితివి = పుట్టించితివి; కాన = కావున; వారినిన్ = వారిని; ఎపుడున్ = ఎప్పుడును; కేలన్ = చేతితో; దండంబున్ = కర్ర; పూని = ధరించి; గోపాలకుండు = గోవులుకాచెడివాడు; బలిసి = అతిశయించి; గోవులన్ = ఆవులను; రక్షించు = కాపాడు; పగిది = విధముగ; నీవున్ = నీవును; అరసి = చక్కగచూసి; రక్షించుచుందు = కాపాడుతుంటావు; కదు = కదా; అయ్య = తండ్రి; రుద్రా = శివ.

భావము:

“దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను. పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కర్ర చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=160

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: