Monday, June 19, 2017

దక్ష యాగము - 66:

4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?" యని.
4-149-సీ.
"మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల; 
మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ
బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ; 
దగిలి మర్మాత్మ భేదకము లయిన
బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు; 
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ; 
వంటి సత్పురుషుఁ డేవలన నైన
4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత! 
నీలలోహిత! మహితగుణాలవాల! 
లోకపాలనకలిత! గంగాకలాప! 
హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక.

టీకా:
అట్లు = ఆవిధముగ; అగుటన్ = అవుట; చేసి = వలన; తత్ = ఆ; కర్మంబులు = పనులు; ఒకానొకనికి = ఏవరో ఒకనికి; విపర్యాయంబు = వ్యత్యాసము; ఒందుట = కలుగుట; కున్ = కి; కారణంబున్ = హేతువు; ఎయ్యదియో = ఏదో; భవదీయ = నీ యొక్క; రోషంబు = కోపము; హేతువు = కారణము; అని = అని; తలంచితిన్ = అనుకొందము; ఏనిన్ = అంటే; త్వదీయ = నీయొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మములందు; నిహిత = లగ్నమైన; చిత్తులు = మనసులుకలవారు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; భూతంబుల = భూతముల; అందున్ = లోను; నినున్ = నిన్నే; కనుంగొనుచున్ = దర్శిస్తూ; భూతంబులన్ = భూతములను; ఆత్మ = తమ; అందున్ = లో; వేఱు = వేరు; కాన్ = అగునట్లు; చూడక = చూడకుండగ; వర్తించు = ప్రవర్తించు; మహాత్ముల = గొప్పవారి; అదున్ = లో; అజ్ఞులు = జ్ఞానములేనివారు; ఐన = అయిన; వారిన్ = వారి; అందున్ = లో; పోలెన్ = వలె; రోషంబున్ = కోపము; తఱచు = తరచుగా; ఒరయదట = కలుగదట; నీకున్ = నీకు; క్రోధంబున్ = కోపము; కలదే = ఉందా ఏమి; అని = అని. మఱి = మరి; భేద = వైమనస్యమైన; బుద్ధిన్ = బుద్ధితో; కర్మ = కర్మలందు; ప్రవర్తనముల = నడచుటలలో; మద = మదముతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; దుష్ట = దుర్మార్గపు; హృదయులు = హృదయములు కలవారు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; విభవ = వైభవములవలన; అసహ్య = సహించలేకపోవుటచే; భవ = కలిగిన; మనస్ = మానసిక; వ్యాధులన్ = వ్యాధులకు; తగిలి = తగుల్కొని; మర్మా = ప్రాణముల; ఆత్మ = మూలముల; భేదకములు = బద్దలుకొట్టునవి; అయిన = అయినట్టి; బహు = అనేకమైన; దురుక్తుల్ = చెడుమాటల; చేతన్ = తోటి; పరులన్ = ఇతరులను; పీడించుచున్ = బాధిస్తూ; ఉండు = ఉండెడి; మూఢులను = మూర్ఖులను; దైవోపహతులు = మాయోవిమోహితులు; కాన్ = అగనట్లు; తలపోసి = అనుకొని; ఆ = ఆ; కపట = మోసపూరిత; చిత్తులు = మనసులు కలవారి; కున్ = కి; నీ = నీ; వంటి = లాంటి; సత్ = మంచి; పురుషుడు = పురుషుడు; ఏవలనన్ = ఏవిధముగ; ఐన = అయిన. హింస = హింసించుట; కావింపకుండు = చేయకుండును; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిధ్ధ; చరిత = వర్తనకలవాడ; నీలలోహిత = శివ {నీలలోహితుడు - నీలవర్ణము లోహితవర్ణములతో కూడినవాడు, శివుడు}; మహితగుణాలవాల = శివ {మహితగుణాలవాలుడు - మహిత (గొప్ప) గుణాల (గుణముల)అలవాల (పాదువంటివాడు), శివుడు}; లోకపాలనకలిత = శివ {లోకపాలనకలిత - లోకములను పాలించువాడు, శివుడు}; గంగాకలాప = శివ {గంగాకలాప - గంగ (గంగదేవి)ని కలాప (భూషణముగ కలవాడు), శివుడు}; హర = శివ {హరుడు - లయకారుడు, శివుడు}; జగన్నుతచారిత్ర = శివ {జగన్నుతచారిత్ర - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్ర (చరిత్ర కల వాడు), శివుడు}; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:
అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=149

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: