Thursday, June 1, 2017

దక్ష యాగము - 50:


4-119-క.
మును దక్షుఁ డభవుఁ బలుకఁ 'గఁ
గను గీఁటిన' భగునిఁ బట్టి కన్నులు పెకలిం
చెను నందీశ్వరుఁ; డచ్చటి
జనముల హాహారవంబు సందడి గొలుపన్.
4-120-తే.
కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ
'బరిహసించిన' పూషుని పండ్లు డుల్లఁ
గొట్టె బలభద్రుఁ డా కళింగుని రదంబు
లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు.

టీకా:
మును = ఇంతకుముందు; దక్షుడు = దక్షుడు; అభవున్ = శివుని; పలుకగ = తిడుతుండగ; కనుగీటిన = కనుగీటినట్టి; భగుని = భగుని యొక్క; కన్నులు = కళ్ళు; పెకలించెను = పీకెను; నందీశ్వరుడు = నందీశ్వరుడు; అచటి = అక్కడి; జనములు = జనులు; హాహా = హాహ అనెడి; రవంబున్ = శబ్దములను; సందడిగొలుపన్ = గగ్గోలుపెట్టగ. కుపితుడు = కోపము కలవాడు; ఐ = అయ్యి; నాడు = ఆవేళ; భవుని = శివుని; దక్షుడు = దక్షుడు; శపింపన్ = శపిస్తుండగ; పరిహసించిన = విపరీతముగ నవ్విన; పూషుని = పూషుని; పండ్లు = దంతములు; డుల్లగొట్టెను = ఊడగొట్టెను; బలభద్రుడు = బలభద్రుడు; ఆ = ఆ; కళింగుని = కళింగుడు అనెడివాని; రదంబులు = పండ్లు; ఎలమిన్ = పౌరుషముతో; డులిచిన = ఊడగొట్టిన; పగిదిన్ = విధముగ; చండీశ్వరుండు = చండీశ్వరుడు.

భావము:
పూర్వం దక్షుడు శివుని నిందించినప్పుడు కన్ను గీటిన భృగుని పట్టుకొని నందీశ్వరుడు అక్కడి జనం హాహాకారాలు చేస్తుండగా అతని కన్నులను పెకలించాడు. ఆనాడు దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను బలభద్రుడు కళింగుని దంతాలను రాలగొట్టినట్లు చండీశ్వరుడు రాలగొట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=120

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: